తన కాళ్లతో తలరాతను తిరిగి రాసుకున్న విద్యార్థి...

చదువుకోవాలనే ఆరాటంతో త‌న ఆంగ‌వైకల్యాన్ని జయించి ఎందరో విద్యార్థుల‌కు స్ఫూర్తినిస్తున్నాడు. వైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిరూపిస్తున్నాడు.

news18-telugu
Updated: February 20, 2020, 6:32 PM IST
తన కాళ్లతో తలరాతను తిరిగి రాసుకున్న విద్యార్థి...
Video : తన కాళ్లతో తలరాతను తిరిగి రాసుకున్న విద్యార్థి..
  • Share this:
విధి ఆడిన వింత నాట‌కంలో రెండు చేతులు పోగోట్టుకున్న‌ాడు. రెండు చేతులు లేక పోయినా ఆత్మ‌స్తైర్యంతో తోటి విద్యార్థులతో సమానంగా రాణిస్తున్నాడు. కాళ్లతో రాస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. క్రీడల్లోనూ త‌న స‌త్త‌ాచాటుతున్నాడు. సివిల్ ఇంజినీర్ కావ‌డ‌మే త‌న‌ లక్ష్యం అంటున్నాడు. కాళ్లతో తన తలరాతను తానే తిరగరాసుకుంటున్న నిజామాబాద్ జిల్లా యువకుడిపై ప్ర‌త్యేక క‌థ‌నం.

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సి గ్రామానికి చెందిన షారీఫుద్దీన్, య‌స్మీన్ బేగం దంప‌తుల‌కు ముగ్గురు సంతానం. ఒక కుమార్తె, ఇద్ద‌రు కుమారులు. రెండో సంతానం ష‌య‌న్. ఐదేళ్ల వరకు అందరిలా చలాకీగా ఉన్నాడు. ప్ర‌మాద‌వశ‌త్తూ ష‌య‌న్ కు కరెంట్ షాక్ తగిలి తన రెండు చేతులు కోల్పోయాడు. మోచేతి వరకు చేతులు తొల‌గించారు.

కాలితో రాస్తున్న షయన్


చ‌దువు పై ఉన్న మ‌క్కువ‌తో కుటుంబసభ్యుల‌ ప్రోత్సాహంతో కాళ్ల‌తో వ్రాయడం చేర్చుకున్నాడు. త‌న‌కు చేతులు లేవ‌ని ఎప్పుడూ కుంగిపోలేదు. అలా రాస్తూనే ప్రస్తుతం షయన్ పదో తరగతి చ‌దువుతున్నాడు. తరగతి గదిలో మిగతా విద్యార్థులతో స‌మానంగా చదువుల్లో రాణిస్తున్నాడు.కాలితో కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్న షయన్


త‌న‌కు వైకల్యం ఉన్న సంగ‌తి మ‌రిచిపోయి అందరు విద్యార్థుల‌తో సమానంగా ఆట‌ల్లో సైతం ముందుంటున్నాడు. స్కూల్ కు క్రమం తప్పకుండా సైకిల్ పై వ‌స్తున్నాడు. కాలితో పదో తరగతి బోర్డు ప‌రిక్ష రాస్తే టైం స‌రిపోదని ప‌రిక్ష‌లు రాయ‌డానికి త‌న‌కు ఒక‌రి సాయం కావాల‌ని విద్యాశాఖ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని పరీక్షలకు సిద్దమవుతున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి.. తనకు కృత్తిమ చేతులు అందించాలని కోరుతున్నాడు. సివిల్ ఇంజినీర్ కావడమే తన లక్ష్యమని షయన్ చెబుతున్నాడు..

క్రికెట్ ఆడుతున్న షయన్
బాడ్సిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న షయన్ కు విద్యార్ధులు, ఉపాధ్యాయుల నుంచి మంచి సహకారం ఉంది. ఇటు షయన్ సైతం చదువులో చూపించే ఆసక్తిని చూసి టీచర్స్ ఫిదా అవుతున్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తున్నాడని స్కూల్ హెడ్ మాస్ట‌ర్ రాజ్య‌ల‌క్ష్మి చెబుతారు. త‌ను అంద‌రి విద్యార్థుల‌తో స‌మానంగా అన్ని విష‌యాల్లో పాల్గొంటున్న‌ాడ‌ని చెప్పారు.

వాలీబాల్ ఆడుతున్న షయన్


కరెంట్ షాక్ తో రెండు చేతులు కొల్పోయినా.. కాళ్లతో రాస్తూ ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తున్నాడని తోటి విద్యార్థులు షయన్ ను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. షయాన్ కు మోచేతి వరకు చేతులు లేకున్నా... వాలీబాల్, క్రికెట్, షటీల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ అంటే చచ్చేంత ఇష్టం. స్కూల్ లో జరిగే క్రీడా పోటీల్లో కచ్చితంగా పాల్గొంటాడు.. బెస్ట్ సూడెంట్ గానే కాదు. మంచి వాలీబాల్ ప్లేయర్ గా షయన్ కు స్కూల్ లో మంచి పేరు ఉంది.. కంప్యూట‌ర్ కీ బోర్డులో టైప్ చేస్తూ అంద‌రిని అశ్చ‌ర్య ప‌రుస్తున్నాడు.

షయన్ చదువుకుంటున్న స్కూల్


చదువుకోవాలనే ఆరాటంతో త‌న ఆంగ‌వైకల్యాన్ని జయించి ఎందరో విద్యార్థుల‌కు స్ఫూర్తినిస్తున్నాడు. వైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిరూపిస్తున్నాడు.

(పి.మ‌హేంద‌ర్, న్యూస్18 తెలుగు ప్ర‌తినిధి)

First published: February 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు