Home /News /telangana /

NIZAMABAD SHABBIR ALI VS MADANMOHAN CREATING CONFUSION IN KAMAREDDY CONGRESS BA NZB

Kamareddy: కామారెడ్డిలో హస్తం కుస్తీలు.. ఎర్రబెల్లి అల్లుడితో షబ్బీర్ అలీ ఢీ.. ఓ చిత్రమైన పంచాయతీ

షబ్బీర్ అలీ, మదన్ మోహన్

షబ్బీర్ అలీ, మదన్ మోహన్

జహీరబాద్ పార్లమెంట్ నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ మధ్య పొసగడం లేదు. ఎర్రబెల్లి అల్లుడైన మదన్ మోహన్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో వివాదం మొదలైంది.

ఇంకా చదవండి ...
    (P.Mahendar, News18, Nizamabad)

    తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్‌ చైర్మన్‌ మదన్‌మోహన్‌ రావుపై సస్పెన్షన్‌ వేటుతో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో అధిప‌త్యం కోసం ఇరు వర్గాలు రచ్చకె క్కాయి. ఇరువర్గాలు పరస్పరం విమర్శించుకుంటున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యలు తీసుకున్నామని డీసీసీ అధ్యక్షుడు చెబుతుండగా.. పీసీసీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని సస్పెండ్‌ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడికి ఎక్కడిదంటూ ప్రత్యర్థి వర్గం ప్రశ్నిస్తోంది. కామారెడ్డి జిల్లాకు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ, పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ హోదాలో ఉన్న మాజీ మంత్రి షబ్బీర్‌అలీ దశాబ్దాలుగా పార్టీకి పెద్ద దిక్కులా ఉంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో మదన్‌మోహన్‌రావు జిల్లాలో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో షబ్బీర్‌అలీ వ‌ర్గానికి మ‌ద‌న్ మోహ‌న్ వ‌ర్గానికి మ‌ధ్య అదిప‌త్య పోరు మొద‌లైంది. జిల్లా కాంగ్రెస్‌ పార్టీని కాదని వేరుగా కార్యక్రమాలు చేపట్టడంపై షబ్బీర్‌ అలీ వర్గం ఆగ్ర‌హంతో ఉంది. జహీరాబాద్‌ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన మదన్‌మోహన్‌ కామారెడ్డిలో తన ఇంటి దగ్గర ఓ కార్యాలయాన్ని ప్రారంభించడం..  యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడి ఎన్నికల్లో షబ్బీర్‌అలీ తనయుడిని ఓడించడంతో షబ్బీర్‌ అలీపై ఆధిపత్యం చాటుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం జోరుగా సాగుతుంది.

    ఎల్లారెడ్డి  నియోజకవర్గ కోఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి వర్గం పార్టీ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలు చేపడుతోంది. అయితే మదన్‌మోహన్‌రావు వర్గం వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలా రెండు వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతుండండతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఎల్లారెడ్డి నియోజక వర్గంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య గొడవలు సైతం జరిగాయి. ఫ్లెక్సీలు చించుకున్నారు. దీంతో ఎల్లారెడ్డి లో రెండు వ‌ర్గాలుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది..

    గతంలో జహీరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన మదన్‌మోహన్‌రావుకు జిల్లా అంతటా పరిచయాలు పెరిగాయి. దీంతో ఆయన జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ‌, జుక్క‌ల్  నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు. దీంతో పార్టీలో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. కామారెడ్డి నియోజకవర్గంలో షబ్బీర్‌అలీదే పైచేయిగా ఉన్నా.. ఇటీవల ఆయనను కాదని మదన్‌మోహర్‌రావు జాబ్‌మేళా నిర్వహించారు. దీనికి పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ అజారుద్దీన్‌ను రప్పించడం ద్వారా షబ్బీర్‌అలీకి సవాల్‌ విసిరారని భావిస్తున్నారు.  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా నేతలు విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.

    ఇక బాన్సువాడలోనూ రెండు వర్గాలయ్యాయి. మదన్‌మోహన్‌రావు చర్యలను ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తప్పుపడుతున్నారు. తమ నియోజకవర్గంలో తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సస్పెన్షన్‌ వ్యవహారంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డీసీసీ అధ్యక్షుడిని వివరణ కోరడాన్ని మదన్‌మోహన్‌రావు వర్గం వారికి ఆనుకులంగా బావిస్తున్నారు..   అయితే ఈ రెండువర్గాల మధ్య రోజురోజుకు ముదురుతున్న వివాదంతో పార్టీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు. మరి ఈ విష‌యంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Kamareddy, Nizamabad, Telangana, Tpcc, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు