(P. Mahendar, News 18, Nizamabad)
గుక్కెడు నీటి కోసం గిరిజన తండాలు (Tribal herds) అల్లాడుతున్నాయి. బిందెడు నీటి కోసం గిరిపుత్రులు కిలోమీటర్ల మేర పరుగులు పెడుతున్నారు. దాహార్తి తీర్చుకునేందుకు బావుల వద్ద బారులు తీరుతున్నారు. వేసవి తీవ్రత, అడుగంటుతున్న భూగర్భ జలాలతో నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నీళ్లు దొరక్క మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్న పరిస్థితి.. దశాబ్దాలుగా మంచినీటి సమస్యతో సతమతం అవుతున్న కామారెడ్డి జిల్లా గిరిజన తండాల పరిస్థితి ఇది.
కామారెడ్డి (Kamareddy)జిల్లాలోని గిరిజన పల్లెలు దాహార్తితో అల్లాడుతున్నాయి. గొంతు తడుపుకునేందుకు పల్లె జనం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో సుమారు 100కు పైగా గిరిజన తండాలు ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గం పరిధిలోని గాంధారి మండలంలో తాగునీటి కష్టాలు గిరిజనులకు కంటి మీద కినుకులేకుండా చేస్తున్నాయి. గాందారి మండలంలోని మెజారిటీ గ్రామాలు గుట్టలపై ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల్లో సాగు, తాగు నీటి సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎలాంటి రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలు లేవు. కేవలం వర్షాల మీద ఆధారపడి ఈ ప్రాంత వాసులు జీవిస్తుంటారు..శాశ్వత మంచినీటి పథకాలు లేక.. ఏటా వేసవిలో గుక్కెడు నీటికి అల్లాడుతున్నారు. తాగునీటి కోసం అ వస్థలు పడుతున్నారు.
నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా..
గాంధారి మండలంలోని గిరిజన తాండాల్లో సుమారుగా 500 పై చిలుకు జనాభా ఉంది. ఈ గ్రామాల్లో గ్రామ పంచాయతీ నిర్వహించే మంచినీటి నల్లాలున్నాయి. రోజు ఉదయం పూట అరగంట పాటు నీటీని వదులుతారు. అయితే ఇంటికి కనీసం 2 బిందెల నీళ్ళూ కూడా రావంటున్నారు తండా వాసులు. తండాలకు 2 నుంచి 3 కిలో మీటర్ల దూరంలో ఉండే బోర్ నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని ఈ తండాలకు తరలిస్తున్నారు. ఇక మిషన్ భగీరథ నీరు మాత్రం ఇప్పటికీ ఇంటికి చేరలేదు. చాలా తండాల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోందని గ్రామస్ధులు ఆవేదన చెందుతున్నారు. తాగు, సాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.
పశువులకు సైతం నీరు దొరక్క.. ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నామని జనం అంటున్నారు. ఈ తండా వాసులు బిందెడు నీటికి బండెడు కష్టాలు పడుతున్నారు. ఎడ్ల బండ్లు, ఆటోలు, బైక్ ల మీద పంట పొలాల్లో ఉండే బోర్ల నుంచి బిందెలు, క్యాన్లు, బ్యారళ్ళలో నీటిని తండాకు తెచ్చుకుని అవసరాలు తీర్చుకుంటున్నారు. పెద్ద గుంజాల్ తండా, చిన్న గుజ్జల్ తండా, లొంక తండా, దుర్గం, కొత్తబాద్ తండా, జెమిని తండా, బీర్మల్ తండాలలొ తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది.
ఈ గ్రామల్లో శాశ్వత మంచినీటి పథకాలు లేవు. మిషన్ భగీరథ ట్యాంకులున్నా అరగంట కన్నా ఎక్కువ సేపు కుళాయిల్లో నీరు రావడం లేదని గ్రామస్ధులు చెబుతున్నారు. ఈ తండాల్లో నివసించే గిరిజనులు. 3 రోజులకు ఒక సారి స్నానాలు చేస్తున్నారు. మరికొందరు పురాతన బావుల నుంచి నీటీని తొడ్కుని కాలం వెల్దీలస్తున్నారు. బావుల్లోను నీళ్లు అడుగుంటుతుండటం మరింత ఆందోళన కు గురిచేస్తోంది. తాగు నీటి కష్టాల పై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గిరిజనుల నీటి కష్టాలు తీర్చాలని తండా వాసులు కోరుతున్నారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Water Crisis