(నిజామాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి, పి మహేందర్)
నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీలో అధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. గత ఎన్నికలకు ముందు జిల్లాలో బీజేపీ పార్టీ పరిస్థితి వేరు. ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఇందూరు బీజేపీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంపీ అరవింద్ పార్టీలోకి రాక ముందు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ పార్టీకి పెద్ద దిక్కుగా ఉండే వారు. ధర్మపురి అరవింద్ బీజేపీలోకి ఎంట్రీ తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. యెండల లక్ష్మినారాయణ వర్సెస్ ధర్మపురి అరవింద్ గా మారిపోయిందంటూ పార్టీ శ్రేణులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. యెండల లక్ష్మినారాయణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
అయితే జిల్లాలో ఎంపీ అరవింద్ పార్టీ కార్యక్రమాలు చేస్తే యెండల అతని వర్గీయులు అందులో ఉండరని..అలాగే యెండల పార్టీ కార్యక్రమాలు చేపడితే అరవింద్ కనిపించరనేది పార్టీలో చర్చ. ఢిల్లీ అధిష్టానం ఓ వైపు పార్టీ బలోపేతం కృషి చేస్తోంటే. జిల్లాలో నేతల మధ్య అధిపత్య పోరు పీక్ స్థాయికి తారాస్థాయికి చేరింది. తాజాగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఇంఛార్జులుగా ఎంపీ అరవింద్ అనుచరులకే ఇప్పించుకున్నారంటూ..జిల్లా బీజేపీలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. యెండల లక్ష్మినారాయణ అనుచరులకు ఎవరికీ అసెంబ్లీ ఇంఛార్జీల పోస్టు రాలేదని ఆయన వర్గీయులు అంటున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ , బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ ఇంఛార్జులుగా అరవింద్ కోరుకున్న వారికే పదవులు దక్కాయన్నది యెండల వర్గంలో చర్చ జరుగుతుంది. యెండల అనుచరులకు ఏ ఒక్కరికి కూడా అసెంబ్లీ ఇంఛార్జీ పదవి దక్కకపోవటం ఆయన వర్గీయుల్లో అసంతృప్తి నెలకొందన్న సమాచారం.
జిల్లా బీజేపీలో వర్గ విభేధాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఓ వైపు నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికలో 28 మంది కమలం కార్పోరేటర్లు గెలుపొందారు. గతంలో ఎప్పుడూ ఈ సంఖ్య ఆ పార్టీకి రాలేదు. అయితే జిల్లా నేతల మధ్య సఖ్యత కొరవడటంతో ఇప్పటికే 11 మంది కార్పోరేటర్లు టీఆర్ఎస్ లో చేరిపోయారు. మరికొంత మంది కార్పోరేటర్లు కూడా కమలానికి బై చెప్పి కారెక్కేందుకు సిద్దంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ అరవింద్ కు మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినారాయణ సైతం ప్రస్తుతం యెండల పంచన చేరాన్న ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలో బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఉంటుందని చర్చ జరుగుతోంది. మరోసారి బస్వ లక్ష్మినర్సయ్యకు అవకాశం కనిపించడం లేదు. జిల్లా అధ్యక్ష పదవి సైతం ఎంపీ అరవింద్ కు సన్నిహితుడికి వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
అరవింద్ గత ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో బస్వ పూర్తిగా అరవింద్ గెలుపు కోసం కష్టపడ్డారని పార్టీ నేతలు చెప్పుకుంటారు. అలాంటిది ప్రస్తుతం బస్వ కూడా ఎంపీ అరవింద్ తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారన్న చర్చ పార్జీ వర్గాల్లో జరుగుతోంది. అయితే బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగినట్లైతే బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పల్లె గంగారెడ్డి అరవింద్ తో సఖ్యతగా ఉంటున్నారని. గతంలో అధ్యక్ష పదవి చేశారు. పార్టీ శ్రేణులతో మంచి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో అరవింద్ పల్లె వైపు మొగ్గు చూపుతారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
ఒకవేళ బస్వ లక్ష్మీనర్సయ్యకు మళ్లీ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. దీంతో ఇటు బస్వా లక్ష్మినర్సయ్య ఇటీవల కాలంలో యెండల లక్ష్మినారాయణతో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు పార్టీ క్యాడర్ చెప్పుకుంటోంది. మొత్తానికైతే ఇందూరు బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఎంపి ఆర్వింద్ వ్యూహాలు వచ్చే ఎన్నికల్లో ఎంతవరకు ఫలిస్తాయో చూద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Nizamabad, Telangana, Telangana bjp