(P.Mahendar,News18,Nizamabad)
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు వావి, వరసలు మర్చిపోయాడు. మహిళతో ఏర్పడిన పరిచయంతో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కాపురం చేస్తూనే ఆమె ఆరేళ్ల కూతురి(Six year old girl)పై కన్నేశాడు. తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఊహించని నీచానికి ఒడిగట్టాడు. తాను చేసిన నేరం బయటపడకుండా చేసిన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశాడు. చిన్నారి మృతి చెందడం, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు చనిపోలేదని..అత్యాచారం చేసి అటుపై హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణానికి ఒడిగట్టిన నిందితుడ్ని పోలీసులు (Police)పట్టుకున్నారు.
కూతుర్ని కాటేసిన తండ్రి..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో నివాసముంటున్న దేవకథే గోవిందరావు అనే ఓ కామాంధుడు భర్తను వదిలేసి ఇద్దరు కూతుళ్లతో ఒంటరిగా ఉంటున్న మహిళతో పరిచయం పెట్టుకున్నాడు. హైదరాబాద్ అత్తాపూర్‌లోని కల్లు కాంపౌండ్‌లో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితమే మాధవ నగర్ సాయిబాబా గుడిలో కులాంతర వివాహం చేసుకుని ధర్మారం గ్రామం లోని కర్లపూడి శ్రీనివాస్ రావు వద్ద వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. గోవిందరావు వివాహం చేసుకున్న మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉండగా..ఈనెల 20వ తేది నాడు పెద్ద కుమార్తెకు కాలికి దెబ్బ తగిలిందని డాక్టర్‌కు చూపిస్తానని తీసుకెళ్లాడు.
ఆరేళ్ల కూతురిపై అఘాయిత్యం..
అదే రోజు ఆరేళ్ల చిన్నారిని మెంట్రాజ్‌పల్లి గ్రామం వైపు వెళ్లే రోడ్డు పక్కన బలవంతంగా అత్యాచారం చేసి ఊపిరి ఆడకుండా చేయడంతో బాలిక అపస్మారక స్థితికి వెళ్లింది. వెంటనే గోవిందరావు జరిగిన విషయాన్ని దాచి పెట్టి ఆమెకు తల, కాలుకి గాయం అయినందునే అపస్మారక స్థితికి వెళ్లిందని భార్యను నమ్మించాడు. చికిత్స పేరుతో నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి చిన్నారిని మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాదు లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ఈనెల 23వ తేదిన చనిపోయింది. విషయం తెలిసిన వెంటనే నేరస్తుడు అక్కడి నుంచి పారిపోయాడు.
కటకటాల వెనక్కి కామాంధుడు..
బాలిక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు అత్యాచారం చేసి హతమార్చినట్లుగా నిర్ధారించడంతో మృతురాలి తల్లి డిచ్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నేరస్తుడు గోవిందరావు కోసం గ్రామంలోని ఇంటి దగ్గర నిఘా పెట్టారు. ఈనెల 29వ తేది సొంత ఊరికి వెళ్లి దుస్తులు, తన సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్లిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచారం, హత్య కేసుతో పాటు మరికొన్ని సెక్షన్లు నమోదు చేశారు. నిందితుడు గోవిందరావును అరెస్టు చేసి జుడీషియల్ రిమాండుకు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.