Home /News /telangana /

NIZAMABAD FARMERS IN NIZAMABAD DISTRICT ARE WORRIED ABOUT NON PURCHASE OF PADDY SNR NZB

Telangana : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతల ఆందోళన .. అరిగోస కాదు వరిగోస అంటున్న రైతులు

(అన్నదాతల వరిగోస)

(అన్నదాతల వరిగోస)

Telangana: ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెన‌క్కు అన్న‌ట్టుగా ఉంది. ఆరంభంలో హడావుడిగా జరిగినప్పటికి కొద్ది రోజుల్లోనే లారీలు, హమాలీల కొరతతో పాటు రైస్ మిల్ల‌ర్ల త‌రురుగు వంటి కార‌ణాల‌తో కొనుగోళ్లు మంద‌గించాయి. 50రోజులుగా రోడ్లపై ధాన్యం పోసిన రైతులు చినుకులు పడక ముందే పంట అమ్ముడైతే బాగుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    తెలంగాణ(Telangana)లో వరి పండించిన అన్నదాతల పరిస్థితి ముందు చూస్తే గొయ్యి ..వెనక చూస్తే నుయ్యి అన్నట్లుగా మారింది. ప్రభుత్వం యాసంగి ముందు నుంచే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తూ వచ్చింది. వరి ధాన్యం కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పింది. అయితే కొందరు ప్రత్యామ్నాయ పంటలు వేస్తే ..మరికొందరు రైతులు మాత్రం వేరే గత్యంతరం లేక వరిసాగు చేశారు. తెలంగాణలో యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలు చేయమని తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చింది. అయితే మాట చెప్పినంత సులువుగా ధాన్యం ప్రక్రియ కొనసాగకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా నిజామాబాద్(Nizamabad)జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. లారీల(lorries)లో తీసుకెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు(Millers)రోజుల తరబడి దించ‌క‌పోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. స‌న్న‌ర‌కం వడ్లను అన్‌లోడ్ చేసుకుంటూ లావు రకం వడ్లను రోజుల తరబడి లారీల్లో ఉంచడంతో రైతులకు ఖర్చుల భారం తడిసి మోపడవుతోంది.

    అడుగడుగున సమస్యలే..
    దిగుమతి ఇలా ఉంటే త‌రుగు పేరుతో రైస్ మిల్ల‌ర్లు రైతులను ఇబ్బంది పెట్టొద్దని అధికారులు చెప్పినప్పటికి వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తరుగు పేరుతో రైతుల కడుపు కొడుతున్నారు. క్వింటా ధాన్యానికి రెండు నుంచి మూడు కిలో తరుగు తీస్తున్నారు. దాన్యాన్ని 41.5కిలోలుగా తూకం వేస్తున్నప్పటికి 40 కిలోలే తూకం చూపిస్తున్నారు. ఇదేంటని అడిగితే నూక శాతం ఎక్కువగా ఉంటోందనే సాకు చెబుతన్నారు రైస్‌ మిల్లర్లు.

    ధాన్యం కొనుగోళ్లు జరిగేదెప్పుడు..
    ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి 15రోజులు కావస్తోంది. రైతులు ధాన్యం బస్తాలను కేంద్రాలకు తరలించారు. మరోవైపు వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో
    తరలించిన ధాన్యం రైస్‌ మిల్లుల దగ్గర 2-3 రోజుల పాటు ఉంచాల్సి వస్తోంది. తూకం వేయగానే ధాన్యం లోడ్ చేసేందుకు లారీలు దొరక్కపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. లోడ్‌ తీసుకెళ్లిన లారీలు రోజుల తరబడి ఎండలో ఉంచడంతో దాన్యం బరువు తగ్గుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రైస్ మిల్లులకు దూరంగా కొనుగోలు కేంద్రాలు ఉండటంతో సమయానికి లారీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

    అన్నదాతల ఆందోళన..
    జిల్లా వ్యాప్తంగా యాసంగి సిజ‌న్ లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు 3లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు కూడా పూర్తిగా చెల్లించని పరిస్థితి. వర్షాలు పడక ముందే యాసంగి వడ్లను త్వరగా కొనుగోలు చేసి డబ్బులిస్తే ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉందంటున్నారు రైతులు. ఇక ధాన్యం ధరను ప్రభుత్వం క్వింటాకు 1960 రూపాయ‌లు మ‌ద్ద‌తు ధరగా నిర్ణయించింది. ఇందులో 2-5కిలోల వరకు తరుగు తీస్తే క్వింటాకు 1600 మాత్రమే రైతుల చేతుల్లోకి వచ్చేది. అదే దళారులను నమ్ముకుంటే 1400మాత్రమే చెల్లిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. రైతులు పడుతున్న బాధల్ని అర్ధం చేసుకొని వర్షాలు కురవక ముందే మిల్లుల్లో ఉన్న ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లను కొనుగోలు చేస్తే అప్పుల బాధలు తప్పుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Farmers, PADDY PROCUREMENT, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు