(P.Mahendar,News18,Nizamabad)
ఒకే తల్లి కడుపున పుట్టిన వాళ్లిద్దరూ ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కలిసే జీవించారు. ఇద్దరూ కలిసి భవన నిర్మాణ పనులు చేసుకున్నారు. ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దర్ని ఒకేసారి ఆవహించింది. ఉహించని ఘటనలో 65ఏళ్లు కలిసి బ్రతికిన అన్నదమ్ములు(Elderly brothers) చావులో కూడా ఒకేసారి ప్రాణాలు విడిచిన సంఘటన నిజామాబాద్(Nizamabad)జిల్లాలో అందర్ని కంట తడి పెట్టించింది. మోర్తాండ్ (Mortand)మండల కేంద్రంలో ఈఘటనతో విషాదం నెలకొంది. ఏనాడు గొడవపడని అన్నదమ్ములు అర్దాంతరంగా ప్రాణాలు కోల్పోయారని తెలిసి అందరూ విచారం వ్యక్తం చేశారు.
చావులో కూడా వీడని రక్తసంబంధం..
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన 67ఏళ్ల గోనుగొప్పుల రాములు, 65సంవత్సరాల గోనుగొప్పుల లింగన్న అన్నదమ్ములు. తాపీ మేస్త్రీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. స్థానికంగా లత అనే మహిళ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో ఇంటి గోడలు మరమ్మతులు చేపట్టమని రాములు, లింగన్నకు పని అప్పగించింది. రెండ్రోజుల క్రితమే పనులు మొదలు పెట్టిన అన్నదమ్ములు గోడలకు ప్లాస్టింగ్ చేశారు. గోడను నీళ్లతో తడపటం, అది మట్టితో కట్టినది కావడంతో మరోవైపు ప్లాస్టరింగ్ చేస్తుండటంతో నానిపోయి ఒక్కసారిగా గోడ కూలీంది. గోడ కూలిన సమయంలో రాములు, లింగన్న పరేంచపై ఉన్నారు. మట్టిపెడ్డలు వారిపై పడటంతో లింగన్న అక్కడికక్కడే మృతిచెందగా.. రాములు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచారు.
తీరని విషాదం ..
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు స్పాట్‌కి చేరుకున్నారు. అన్నదమ్ములు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడం చూసి ని కన్నీటి పర్యాంతం అయ్యారు. లింగన్నకు కొడుకు, కూతురు ఉండగా.. రాములుకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. అందరికి వివాహాలు చేసి మనవలు , మనవరాళ్లతో ఆడుకోవాల్సిన సమయంలో పనులకు వెళ్లి మృత్యువాతపడటంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి.
కలచివేసిన సంఘటన..
కష్టపడే లక్షణం కలిగిన వాళ్లు కావడం, ఆరోగ్యంగానే ఉండటంతో ..65ఏళ్లు దాటినప్పటికి తాపీ మేస్త్రీ పనులు చేసుకుంటున్నారు రాములు, లింగన్న. వృద్దాప్యంలో కూడా ఎవరిపైనా ఆధారపడకుండా కలిసి , మెలిసి జీవిస్తున్న అన్నదమ్ముల ప్రాణాలు ఒకేసారి కోల్పోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Telangana News