news18-telugu
Updated: November 9, 2020, 2:18 PM IST
ఆర్మీ జవాన మహేష్ (credit - twitter)
Indian Soldier Mahesh: నువ్వు పెద్దయ్యాక ఏమవుతావని ఎవరైనా అడిగితే... చాలా మంది డాక్టర్ అనో టీచర్, లాయర్, యాక్టర్ ఇలా చెబుతారే తప్ప... ఆర్మీలో చేరతా అని చెప్పేవాళ్లు తక్కువే. కానీ అమర జవాన్ మహేష్ (26) మాత్రం... చిన్నప్పటి నుంచి అదే కలతో పెరిగాడు. సైనిక విధుల్లో దేశం కోసం పోరాడుతూ... ప్రాణాలు విడిచాడు. మహేష్‌ది నిజామాబాద్ జిల్లా... వేల్పూర్ మండలంలోని కోమటిపల్లి గ్రామం. 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ గవర్నమెంట్ స్కూల్లో, 7 నుంచి 10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాడు. నిజామాబాద్‌లోని శాంఖరి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆరేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న మహేష్... 2019 డిసెంబర్లో ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని పలకరించి వెళ్లాడు. అదే చివరి పలకరింపు. తాజాగా జరిగిన ఉగ్రదాడిలో మహేష్ అమరజవాన్ అవ్వడంతో... కన్నీటి సంద్రమవుతున్నారు కుటుంబ సభ్యులు. దేశం కోసం ప్రాణాలు అర్పించడం గొప్ప విషయమే అయినా... ఇక ఎప్పటికీ తిరిగి రాడనే వార్త వారిని తీవ్రంగా కలచివేస్తోంది. గ్రామస్థులు మహేష్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకొని విషాదంలో మునిగిపోతున్నారు.
చిన్నప్పటి నుంచి మహేష్‌కి దేశభక్తి ఎక్కువే. ఆర్మీలో చేరాలనే ఆలోచనతోనే పెరిగాడు. ఇంటర్ చదివేటప్పుడే ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్ ఉన్నారు. 2014-15లో ఆర్మీకి సెలెక్ట్ అయిన మహేష్... రెండేళ్ల కిందట... హైదరాబాద్‌కి చెందిన సుహాసినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆరేళ్ల నుంచి ఆర్మీలో పనిచేస్తూ... తన కలను సాకారం చేసుకున్నాడు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లోని మాచిల్ సెక్టార్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు చనిపోయారు. వారిలో ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాగా... ఆ ఇద్దరిలో ఒకడు మహేష్.
జమ్మూకాశ్మీర్‌లో ఆదివారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదులు ఇండియాలోకి రాకూడదని గట్టిగా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అమరుడయ్యాడు. మహేష్ మృతిపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. "మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేం" అని క్యాప్షన్ పెట్టారు.
మహేష్ మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అమర జవానుకు ఘన నివాళి అర్పించిన ఆమె... తెలంగాణ జాతి వీర జవాన్ కుటుంబానికి అండగా ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
26 ఏళ్ల వయసు... ఎంతో భవిష్యత్తు ఉంది. అంతలోనే అంతా అయిపోయింది. ఎంతో మంది జవాన్లు ఇలాగే... ప్రాణాలు అర్పించాల్సి వస్తోంది. పక్కనున్న పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునే క్రమంలో... తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్నారు అమర జవాన్లు.
Published by:
Krishna Kumar N
First published:
November 9, 2020, 10:43 AM IST