హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నిర్మల్‌ జిల్లాలో పరాకాష్టకు చేరిన వీడీసీల ఆగడాలు..భరించలేక వ్యక్తి అదృశ్యం

Telangana: నిర్మల్‌ జిల్లాలో పరాకాష్టకు చేరిన వీడీసీల ఆగడాలు..భరించలేక వ్యక్తి అదృశ్యం

(గ్రామాల్లో పెద్దందారి వ్యవస్థ)

(గ్రామాల్లో పెద్దందారి వ్యవస్థ)

Adilabad:గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలపై దృష్టిపెట్టాల్సిన కమిటీ సభ్యులు ఆధిపత్యం చలాయిస్తున్నారు. వాళ్ల నిర్ణయాలు, ఆదేశాలు జారీ చేయకపోతే జరిమానా విధిస్తున్నారు. అవి చెల్లించలేని వాళ్లను గ్రామ బహిష్కరణకు గురి చేస్తున్నారు. ఇంతటి అరాచకం ఎక్కడ జరిగిందంటే.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

గ్రామ అభివృద్ది కమిటి(Village Development Committee)ల ఆగడాలు శృతి మించుతున్నాయి. తాము చెప్పించే వేదం, చేసిందే న్యాయం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.  గ్రామాభివృద్దికి పాటుపడాలన్న ప్రధాన కర్తవ్యాన్ని మర్చిపోయి ..తాము చెప్పినట్లు చేయని వారికి జరిమానాలు విధిస్తూ, సంఘ బహిష్కరణ(Social exclusion)శిక్షలతో వేధింపులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజా నిర్మల్(Nirmal)జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన గ్రామాభివృద్ది కమిటి నిరంకుశత్వానికి అద్దంపడుతోంది.

గ్రామాల్లో పెత్తందారి వ్యవస్థ..

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం టెంబుర్ని గ్రామానికి చెందిన నర్సయ్య అనే వ్యక్తికి మద్యం కొనుగోలు విషయంలో గ్రామాభివృద్ది కమిటి 30 వేల రూపాయల జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా జరిమాన చెల్లించకపోతే గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తామని హెచ్చరించారు. దీంతో అవమానంగా భావించిన నర్సయ్య ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అయితే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీర్మానాలు, జరిమానాలు..

గ్రామాభివృద్ది కమిటి అనుమతితో టెంబుర్ని గ్రామంలో ఓ మద్యం బెల్టు షాపును ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ది కమిటి నిర్ణయం మేరకు గ్రామస్థులంతా ఆ బెల్టు షాపులోనే మద్యం కొనుగోలు చేయాలని కండీషన్ పెట్టారు. ఇదే అదనుగా బెల్టు షాపులో అడ్డగోలు ధరలకు మద్యం విక్రయిస్తున్నా, గత్యంతరం లేక గ్రామస్థులు ఆ దుకాణంలోనే మద్యం కొనుగోలు చేస్తున్నారు.టెంబుర్ని గ్రామానికి చెందిన నర్సయ్య గ్రామంలో ఉన్న బెల్టు షాపులో కాకుండా, పక్క ఊళ్ళోని దుకాణంలో మద్యం కొనుగోలు చేశాడు. అయితే ఈ విషయం తెలిసిన గ్రామాభివృద్ది కమిటి సభ్యులు గ్రామంలో పంచాయతీ పెట్టి నర్సయ్యకు 30 వేల రూపాయల జరిమానా విధించారు.

వేధింపులు భరించలేక..

నర్సయ్య జరిమానా కట్టలేకపోతే అతని కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయాలని నిర్ణయించారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య ఏం చేయాలో అర్ధంకాక ఇంటినుండి ఎవరికి కనిపించకుండా వెళ్లిపోయాడు. తన భర్త కనిపించకుండా పోవడానికి గ్రామాభివృద్ది కమిటి సభ్యుల వేధింపులే కారణమని నర్సయ్య భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవమానభారం భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అదృశ్యం వెనుక అసలు కథ..

సోన్ గ్రామం వద్ద గోదావరి వంతెనపై నర్సయ్య బైక్, చెప్పులతో పాటు గ్రామాభివృద్ధి కమిటీలోని సభ్యుల పేర్లతో రాసిన ఓ లేఖ దొరకింది. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లాలో మరికొన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. వీడీసీల ఆగడాలపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే వాళ్ల ఆరాచకలకు మరికొంతమంది బలయ్యే అవకాశం ఉందంటున్నారు.

First published:

Tags: Missing person, Nirmal district, Villagers

ఉత్తమ కథలు