హోమ్ /వార్తలు /తెలంగాణ /

కరోనా ఎఫెక్ట్.. బాధ్యత మరిచిన వైద్యులు.. 18 నెలల చిన్నారి కడుపునొప్పితో..

కరోనా ఎఫెక్ట్.. బాధ్యత మరిచిన వైద్యులు.. 18 నెలల చిన్నారి కడుపునొప్పితో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అండగా ఉండాల్సిన సమయంలో వైద్యులు కరోనా పేరుతో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఓ 18 నెలల చిన్నారి తీవ్ర కడుపునొప్పితో మరణించాడు.

  కరోనా మహమ్మారి కారణంగా దేశం అతాలాకుతలం అవుతోంది. ఇలాంటి విపత్కర సమయంలో బాధ్యతగా ఉండాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ ముక్కుపచ్చలారని చిన్నారిని మృత్యువు కబళించింది. సాధారణ రోజుల్లో వైద్యం పేరు చెప్పి.. లక్షలాది రూపాయలు గడించే ఆస్పత్రి యాజమాన్యాలు.. కష్టకాలంలో మాత్రం చేతులెత్తేశారు. అండగా ఉండాల్సిన సమయంలో కరోనా పేరుతో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఓ 18 నెలల చిన్నారి తీవ్ర కడుపునొప్పితో మరణించాడు. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటుచేసుకుంది.

  పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బీమ్లతండాకు చెందిన భూక్యా పాండూనాయక్ కుమారుడు మల్లేశ్ కోదాడలోని మట్టపల్లి ఎన్‌సీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మల్లేశ్‌కు నిఖిల్(18 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. అయితే బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో నిఖిల్ తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో మల్లేశ్ అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో వేరే ఆస్పత్రికి తరలించారు. అక్కడా సైతం డాక్టర్లు లేరు. ఇలా దాదాపు అన్నీ ఆస్పత్రులు తిరిగాడు. కరోనా వైరస్ కారణంగా వైద్యులెవరూ రావడం లేని అన్ని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు.

  ఎవరూ లేకపోవడంతో చివరకు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీహెచ్‌సీ(ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రి)కి తీసుకొచ్చారు. అక్కడ సైతం ఎవరూ అందుబాటులో లేరు. 24 గంటలు పని చేయాల్సిన సీహెచ్‌సీలో రాత్రి సమయంలో ఎవరు ఉండలేదు. ఎంతసేపు వారి కోసం ఎదురుచూసినా సిబ్బంది గానీ, వైద్యులు గానీ రాలేదు. దీంతో సకాలంలో చికిత్స అందకపోవడంతో నిఖిల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇదిలావుంటే.. ఈ విషయమై డీసీహెచ్ఎస్ వెంకటేశ్వర్‌ను సంప్రదించగా.. రాత్రి సమయంలో తప్పనిసరిగా వైద్యులు అందుబాటులో ఉంటారని, నిఖిల్ కుటుంబ సభ్యులు సరిగా చూడకపోయి ఉంటారని బదులిచ్చాడు.

  Published by:Anil
  First published:

  Tags: Doctors, Suryapet, Telangana

  ఉత్తమ కథలు