Cyber Crime: హైదరాబాద్ టెకీకి షాకింగ్ అనుభవం.. క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తున్నాం సర్.. అంటూ షాపింగ్ మాల్ బయట ఓ వ్యక్తి చెప్పడంతో..

ప్రతీకాత్మక చిత్రం

ఆ క్రెడిట్ కార్డును ఓపెన్ చేయకుండానే, కవర్లోంచి బయటకు తీయకుండానే సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాలోంచి లక్షకు పైగానే మాయం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు. ఇప్పటిదాకా మనుషుల ఆశలను ఆయుధంగా చేసుకుని మాయ మాటలు చెప్పి వాళ్ల ఖాతాలను ఖాళీ చేసిన కేటుగాళ్లు, తాజాగా వారి ప్రమేయం లేకుండానే డబ్బును కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అప్రమత్తంగా ఉండండంటూ హెచ్చరిస్తున్నా నిరక్ష్యరాస్యులే కాదు, ఏకంగా ఉన్నతోద్యోగులే మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో అచ్చం అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి షాపింగ్ మాల్ వద్దకు వెళ్తే.. క్రిడిట్ కార్డు కావాలా అంటూ ఓ వ్యక్తి వచ్చాడు. ఉచితంగా క్రెడిట్ కార్డు వస్తోందని చెప్పడంతో సరేనని వివరాలు ఇచ్చాడు. కానీ ఆ క్రెడిట్ కార్డే అతడి కొంప ముంచుతుందని ఊహించలేదు. కనీసం ఆ క్రెడిట్ కార్డును ఓపెన్ చేయకుండానే, కవర్లోంచి బయటకు తీయకుండానే సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాలోంచి లక్షకు పైగానే మాయం చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    హైదరాబాద్ లోని బోయిన్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి తేజేశ్వరరెడ్డి ఇటీవల ఓ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేటు కంపెనీ రిప్రజెంటేటివ్ సాయిని కలిశాడు. ’ఎలాంటి యూజర్ చార్జీలు లేవు. ఉచితంగా క్రెడిట్ కార్డును అందిస్తాం‘ అంటూ ఆశ చూపాడు. దీంతో సరేనన్న సాయి తన వివరాలను అతడికి చెప్పాడు. అయితే ఆ క్రెడిట్ కార్డు సంస్థ ప్రతినిధులు ఆ కార్డును జారీ చేసే ముందు సాయికి ఫోన్ చేశారు. ఏడాదికి ఆ కార్డు సర్వీస్ చార్జీ రూ.2 వేలు ఉంటుందని చెప్పాడు. దీంతో తనకు ముందుగా ఉచితం అని చెప్పారనీ, ఏడాదికి రూ.2వేలు కట్టాల్సి వస్తే ఆ కార్డు తనకు అవసరం లేదంటూ వారికి తేల్చిచెప్పాడు. అయినప్పటికీ ఆ సంస్థ ప్రతినిధులు ఆ కార్డును సాయికి కొరియర్ ద్వారా ఫిబ్రవరి 2వ తారీఖున పంపించారు. ఆ కార్డును వాడదలచుకోలేదు కాబట్టి, సాయి ఆ కార్డు కవర్ కూడా తీయకుండానే దాన్ని బ్యాంకులో అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆ క్రెడిట్ కార్డు కవర్ సీల్ ను తీయలేదు.
    ఇది కూడా చదవండి: అయ్యో పాపం.. జీవితాంతం సంపాదించిన సొమ్మంతా ఒక్క ఫోన్ కాల్ తో మటాష్.. ఏకంగా రూ.77 లక్షలు..

    అయితే ఫిబ్రవరి 24న సాయికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ఓ వ్యక్తి తనను తాను ఆ క్రెడిట్ కార్డు ప్రతినిధిని అని హిందీలో చెప్పుకున్నాడు. అయితే సాయికి హిందీ రాకపోవడంతో ఫోన్ ను కట్ చేశాడు. వాళ్లు పలుమార్లు సాయికి ఫోన్ చేసినా కట్ చేస్తూ వచ్చాడు. అతడికి ఫోన్లు రావడం ఆగిపోయిన మరు క్షణమే సాయికి మూడు మెసేజ్ లు వచ్చాయి. రూ.76,820, రూ.21,420, రూ.12,712 చొప్పున మూడు సార్లు షాపింగ్ చేసినట్టు అతడికి మెసేజ్ లు వచ్చాయి. ఆ వచ్చిన మెసేజ్ లు వెంటనే తన ఫోన్ నుంచి మాయమయ్యాయి కూడా. దీంతో అయోమయానికి గురయిన సాయి వెంటనే ఆ ప్రైవేటు బ్యాంకుకు వెళ్లాడు. తాను ఆ క్రెడిట్ కార్డు నుంచి ఎలాంటి షాపింగ్ చేయలేదని చెప్పాడు. అయితే బ్యాంకు వాళ్లు మాత్రం రికార్డుల ప్రకారం షాపింగ్ జరిగిందని నిర్ధారించారు. తనకు ఆ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని బ్యాంకు అధికారులకు చెప్పి ఆ కార్డును బ్లాక్ చేయించాడు. బ్యాంకు వాళ్లు ఈ ఘటన గురించి సరిగా స్పందించకపోవడంతో శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్.. రూ.3000 కోసం ట్రై చేస్తే.. ఏకంగా రూ.6,00,000 పోగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..
    Published by:Hasaan Kandula
    First published: