NEW SERVICES AND SURGERIES INCLUDED IN TELANGANA AAROGYASRI SAYS MINISTER ETELA RAJENDAR AK
Aarogyasri: తెలంగాణ ప్రజలకు తీపి కబురు చెప్పిన మంత్రి ఈటల
ఈటల రాజేందర్( ఫైల్ ఫోటో)
Telangana Aarogyasri: కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కంటే, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్య శ్రీ మెరుగ్గా ఉందని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్య శ్రీ పథకంలోకి మరిన్ని సేవలను తీసుకురాబోతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కిడ్నీ, హార్ట్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను తీసుకురావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రస్తుతం కేవలం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే మూత్రపిండాలు, గుండె, కాలేయ మార్పిడి శస్ర్తచికిత్సలు కొనసాగుతున్నాయని చెప్పిన ఈటల.. వీటిని మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులకు విస్తరింపజేస్తామని చెప్పారు. కిడ్నీ, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల ఖర్చు అవుతుందని.. ఇది పేదలకు భారంగా మారిందని తెలపారు.
ఈ క్రమంలో ఈ మూడింటిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చి పేదలపై రూపాయి భారం పడకుండా ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి అవసరమైతే చట్టంలో కూడా మార్పులు చేస్తామన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్ కంటే, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆరోగ్య శ్రీ మెరుగ్గా ఉందని మంత్రి ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణలో 108, 104, 102 సర్వీసులకు ప్రభుత్వమే నిధులు ఖర్చు పెడుతోందని ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య శ్రీ కోసం రూ. 1200 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతోందని ప్రకటించారు. తెలంగాణ ప్రజల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.
మంత్రి కేటీఆర్(ఫైల్ ఫోటో)
ఇక తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో విజయవంతమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఆరు నెలలుగా వైద్య, ఆరోగ్య శాఖ అద్భతంగా పని చేసిందని మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో మంచి పనితీరును కనబరిచిందని అన్నారు. హెల్త్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్క్ వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించారని కొనియాడారు. ఇతర రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతుంటే మన రాష్ట్రంలో మాత్రం అదుపులో ఉందని కేటీఆర్ అన్నారు. మాతాశిశు మరణాల రేటును తగ్గించిందని, ఐసీయూ యూనిట్లు, బ్లడ్ బ్యాంకులు, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహించిందని కేటీఆర్ తెలిపారు.
సీజనల్ వ్యాధులు, రోగాల పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరిగిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఆరోగ్యశాఖపై జరిగిన మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పలు ప్రతిపాదనలకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌కు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అందజేయనున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.