హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: దుబ్బాకలో గెలుపెవరిది ? మెజార్టీ ఎంత ? సరికొత్త సర్వే

Dubbaka: దుబ్బాకలో గెలుపెవరిది ? మెజార్టీ ఎంత ? సరికొత్త సర్వే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By election: దుబ్బాక ఉప ఎన్నికపై ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే విడుదలైంది. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని సర్వే అంచనా వేసినప్పటికీ... టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉండొచ్చని పేర్కొంది.

  దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిదనే విషయం మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు కూడా హోరాహోరీగానే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్‌పోల్స్‌ భిన్నమైన ఫలితాలు సూచించాయి. ఓ సంస్థ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పగా... మరో సంస్థ బీజేపీ గెలుపు సాధిస్తుందని అంచనా వేసింది. అయితే తాజా ఆరా సంస్థ పోస్ట్ పోల్ సర్వే విడుదలైంది. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఈ సర్వే అంచనా వేసింది.

  పోలైన ఓట్లలో టీఆర్ఎస్‌కు 48.72 శాతం వస్తాయని పేర్కొంది. బీజేపీకి 44.64 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 6.12 శాతం ఓట్లు, ఇతరులకు 2.52 శాతం వస్తాయని విశ్లేషించింది. అయితే తమ సర్వేలో అంచనాల్లో వచ్చిన ఫలితాలకు మూడు శాతం ఓట్లు అటు ఇటు రావొచ్చని పేర్కొంది. సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో తేడా స్వల్పంగానే ఉంటుండటంతో.. ఫలితం ఎలాగైనా ఉండే అవకాశం ఉంది.

  దుబ్బాక శాసన సభ ఉప ఎన్నికలో గతం కంటే తక్కువ పోలింగ్‌ శాతం నమోదైంది. 2018 శాసనసభ ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,90,483 కాగా 1,63,798 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాడు 85.99 పోలింగ్‌ శాతం నమోదైంది. 2018 ఎన్నికతో పోల్చితే ఈ ఉప ఎన్నికలో దుబ్బాక నియోజకవర్గ ఓటర్ల సంఖ్య పెరిగింది. మొత్తం 1,98,756 మంది ఓటర్లుండగా 1,64,192 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది. అయితే గతం కంటే ఓట్లు పెరిగినా 3.38 శాతం పోలింగ్‌ తగ్గింది. ఈ మేరకు బూత్‌ల వారీగా ఆయా పార్టీలు తమకు పడిన ఓట్లను లెక్కగడుతూ విజయావకాశాలపై అంచనాకు వస్తున్నారు.

  మహిళల ఓటింగ్‌ పెద్ద ఎత్తున నమోదైనప్పటికీ 2018 శాసనసభ ఎన్నిక కంటే ఈసారి ఓటింగ్‌ శాతం తగ్గింది. పురుషుల ఓటింగ్‌ శాతం పెరగడం ఆసక్తి కలిగిస్తున్నది. గత శాసనసభ ఎన్నికలో పురుషులు 93,703 ఓట్లకు గానూ 80,464 నమోదు కాగా, ఈసారి 96,780 ఓట్లకు 83,334 ఓట్లు పోలయ్యాయి. గత శాసనసభ ఎన్నికలో 85.87 శాతం కాగా, ఈసారి 86.106 శాతం నమోదైంది. గతం కంటే ఒక శాతం పెరిగింది. అదే విధంగా మహిళ ఓట్లు ప్రస్తుతం 1,00,778 గానూ 82,554(81.91శాతం) నమోదయ్యాయి. గత ఎన్నికలో 97,979 ఓట్లకు గానూ 81,638 (83.32) ఓట్లు నమోదయ్యాయి. ఈ ఉప ఎన్నికలో మహిళా ఓట్ల శాతం తగ్గడంపై ఈ మేరకు ఏ పార్టీకి నష్టం వాటిళ్లుతుందో చర్చించుకుంటున్నాయి.

  2018 అసెంబ్లీ ఎన్నికతో పోల్చితో అన్ని మండలాల్లోనూ ఓటింగ్‌ తగ్గింది. దుబ్బాక మండలంలో 53,501 ఓట్లకు గానూ 44,565 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 55,208 ఓట్లకు 45,586 మంది ఓటేశారు. చేగుంట మండలంలో గత ఎన్నికలో 31,526 ఓట్లకు 27,121 పోలింగ్‌ నమోదైతే. ఈసారి 32,829 ఓటర్లకు 26,282 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దౌల్తాబాద్‌ మండలంలో గతంలో 22,117 ఓట్లకు 19,845 నమోదయ్యాయి. ప్రస్తుతం 23,032 ఓట్లకు 19,708 ఓట్లు పడ్డాయి. గజ్వేల్‌ ఆరెపల్లి గ్రామంలో గతంలో 419 ఓట్లకు 347 మంది వేయగా ప్రస్తుతం 446 ఓట్లకు 359 మంది ఓటేశారు. మిరుదొడ్డి మండలంలో గతంలో 30,154 ఓటర్లకు 25,676 మంది ఓటింగ్‌లో పాల్గొనగా ప్రస్తుతం 31,762 మందికి గానూ 25,765 ఓట్లు వేశారు. నార్సింగి మండలంలో గతంలో 8,090 ఓట్లకు 6,973 పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుతం 8,215 ఓటర్లకు 6,806 ఓట్లు పడ్డాయి. రాయపోల్‌ మండలంలో గత ఎన్నికలో 19,941 ఓటర్లకు 17,462 ఓట్లు వేయగా ప్రస్తుతం 20,513 మందికి 17,352 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొగుట మండలంలో గతంలో 24,744 మందికి 21,810 ఓట్లు పడగా ప్రస్తుతం 26,751 మందికి 22,334 ఓట్లు నమోదయ్యాయి.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana