Dalitha Bandhu: దళితబంధు అమలుకు కొత్త మార్గదర్శకాలు..? ఏంటంటే..? మూడు స్థాయిల్లో కమిటీలు

దళిత బంధుకి కొత్త మార్గదర్శకాలు

యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో దళిత బంధు పథకం ప్రారంభం కానుంది. అక్కడ 76 కుటుంబాల కోసం 7.6 కోట్లు కలెక్టర్‌ ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు నిర్దేశించారు.

 • Share this:
  సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధు పథకం కార్యరూపంలోకి వచ్చింది. మొదట హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అనుకున్నా.. తాను దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో మొదట అమలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా, మండలం, గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించి పథకం అమలును పర్యవేక్షించనున్నట్టు ప్రకటించింది. వాసాలమర్రిలో 76 నిరుపేద దళిత కుటుంబాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వీరికి ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్‌ (ఎస్‌సీసీడీసీ) గురువారం రూ.7.6 కోట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేసింది. దళిత బంధు పథకం అమలుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించింది. వాసాలమర్రిలో అమలును పరిశీలించిన తరువాత రాష్ట్ర స్థాయిలో పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

  దళితబంధు పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. తమకు నచ్చిన, అనువైన యూనిట్లను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పథకం కింద ఇచ్చిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసుకునే యూనిట్లకు సంబంధించి ఎస్‌సీసీడీసీ కొన్ని సలహాలు, సూచనలు చేసింది. వివిధ రంగాల్లో డిమాండ్‌ ఉన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు పలురకాల యూనిట్ల జాబితాలతో ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇవేగాకుండా లబ్ధిదారులు తమకు ఇప్పటికే అవగాహన ఉన్న ఇతర యూనిట్లను కూడా ప్రారంభించుకునే వీలు కల్పించింది.

  మూడు స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన.. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), జెడ్పీ సీఈవో, డీఆర్‌డీఏ/ వ్యవసాయ/ పశుసంవర్ధక/ రవాణా/ పరిశ్రమల విభాగాల నుంచి ఎంపిక చేసిన అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీతోపాటు కలెక్టర్‌ నామినేట్‌ చేసే మరో ఇద్దరు సభ్యులుగా కమిటీ ఉంటుంది. మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్ధార్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులతోపాటు ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు ఉంటారు. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులతో కమిటీ ఉంటుంది.

  ప్రభుత్వం నిర్ధేశించిన కమిటీలే దళిత బంధు పథకం అమలులో కీలకంగా వ్యవహరించనున్నాయి. పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం, డేటాబేస్‌లో అర్హత కలిగిన కుటుంబాల పేర్లు నమోదు చేయడం, జిల్లా కలెక్టర్‌ నుంచి మంజూరు పత్రాల పంపిణీ, లబ్ధిదారులకు శిక్షణ, అవసరమైన వనరుల కూర్పు, సలహాలు, సూచనలివ్వడం, క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన ఐడీ కార్డుల జారీ, యూనిట్ల పనితీరు పరిశీలన, ఇన్సూరెన్స్‌ కవరేజీ తదితర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. మండల, గ్రామ కమిటీలు లబ్ధిదారులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వారితో చర్చించి.. సమస్యలేమైనా ఉంటే గుర్తించడం, వాటికి పరిష్కారం చూపడం వంటి చర్యలు తీసుకుంటాయి. ఈ సమావేశాలు, చర్చల నివేదికలను డేటాబేస్‌లోకి అప్‌లోడ్‌ చేస్తాయి.

  దళిత బంధు పథకం లబ్ధిదారుల రక్షణ కోసం జిల్లాస్థాయిలో దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, పరిశ్రమల విభాగం జనరల్‌ మేనేజర్‌ సభ్యులుగా ఉండే కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది. రూ.10లక్షల సాయం మంజూరైన లబ్ధిదారుల నుంచి రూ.10వేల చొప్పున, ఎస్సీ కార్పొరేషన్‌ నుంచి రూ.10 వేల చొప్పున ‘రక్షణ నిధి’కి కాంట్రిబ్యూషన్‌గా జమ చేస్తారు. దీనితోపాటు లబ్ధిదారులు ఏటా రూ.1,000 చొప్పున నిధికి జమచేయాలి. ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా ఆపదకు లోనైనప్పుడు ఈ నిధి నుంచి సాయం అందిస్తారు.
  Published by:Nagesh Paina
  First published: