నేపాల్ బుడతడు.. ఖమ్మంలో పుట్టేశాడు.. రైళ్లో గర్భిణీకి నొప్పులు రావడంతో క్షణాల్లో స్పందించిన అధికారులు

తల్లితో బాలుడు

సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా దూసుకెళ్తోంది. రైలు విజయవాడ దాటగానే రిజర్వేషన్‌ భోగీలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆమెతో పాటు ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  గురువారం తెల్లవారుజాము.. బెంగళూరు నుంచి లక్నోకు వెళ్తున్న యశ్వంత్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా దూసుకెళ్తోంది. రైలు విజయవాడ దాటగానే రిజర్వేషన్‌ భోగీలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అకస్మాత్తుగా పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆమెతో పాటు ఉన్న బంధువులు ఆందోళనకు గురయ్యారు. రైల్వే అటెండర్‌కు విషయం తెలపడంతో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ వేగంగా స్పందించారు. దగ్గర్లో ఉన్న ఖమ్మం స్టేషన్‌ సూపరెంటెండెంట్‌కు విషయ తీవ్రతను వివరించారు. నిజానికి యశ్వంత్‌పూర్‌ సూపర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఖమ్మంలో స్టాప్‌ లేదు. అయినా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. మానవీయ దృక్ఫధంతో పరిస్థితిని అర్థం చేసుకున్నారు. అప్పటికప్పుడు 108 అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు. వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని అలర్ట్‌ చేశారు.

  దీంతో ప్రసూతి విభాగం వైద్యులకు కూడా సమాచారం ఇవ్వడం.. రైలు ఆగడం.. అంబులెన్స్‌ లోకి ఆమెను మార్చడం .. ఆసుపత్రిలో  అడ్మిట్‌ చేయడం.. నిమిషాల వ్యవధిలోనే సాధారణ కాన్పు అయింది.  పండంటి మగ శిశువు ఈ లోకంలోకి వచ్చాడు. ఇలా ఓ గర్భిణికి.. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో అందిన సేవలివి.. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం చోటుచేసుకున్నా.. ఊహించని ప్రమాదం జరిగేది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి చెడ్డపేరు వచ్చేది.. అదేంటి.. అంటే ఇక చదవండి..

  అసలేం జరిగింది....?

  నేపాల్‌ దేశంలోని ఖాట్మండుకు దగ్గరలో ఉన్న డైలీక్‌ గ్రామానికి చెందిన మాడా హనితాదేవి ఆమె. ఆమె భర్త భరత్‌ బెంగళూరులోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. దుబాయ్‌లో మంచి ఉద్యోగం దొరకడంతో అతను వెళ్లిపోయాడు. నిండు గర్భిణి కావడంతో ఆమెను బంధువులు తోడుగా తమ దేశానికి పంపించే ఏర్పాట్లు చేశాడు. అయితే దూర ప్రయాణం కావడంతో.. మధ్యలో లక్నోలో ఉన్న తమ బంధువుల ఇంటి వద్ద కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని స్వదేశం వెళ్లాలన్నది వారి ఆలోచన. దీన్లో భాగంగానే బెంగళూరు- యశ్వంత్‌పూర్‌ ట్రెయిన్‌లో జర్నీ చేస్తున్నారు. వాస్తవానికి వైద్యులు ఆమెకు సూచించిన కాన్పు తేదీకి మరికొన్ని రోజులు సమయం ఉన్నా.. రైలుప్రయాణంలో ఉండగానే సడెన్‌గా నొప్పులు వచ్చాయి.

  తోటి ప్రయాణీకుల సాయం....

  దేశంగాని దేశం. ఆమెతో పాటు ఉన్న వారిలో ఎవరికీ తెలుగు రాదు. అయినా పరిస్థితిని అర్థం చేసుకున్న పక్కన ఉన్న తోటి ప్రయాణికులు.. రైల్వే ఉద్యోగులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఖమ్మంలోని ఆర్పీఎఫ్‌ సీఐ మధుసూదన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వైద్యులను అప్రమత్తం చేసి.. 108 అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. అప్పటికే స్టేషన్‌ సూపరెంటెండెంట్‌కు విషయం తెలపడంతో రైలు ఆపడానికి అనుమతి సులభమైంది. ఒకవైపు నిండు గర్భిణి హనితాదేవి తీవ్రమైన నొప్పులతో అల్లాడిపోతుండడంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లోకి షిఫ్ట్‌ చేసి ఆమెను నేరుగా ప్రభుత్వాసుపత్రిలోని లేబర్‌ వార్డుకు తరలించారు. అలా ఆసుపత్రిలోకి తీసుకెళ్లిన కొద్ది నిమిషాలకే హనితాదేవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.  అర్థరాత్రి దాటినా అప్పటికే సిద్ధంగా ఉన్న కాన్పుల విభాగం వైద్యాధికారి డాక్టర్‌ కృపా ఉషశ్రీ, డాక్టర్‌ హస్మితో కలసి ఆమెకు మెరుగైన వైద్యం అందించారు.

  కేసీఆర్ కిట్ అందజేత...  నేపాల్‌ గర్భిణికి ఖమ్మంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా సాధారణ కాన్పు చేసినందుకు ఆసుపత్రి ఉన్నతాధికారులు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్‌ బొల్లికొండ శ్రీనివాసరావులు సిబ్బందిని అభినందించారు. శిశువుకు, బాలింతకు కేసీఆర్‌ కిట్‌ అందించారు. ఆమెతో పాటు ఉన్న మరో ఐదుగురికి కూడా భోజనం, వసతి ఏర్పాట్లు చేశారు. వారికి అలవాటైన భోజనాన్ని, రక్షణ కోసం ఓ గార్డును ఏర్పాటు చేసి, నేపాలీ భాష తెలిసిన వ్యక్తిని అందుబాటులో ఉంచారు. ఇదీ కథ. ఇలా రైలులో ప్రయాణిస్తున్న నేపాల్‌ దేశానికి చెందిన గర్భణికి మన దేశంలో.. మన రాష్ట్రంలో.. ఖమ్మంలో అందిన సేవలు.. ఆదరణ ఇది. ఇలా మానవత్వంతో స్పందించి మన దేశ కీర్తిని మరోసారి చాటుకున్నట్లయిందని స్థానికులు వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకున్న రైల్వే పోలీసు అధికారులను, వైద్యాధికారులను, సిబ్బందిని అభినందిస్తున్నారు. తమకు లభించిన ఆదరణ పట్ల హనితాదేవి ఆనందం వ్యక్తం చేశారు. ఇలా భయందోళనల మధ్య మొదలైన కథ మొత్తానికి సుఖాంతమవడంతో ఆమెతో ఉన్న బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Srinivas Munigala
  First published: