(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఆకుల కొండూరు గ్రామానికి చెందిన నారాయణ లక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం. ఏడేళ్ల బాబు సుశాంత్, నాలుగేళ్ల కూతురు లక్ష్మీ ప్రసన్న ఉన్నారు.. నారాయణ ఆటో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. భార్య లక్ష్మీ రోజా బీడీలు చుడుతూ ఉండేది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి కరోనా మహమ్మారి పాగా వేసింది. దీంతో లక్ష్మి గత ఏడాది జూలై 27న కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య చనిపోయిన రెండు నెలలకు నారాయణ కూడా కరోనా సోకి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. అయితే తండ్రి తరఫు బంధువులు ఎవరూ వీరిని దగ్గర తీయలేదు. దీంతో అమ్మమ్మ ఇద్దరు చిన్నారులను తీసుకుని వారి సొంతూరైన అబ్బపూర్ కు తీసుకు వచ్చింది. అయితే అమ్మమ్మ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వీరికి కనీసం మూడు పూటల భోజనం పెట్టే ఆర్ధిక స్తోమత కూడా అమ్మమ్మ దగ్గర లేదు. దీంతో గ్రామస్తులు సాయం చేసి రేషన్ సరుకులు అందించారు.
అయితే ఇద్దరు చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని, చదువుకోవడానికి అవకాశం కల్పించాలని అమ్మమ్మ కోరుతోంది. తమది పేద పరిస్థితిన.. ఈ పూరిగుడిసె లోనే ఉంటున్నామని ఆమె వాపోయింది. ఇద్దరు పిల్లలను పోషించే ఆర్థిక స్తోమత లేదని అమ్మమ్మ దీనంగా చెబుతోంది. అయితే సుశాంత్ తన చెల్లెలు లక్ష్మీప్రసన్న కు అన్నం తినిపిస్తూ ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు.. తల్లిదండ్రులు చనిపోయిన సంగతి సుశాంత్ కు మాత్రమే తెలుసు.. తన చెల్లెలు లక్ష్మీప్రసన్నకు అమ్మానాన్న లేరన్న విషయం ఇంకా తెలియదు.. అమ్మ ఫోటో పట్టుకొని అమ్మ ఎప్పుడు వస్తుంది.. నాన్న ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంది.. అయితే చెల్లెలికి అన్నీ తానై అమ్మలా మారిన అన్నయ్య.. భోజనం తినిపిస్తూ చెల్లితో కలిసి ఆడుకుంటూ.. బాగోగులు చూసుకుంటున్నాడు.
నేను ఒకటో తరగతి, మా చెల్లెలు అంగన్ వాడీ స్కూల్ లో చదువుకునే వారి మని సుశాంత్ చెబుతున్నాడు. మా నాన్న ఆటో నడిపేవారు.. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు నాకు, మా చెల్లికి చాక్లెట్స్, బిస్కెట్స్ తీసుకు వచ్చేవాడని గుర్తు చేసుకున్నాడు. మా అమ్మమ్మ వాళ్ల పరిస్థితి బాగా లేదు మాకు ఎవరైనా సహాయం అందించాలని ఆ బాబు దీనంగా కోరుతున్నాడు. కనీస లోకజ్ఞానం లేని ఈ చిన్నబాబు తనలోని అమ్మ నాన్న తనాన్ని తన చెల్లెలికి పంచుతూ చెల్లెలికి అండగా నిలుస్తున్నాడు.. ఈ దృశ్యం చూస్తుంటే అందరికీ కంటతడి వస్తోంది. ఈ చిన్నారులను ప్రభుత్వం అదుకోవాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.