Home /News /telangana /

NAZIMABAD THE SITUATION IN HASAKOTTUR VILLAGE IS TENSE COUNTERATTACKED THE POLICE AND VANDALIZED THE POLICE VEHICLE VB NZB

Telangana: పోలీసులు, స్థానికులకు మధ్య ఉద్రిక్త వాతావరణం.. పోలీసు వాహనం అద్దాలు పగలగొట్టిన గ్రామస్తులు.. అసలేం జరిగిందంటే..

పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేస్తున్న గ్రామస్తులు

పోలీసు వాహనం అద్దాలు ధ్వంసం చేస్తున్న గ్రామస్తులు

Telangana: సిద్దార్థ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడిని హత్య చేసి కరోనాతో చనిపోయాడని చిత్రీకరించే యత్నం చేశార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు. అనుమానితున్ని త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మృతుని బంధువులు, స్థానికులు పోలీస్ వాహ‌నం పై రాళ్లు రువ్వి వాహ‌నం అద్దాలు ధ్వంసం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  (పి.మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  నిజామాబాద్ జిల్లా క‌మ్మ‌ర్ ప‌ల్లి మండ‌లం హాసాకొత్తూర్‌ మారుతినగర్‌లో నివాసముండే మాలవత్‌ శ్రీనివాస్, సరోజ దంపతులకు కృష్ణ, సిద్ధార్థ (17) అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఏడాది నుంచి శ్రీనివాస్‌ మంచానికే పరిమితమయ్యాడు. సరోజ వ్యవసాయ కూలీ ప‌ని చేస్తుంది. పెద్ద కొడుకు చదువుకుంటున్నాడు. చిన్న కొడుకు సిద్ధార్థ హార్వెస్టర్‌ క్లీనర్‌గా ప‌ని చేస్తు కుటుంబానికి అండగా ఉన్నాడు. అయితే బుధవారం రాత్రి సిద్ధార్థను అతని స్నేహితుడు నరేందర్‌ వచ్చి తీసుకెళ్లాడు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో సిద్ధార్థ అన్న కృష్ణకు ఫోన్‌ చేసి సిద్ధార్థ కరోనాతో చనిపోయాడని టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు కనక రాజేశ్‌ చెప్పాడు. అంత్యక్రియల నిమిత్తం గండి హన్మాన్‌ ప్రాంతానికి రమ్మన్నాడు. దీంతో కృష్ణ, వసంత్‌తో పాటు రవి, స్వామి అక్కడకు వెళ్ళారు.. అయితే అక్క‌డ‌ ఎవరు లేరు. దీంతో సిద్ధార్థ గురించి నరేందర్‌ను ఆరాతీశారు. రాత్రి భోజనం చేశామని, కొద్దిసేపటికి సిద్ధార్థకు ఫోన్‌ రాగానే బయటకు వెళ్లాడని న‌రేంద‌ర్ చెప్పాడు. గండి హన్మాన్‌ వద్ద మృతదేహం ఉందని చెప్పినప్పటికీ అక్కడ లేకపోవడం, ఆర్మూర్‌ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో మృతదేహం ఉంద‌ని తెలిసింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియగానే వారు మార్చురీకి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా, శరీరంపై, తలపై కమిలి పోయిన గాయాలు కనిపించాయి. కట్టెలతో కొట్టి చంపేసినట్లు ఆనవాళ్లు గుర్తించారు.

  దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కనక రాజేశ్, అతని అనుచరులు కలిసి 15 రోజుల క్రితమే కృష్ణ, సిద్ధార్థను చంపేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు బోరుమన్నారు. ఈ క్రమంలోనే సిద్ధార్థను కనక రాజేశ్, అతని అనుచరులు బాలాగౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్‌ తదితరులు కలిసి చంపేశార‌ని మృతుని కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. తీవ్ర ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు క‌లిసి రాజేశ్‌ ఇంటిని ముట్టడించారు. నిందితుడి ఇంటిపై దాడికి యత్నించగా, పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. గంట గంటకు పరిస్థితులు ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు పెద్ద సంఖ్యలో బలగాలను దింపాయి. ఈ క్రమంలో పలుమార్లు ఆందోళనకారులను చెరదగొట్టారు. పరిస్థితులు చేయి దాటుతుండడంతో అదనపు బలగాలను పిలిపించారు. సాయంత్రం వేళ నిజామాబాద్‌ డీసీపీలు స్వామి, శ్రీనివాస్, ఆర్మూర్‌ ఏసీపీ రఘు చేరుకొని కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

  రాత్రి ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉన్నతాధికారుల సమక్షంలో, భారీ బందోబస్తు మధ్యే రాత్రి వేళ ఖననం చేశారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రాజేశ్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. అయితే నిందితుడు రాజేష్ ను త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మృతిని బంధువులు, స్థానికులు పోలీసు వాహ‌నం పై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో మ‌ళ్లీ ఉద్రిక్త ప‌రిస్థితులు నెలకొన్నాయి ఈ హ‌త్య‌కు కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క‌రికీ శిక్ష ప‌డాల‌ని లేదంటే ఊరుకునేది లేద‌ని మృతుడి బంధువులు, స్థానికులు హెచ్చ‌రిస్తున్నారు. ఆనుమానితుడు రాజేశ్ కు పోలీస్ స్టేష‌న్ లో భోజ‌నం పెడుతున్న పోటోలు వైర‌ల్ గా మారాయి. నిదితుడికి పోలీసులు మ‌ర్యాదలు చేస్తున్నారని మండిప‌డ్డారు. పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ ఉంద‌ని.. అతడిని శిక్ష నుంచి త‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. నేరం చేసిన వారికి త‌ప్ప‌కుండాశిక్ష ప‌డాల‌ని వారు కోరుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Nizamabad, Telangana Police

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు