(P.Mahender,News18,Nizamabad)
తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో వివాదాలు మరింత ముదిరాయి. ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియకం విషయంలో రచ్చ ఇంకా పెద్దదైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వర్సిటీ వేడెక్కింది. వైస్ చాన్సలర్(వీసీ) రవీంద్ర గుప్తాకు వ్యతిరేకంగా పలు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, ఒక దళితుణ్ని రిజిస్ట్రార్ గా నియమించడాన్ని జీర్ణించుకోలేకే కొందరు ఉద్దేశపూర్వకంగా లేని వివాదాలు సృష్టిస్తున్నారని వీసీ మండిపడుతున్నారు. కొన్నాళ్లు మాటలతో సాగిన వ్యవహారం ఇప్పుడు ఫిర్యాదులు, కోర్టు కేసుల దాకా వేళ్లింది..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అక్రమాలపై నిలదీస్తే, కులాల అంశాన్ని ప్రస్తావిస్తూ వీసీ చేసిన వ్యాఖ్యలపై ఓ విద్యార్థి సంఘం పోరాటానికి దిగింది. వీసీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే పరువునష్టం దావాను ఎదుర్కోవాలని బుధవారం లీగల్ నోటీసులు పంపారు సదరు విద్యార్థి సంఘం నేతలు. మరోవైపు రిజిస్ట్రార్ కనకయ్య సైతం తనకు ఓ విద్యార్థి సంఘం వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
తాజా ఫిర్యాదులు, నోటీసుల వ్యవహారంపై టీయూ వీసీ రవీందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. టీయూ రిజిస్టర్ పదవిని దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక కొందరు అధ్యాపకులు విద్యార్థి సంఘం నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత ఎంతో నమ్మకంతో తనకు వైసీ పోస్టు అప్పగించారని గుర్తుచేస్తూ, వర్సిటీకి చెడ్డపేరు తెచ్చేలా కుట్రలు పన్నుతోన్న సిబ్బంది, మాజీ సిబ్బంది, విద్యార్థి నేతలు అందరిపైనా విచారణ చేయిస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియలోనూ అసభ్యకరమైన పోస్టులు పెడుతోన్న విద్యార్థి నేతలపై ఫిర్యాదు చేస్తానన్నారు.
నిజానికి వర్సిటీ రిజిస్టర్ లకు సిబ్బందిని నియమించే అధికారం లేదని, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని అయినాకూడా దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగడంలో అర్థంలేదని వీసీ రవీందర్ అన్నారు. అయితే, వీసీ చెబుతున్న మాటలు అబద్దమని, ప్రభుత్వం, పాలక మండలి ఆమోదం లేకుండా, కనీసం నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా దొడ్డిదారిన డబ్బులు వసూలు చేసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేశారని విద్యార్థి సంఘం నేతలు వాదిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad, Nizamabad District