ఆ బాబుకు ఎవరికీ రాని కష్టమొచ్చింది. ఆరు సంవత్సరాల వయసు పిల్లాడు. తోటి చిన్నారులతో ఆడుతూపాడుతూ గడపాల్సిన వయసు. కానీ.. పాపం ఆ పిల్లాడికి ఓ అంతుచిక్కని వ్యాధి సోకింది. పుట్టిన నెల రోజుల నుంచి తల పరిమాణం పెరగడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆ పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పిల్లాడిని గండం నుంచి గట్టెక్కించాలని వారి స్థోమతకు మించి ఖర్చు చేశారు. ఎక్కడికి వెళ్లిన బాబు తల పెరుగాడానికి గల కారణాలు తెలియడం లేదు. దీంతో ఆ బాబు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తమ పిల్లాడికి వచ్చిన వ్యాధిని గుర్తించి.. ప్రాణాలు కాపాడలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కామారెడ్డి (KamaReddy) జిల్లా సదాశివనగర్ మండలం ఉత్తునూర్ గ్రామానికి చెందిన మల్లయ్య దంపతులు.. కూలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరు సంవత్సరాల క్రితం బాబు పుట్టాడు. ఒక్కగానొక్క కొడుకు.. మనోజ్ అని పేరు పెట్టుకున్నారు. పుట్టిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే నెల రోజుల వయస్సు నుంచి మనోజ్ తల పరిమాణం పెరుగుతుండటాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఎందుకు పెరుగుతుందో తెలియక, ఆ సమస్య నుంచి పిల్లాడిని బయటపడేసేందుకు ఆ తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎక్కడికి వెళ్లినా సరైన వైద్యం అందలేదు. తమ బాబుకు వచ్చిన వ్యాధి ఏంటనే విషయం కూడా వైద్యులు స్పష్టంగా చెప్పడం లేదని ఆ నిరుపేద తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరు సంవత్సరాలుగా తల పెరిగి పెద్దదైంది. అయితే మరో దురదృష్టకర విషయమేంటంటే.. మనోజ్ మాట్లాడుతున్నాడు కానీ నడవడం లేదు. తల మాత్రం చాలా పెద్దగా పెరిగి పోయింది. అయితే వారి ఆర్ధిక పరిస్థితి అంతంతా మాత్రంగా ఉంది. అయినా వారి స్థోమతకు మించి ఖర్చు చేశారు. అయినా సరైన వైద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ బాబుకు వచ్చిన వ్యాధి ఏంటనేది గుర్తించి వైద్యం అందించాలని వారు కోరుకుంటున్నారు. తన భార్యకు చెవులు వినిపించవని, తన కొడుకు తల రోజురోజుకూ పెరిగిపోతోందని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు ఎలాంటి ఆధారం లేదని.. తన భార్యకు, కొడుకుకు కనీసం పెన్షన్ కూడా రావడం లేదని వాపోయాడు. తమ దీన స్థితిని గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని మల్లయ్య కోరుతున్నాడు.
న్యూస్18 తెలుగు ప్రతినిధి: పి. మహేందర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kamareddy, Nizamabad, Telangana News, Telangana updates