Nizamabad: ‍‍కుటుంబ అవ‌స‌రాల కోసం న‌ర్సుగా మారిన స‌ర్పంచ్.. ఉద‌యం స‌ర్పంచ్‌గా... మ‌ధ్యాహ్నం ఏఎన్ఎంగా విధులు

సర్పంచ్ పద్మ

మ‌హిళ‌లు అంటే వంటింటి కుందేళ్లు అనేది పాత సామెత‌. కానీ ఇప్పుడు మ‌హిళలు ఏ రంగంలో అయినా వారి ప్ర‌తిభ‌ను చాటుతున్నారు. ఓ గృహిణి రాజ‌కీయాపై ఆస‌క్తితో ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నిక‌య్యారు.

  • Share this:
    మ‌హిళ‌లు అంటే వంటింటి కుందేళ్లు అనేది పాత సామెత‌. కానీ ఇప్పుడు మ‌హిళలు ఏ రంగంలో అయినా వారి ప్ర‌తిభ‌ను చాటుతున్నారు. ఓ గృహిణి రాజ‌కీయాపై ఆస‌క్తితో ఓ గ్రామానికి ప్రథమ పౌరురాలిగా ఎన్నిక‌య్యారు. ఉదయం సర్పంచ్‌గా గ్రామంలో అభివృద్ది ప‌నులు చేస్తూనే మ‌రో ప‌క్క‌ మధ్యాహ్నం నర్సుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు సేవ చేస్తోంది. కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేసేందుకు ప్రయత్నం చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో త‌ను ఎంచుకున్న స‌ర్పంచ్ ప‌ద‌వి, త‌న ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం కోసం న‌ర్సుగా ప‌ని చేస్తున్న‌ ఓ మహిళా సర్పంచ్‌పై ప్రత్యేక కథనం.

    నిజామబాద్ జిల్లా మాక్లూర్ మండలం బొంకన్‌పల్లికి చెందిన ఈమె పేరు తోట పద్మ. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తి చేశారు. పదేళ్ల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో 2019లో బొంకన్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేశారు. గులాబీ పార్టీ మద్దతు ఇవ్వడంతో సర్పంచ్‌గా విజయం సాధించారు. గ్రామ స‌ర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన ఏఎన్ఎం డ్యూటీని కొన్నాళ్లు వదిలేశారు. గ్రామ అభివృద్దిపై దృష్టి పెట్టారు. పల్లె ప్రగతి, ఉపాధి హామీ నిధులతో సుమారు 20 లక్షల అభివృద్ది పనులు చేశారు. గ్రామస్తులతో శభాష్‌ అనిపించుకున్నారు. ఆమె పనితీరును మెచ్చుకొని శిశు సంక్షేమ శాఖ ఏడాది క్రితం పురస్కారం ప్రదానం చేసింది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ కొద్ది రోజులుగా పద్మ పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తప్పని పరిస్దితుల్లో మళ్లీ ఏఎన్ఎంగా విధుల్లో చేరారు.

    ఇది కూడా చదవండి: Siddipet: ‘మేం చచ్చిపోతాం నాయనా.. ఇక మా వల్ల కాదు’ అంటున్న సర్పంచులు

    ఉదయం సర్పంచ్‌గా విధులు నిర్వరిస్తూనే, మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్‌ఎంగా డ్యూటీ చేస్తున్నట్లు పద్మ చెప్పారు. త‌న భ‌ర్త ఆరోగ్య ప‌రిస్థితి బాగా లేదు. ఆర్థిక కష్టాలు ఉండనే ఉన్నాయి. దీంతో కుటుంబ‌ పోష‌ణ కోసం న‌ర్సుగా ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. గ్రామంలో స‌ర్పంచ్‌గా ఇప్ప‌టికే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తి చేయించారు. ప్ర‌తి రోజు ఉద‌యం గ్రామంలోని ప‌నులు, గ్రామ‌స్తుల అవ‌స‌రాలు చూసుకున్న త‌ర్వాత న‌ర్సు డ్యూటీకి వెళుతున్నాన‌ని ఈ మహిళా స‌ర్పంచ్ చెప్పారు.

    పద్మ సర్పంచ్‌గా పదవి చేపట్టాక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠధామం, డంపింగ్ యార్డులను రూ.12 లక్షలతో నిర్మించారు. ఐతే ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల నిధులు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో.. మిగిలిన డబ్బును అప్పు చేసి మరీ తీసుకొచ్చి అభివృద్ధి పనులకు పద్మ ఖర్చు చేశారు. నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాకపోవడంతో అప్పులు తీరే దారి లేక.. తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏఎన్ఎంగా పద్మ డ్యూటీ చేస్తున్నారని గ్రామస్తులు చెప్పారు. సర్పంచ్ తన సొంత డబ్బులతో చేపట్టిన పనులకు బిల్లులు విడుదల చేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్పంచ్‌గా, ఏఎన్ఎంగా రెండింటికి పద్మ న్యాయం చేస్తున్నారని గ్రామస్తులు సర్పంచ్‌గా పద్మ సేవలను కొనియాడుతున్నారు.

    ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: రంగంలోకి సీఎం కేసీఆర్.. హుజురాబాద్‌లో రోడ్‌షోలు.. ఎప్పుడంటే..

    ఇదిలా ఉండగా.. పంచాయతీ అధికారి వాదన ఇందుకు భిన్నంగా ఉంది. బోక‌న్‌ప‌ల్లి స‌ర్పంచ్ ప‌ద్మ త‌న కుటుంబ అవ‌స‌రాల కోస‌మే న‌ర్సుగా పనిచేస్తోందని, అభివృద్ది ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు అన్నీ విడుద‌ల అయ్యాయని పంచాయితీ అధికారి పి.జ‌య‌సుధ చెప్పారు. ఎలాంటి పెండింగ్ బిల్లులు లేవ‌ని అన్నారు. అయితే కొత్త‌గా చేసిన అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి ల‌క్షా 50 వేల రూపాయ‌ల బిల్లు మాత్ర‌మే పెండింగ్‌లో ఉంద‌ని ఆమె తెలిపారు. గ్రామ సర్పంచ్‌లకు నిధులు సకాలంలో విడుదల కాకపోవ‌డంతో స‌ర్పంచ్‌లు పలు గ్రామాల్లో అప్పుల‌ పాలవుతున్నారు. గ్రామంలో అభివృద్ధి ప‌నులకు ద‌శ‌ల వారిగా నిధులు విడుద‌ల చేయాల‌ని స‌ర్పంచ్‌లు కోరుతున్నారు.

    న్యూస్18 తెలుగు ప్ర‌తినిధి: పి మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా

    Published by:Sambasiva Reddy
    First published: