హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kamareddy: హిందూ అమ్మాయిని కన్న కూతురులా చూసుకుని పెళ్లి చేసిన ముస్లిం దంపతులు

Kamareddy: హిందూ అమ్మాయిని కన్న కూతురులా చూసుకుని పెళ్లి చేసిన ముస్లిం దంపతులు

వధూవరులు

వధూవరులు

ఒక త‌ల్లికి పుట్టిన‌ బిడ్డ‌లే ఒక‌రికి ఒక‌రు కాకుండా పోతున్నారు. ఒక‌రికి క‌ష్టం వ‌చ్చిందంటే ముఖం చాటేస్తున్నారు. ర‌క్త సంబంధికులు సైతం అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజులివి. కానీ.. హిందూ అమ్మ‌ాయిని ముస్లిం మతానికి చెందిన మహిళ ద‌త్త‌త తీసుకుని మాన‌వ‌త్వాన్ని చాటింది.

ఇంకా చదవండి ...

కామారెడ్డి: ఒక త‌ల్లికి పుట్టిన‌ బిడ్డ‌లే ఒక‌రికి ఒక‌రు కాకుండా పోతున్నారు. ఒక‌రికి క‌ష్టం వ‌చ్చిందంటే ముఖం చాటేస్తున్నారు. ర‌క్త సంబంధికులు సైతం అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న రోజులివి. కానీ.. హిందూ అమ్మ‌ాయిని ముస్లిం మతానికి చెందిన మహిళ ద‌త్త‌త తీసుకుని మాన‌వ‌త్వాన్ని చాటింది. అంతేకాదు.. ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసి హిందూ సంప్రదాయం ప్రకారం ఆ ముస్లిం తల్లి పెళ్లి జరిపించింది. హిందూ, ముస్లిం ‘భాయ్.. భాయ్’ అనే మాట‌లు వింటున్నాము. కానీ ఇప్పుడు చూస్తున్నాం. దత్తత తీసుకున్న హిందూ యువతికి, హిందూ సంప్రదాయం ప్రకారం ముస్లిం దంప‌తులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. కామారెడ్డి జిల్లాలో జ‌రిగిన ఈ వివాహం కులాంతరం కావడం మ‌రో విశేషం. వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని బోర్లం సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా ఇర్ఫానా బాను విధులు నిర్వ‌హిస్తున్నారు. ఆమెకు ఇద్ద‌రు కూతుర్లు ఉన్నారు. అయితే గ‌త ప‌దేళ్ల క్రితం తాడ్వాయి మండ‌ల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వ‌హించేవారు. ఆ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన చందన అనే బాలికను బంధువులు గురుకుల పాఠ‌శాల‌లో చేర్పించారు. చంద‌న త‌ల్లిదండ్రులు ఓ దుర్ఘ‌ట‌న‌లో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ప్రిన్సిపాల్ ఇర్ఫానా బాను మ‌న‌సు చ‌లించింది. దీంతో త‌న‌కు ఉన్న ఇద్ద‌రు కూతుళ్ల‌కు మ‌రో కూతురు తోడుగా ఉంటుంద‌ని భావించి చందనను దత్తత తీసుకున్నారు.


గురుకులంలో చదువుతున్న చందనను సెలవుల్లో తన ఇంటికే తీసుకెళ్లి వారి పిల్ల‌లతో క‌లిసిమెలిసి ఉండేలా చూశారు. చందన కూడా వాళ్లతో కలిసిపోయి సంతోషంగా గడిపింది. చంద‌న‌ ఇంటర్మీడియట్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల‌లో పూర్తి చేసింది. అనంత‌రం హైదరాబాద్‌లో డీఎంఎల్‌టీ (ల్యాబ్‌ టెక్నీషియన్‌) కోర్సు పూర్తి చేసింది. చంద‌న‌కు పెళ్లి చేయాల‌ని ఇర్ఫాన బాను ఆలోచ‌న చేశారు. అయితే తోటి టీచ‌ర్ల‌తో విష‌యం చెప్పారు. వారు పెళ్లి సంబంధాలు చూడ‌డం ప్రారంభించారు.

అయితే ఓ టీచర్‌ నస్రుల్లాబాద్‌ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేసే వెంకట్రాంరెడ్డి అనే కుర్ర‌ాడు ఉన్న‌డ‌ని చెప్పారు. దీంతో ఆ అబ్బాయిని పిలిచి చంద‌న విష‌యం పూర్తిగా వివ‌రించారు. చంద‌న‌కు, వెంక‌ట్ రాం రెడ్డికి పెళ్లి చూపులు నిర్వ‌హించారు. ఇద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు న‌చ్చ‌డంతో వీరి వివాహ‌నికి పెద్ద‌లు పెళ్లి నిశ్చయించారు. అక్టోబ‌ర్ 24న పెళ్లి ఖరారు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి జ‌రిపించేందుకు ఒప్పుకున్నారు. దీంతో చంద‌న‌ను పెంచిన త‌ల్లిదండ్రులుగా ఇర్ఫానాబాను, భర్త షేక్‌ అహ్మద్‌తో కలిసి వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేసి ఘ‌నంగా పెళ్లి జ‌రిపించారు.

ఇర్ఫానా బాను దంపతులు

ఓ ముస్లిం దంప‌తులు హిందూ సంప్ర‌దాయం ప్రకారం జ‌రిగిన పెళ్లిలో కన్యాదానం చేయడం అంద‌రిని అశ్చ‌ర్యప‌రిచింది. పెంచిన ప్రేమతో వారు ఆనందంగా పెళ్లి జ‌రిపించారు. కట్న కానుక‌లు, ఇతర పెట్టిపోతలకు ఇర్ఫానా బానుతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న‌ కొందరు టీచర్లు క‌లిసి అందించారు. వివాహం, భోజన ఖర్చులకు పట్టణానికి చెందిన సాయిబాబా గుప్త స్వచ్ఛంద సాయం చేశారని తెలిసింది. అయితే ఈ వివాహ‌నికి ఇర్ఫానా బాను ఇద్దరు కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు విచ్చేసి చంద‌న‌ను ఆశీర్వదించారు.

ఇది కూడా చదవండి: Strange: ఇలాంటి పెళ్లిని మీరెప్పుడూ చూసి ఉండరేమో.. కానీ ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..!

చందనకు త‌ల్లిదండ్రులు లేర‌ని తెలిసిన వెంట‌నే ఆ అమ్మాయిని నా కూతురులా చూసుకున్నాన‌ని ఇర్పానా బాను అన్నారు. నేను ఓ ఉపాద్య‌యురాలిగా కంటే త‌ల్లిగానే చంద‌నను చూశాన‌న్నారు. ‘త‌ను 6వ తరగతిలో ఉండ‌గానే దత్తత తీసుకున్నాను. ఇంట‌ర్ పూర్తికాగానే.. డీఎంఎల్‌టి హైద‌ర‌బాద్ లో చ‌దివించాను. ఈ రోజు పెళ్లి చేసి ఓ ఇంటి దాన్ని చేయడం ఆనంద‌కరంగా ఉంది. మా సిబ్బంది, ఇతర పెద్దల సహకారంతోనే పెళ్ళి జ‌రిగింది’ అన్నారు. మానవత్వానికి కులం, మతం అడ్డుకాదని ఇర్పానా బాను నిరూపించారు. ఇలాంటి వారిని ఆద‌ర్శంగా తీసుకుంటే మున్ముందు మ‌నుషుల మ‌ధ్య విద్వేషాలు ఉండ‌కుండా బంధాలు, బాంధవ్యాలు మాత్రమే ఉంటాయి.

న్యూస్18 తెలుగు ప్ర‌తినిధి: పి. మ‌హేంద‌ర్, కామారెడ్డి జిల్లా

First published:

Tags: Husband, Kamareddy, Marriage, Wife

ఉత్తమ కథలు