P.MAHENDAR,Nizamabad, News18
వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్తే ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తండ్రైన తర్వాత భార్యను వదిలించుకునేందుకు తన చేతి వృత్తిని అడ్డుపెట్టుకొని ఆమెను చివరకు అనారోగ్యానికి గురి చేసిన ఘటన నిజామాబాద్ (Nizamabad)జిల్లాలో వెలుగుచూసింది. ఆర్మూర్ (Armoor)పట్టణానికి చెందిన స్రవంతి(Sravanthi), గంగసాగర్ (Gangasagar)అనే వ్యక్తితో 2017లో వివాహం జరిగింది. గంగసాగర్ ఆర్మూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్(Compounder)గా పనిచేస్తూ ఆర్‌ఎంపీ డాక్టర్‌గా చెలామణి అవుతూ క్లినిక్ పెట్టుకున్నాడు. స్రవంతి, గంగసాగర్ దంపతులకు ఏడాదికే బాబు పుట్టాడు. స్రవంతి బిడ్డకు జన్మనిచ్చిన మూడు నెలల తర్వాత నుంచి భర్త స్రవంతిని టార్చర్ పెడుతున్నాడని అంటోంది. మొదట్లో సాఫీగా సాగిన తమ కాపురంలో రాను రాను గొడవలు మొదలై చివరకు తనను వదిలించుకునే వరకు వచ్చాయంటోంది బాధితురాలు. తనకు స్కిన్ ఎలర్జీ (Skin allergy)వచ్చిందనే సాకుతో వేధింపులకు గురి చేసే వాడని ఆ తర్వాత ట్రీట్‌మెంట్ పేరుతో మోసం చేసి తన శరీరంలోకి విషపూరితమైన ఇంజెక్షన్స్ పంపాడని బాధితురాలు కన్నీరు పెట్టుకుంది. స్కిన్ ఎలర్జీకి వైద్యం చేయిస్తాననే సాకుతో తనకు గంగసాగర్ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ (Steroid Injections) ఇవ్వడం మొదలుపెట్టాడంటోంది స్రవంతి. ఇంజెక్షన్‌ల కారణంగా అనారోగ్యానికి గురవడంతో వేరే వైద్యులకు చూపించుకుంటే తన భర్త నిజస్వరూపం బయటపడిందని చెబుతోంది స్రవంతి. తనకు నరాలు బలహీనపడటానికి స్టెరాయిడ్స్ ఇచ్చినట్లుగా డాక్టర్లు చెప్పడంతో ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
భర్త చేతిలో మోసపోయిన మహిళ..
పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా తన భర్తకు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించింది. తనను అనారోగ్యానికి గురి చేశావు ఎందుకని గంగసాగర్‌ని నిలదీస్తే నువ్వు నాకొద్దు వెళ్లూ అంటూ చిత్రహింసలకు గురి చేశాడని..వదిలించుకునేందుకే ఇలా స్టెరాయిడ్ ఇంజక్షన్‌లు ఇచ్చి తన జీవితాన్ని నాశనం చేశాడంటూ బోరున విలపించింది. కట్టుకున్న భర్తే చిత్రహింసలు పెడుతూ వదిలించుకోవాలని చూస్తుంటే నాకు, నా బిడ్డకు దిక్కు ఎవరని ప్రశ్నిస్తోంది స్రవంతి.
న్యాయం చేయని పోలీసులు..
పోలీసులతో న్యాయం జరగకపోవడంతో జిల్లా కలెక్టర్‌ని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. భర్త చేతిలో మోసపోయిన తనకు నాకు న్యాయం చేయమని కలెక్టర్‌ని కోరేందుకే బిడ్డతో కలిసి నిజామాబాద్ జిల్లా కలెక్టరెట్‌కు వచ్చింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని స్రవంతి కన్నీరు పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.