Narasimha, News18, Nalgonda
మునుగోడు ఉపఎన్నిక (Munugodu by Election) ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంటోంది. ప్రచార పర్వం ముగిసేందుకు సమయం దగ్గర పడుతుండడం.. అన్ని పార్టీల్లోనూ టెన్షన్ తెప్పిస్తోంది. నియోజకవర్గవ్యాప్తంగా ఓటరు నాడీని ఏలా పట్టుకోవాలనే అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు తమ కార్యచరణను సిద్ధం చేసుకున్నాయి. యువత, రైతులు, పెన్షనర్లు, ఆయా పథకాల లబ్ధిదారులు, సానుభూతిపరులు ఇలా.. ఓటర్లను వర్గాలుగా విభజించేశారు. ఎవ్వరినీ ఎప్పుడు..? ఎలా..? టచ్ చేసి తమవైపునకు తిప్పుకోవాలనే అంశంపై అంతా రంగం సిద్ధం చేసి పెట్టుకున్నారు. అయితే మునుగోడు నియోజకవర్గంలో యూత్‌దే కీలక పాత్రగా కన్పిస్తోంది. వీరు ఎటువైపు మొగ్గు చూపితే.. దాదాపుగా విజయం అటువైపే ఖరారు కానున్నట్టు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గెలుపోటముల్లో యూత్‌దే కీ రోల్..
మునుగోడు నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే దాదాపు 15వేల ఓట్లు పెరిగాయి. ఇంత పెద్దసంఖ్యలో ఓట్లు పెరగడం వెనుక కారణాలు అనేకమనే చెప్పాలి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇదిలావుంటే.. మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం 2.41 లక్షల ఓట్లలో యూత్ ఓట్లే సగానికి పైగా ఉన్నాయి. అంటే మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా 18 ఏండ్ల వయస్సు నుంచి 39 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు అక్షరాల 1.25లక్షల పైచిలుకు. అంటే మొత్తం ఓట్లతో పోల్చితే సగానికి పైగా అన్నమాటే. ఈ యూత్ ఓట్లు ఎటువైపు మళ్లించగలిగితే.. అటువైపు విజయావకాశాలు పుష్కలమనే చెప్పాలి.
రంగంలోకి యూత్ విభాగాలు..
మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలో గెలవడంపై కాంగ్రెస్ , టీఆర్ఎస్ , బీజేపీలు బలంగా దృష్టిసారించాయి. ఇందులో టీఆర్ఎస్, బీజేపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1.25 లక్షల పైచిలుకు ఓట్లు ఉండడం.. వారి నాడీని పట్టగలిగితే.. గెలుపు సునాయసం కావడం.. తదితర అంశాలు యూత్ ఓటింగ్‌పైనే ఆధారపడి ఉండడంతో ఆయా ప్రధాన పార్టీలు తమ అనుబంధ యూత్ విభాగాలను రంగంలోకి దించాయి. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ మండలానికి 30 మందికి చొప్పున టీఆర్ఎస్వీ యూత్ లీడర్లను రంగంలోకి దించగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యూఐ లీడర్లు.. బీజేపీ నుంచి బీజేవైఎం లీడర్లు మునుగోడు ఉపఎన్నికలో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ యూత్ లీడర్లు సోషల్ మీడియాను విరివిగా వాడడంతో పాటు ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్ష పార్టీలను ట్రోల్ చేయడమే పనిగా ముందుకు సాగుతుండడం గమనార్హం.
హామీల కంటే ట్రోలింగ్ ఎక్కువ..
మునుగోడు ఉపఎన్నికలో రాజకీయ పార్టీల స్ట్రాటజీ గత ఎన్నికలతో పోల్చితే భిన్నంగా మారిపోయింది. గత ఎన్నికల్లో ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేశారు..? గెలిపిస్తే ఏం చేయబోతున్నారనే అంశాలే ప్రధాన ఎజెండాగా ప్రచారం కన్పించేంది. కానీ ప్రస్తుతం ఉపఎన్నికలో ప్రజలకిచ్చే హామీలకంటే ప్రత్యర్థులు చేసిన తప్పులపైనే ఎక్కువ ట్రోల్ నడుస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా.. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. మునుగోడు ఉపఎన్నికలో సోషల్ మీడియా హైలెట్ అవుతూ వస్తోంది. నిజానిజాలతో పని లేకుండా క్షణాల్లో మునుగోడు ఉపఎన్నిక సోషల్ మీడియా పుణ్యమంటూ ఖండంతారాలు దాటిపోతోంది. ఏదీఏమైనప్పటికీ మునుగోడు ఉపఎన్నికలో యూత్ ఓటింగే గెలుపోటములను శాసిస్తుందనడంలో ఏలాంటి సందేహం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Munugode Bypoll, Nalgonda, Telangana