ప్రేమ పేరుతో మరో ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. మాట్లాడాలని పార్కు(Park)కు పిలిపించి ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. స్నేహం ముసుగులో ప్రేమ పేరుతో యువకుడు చేసిన దాడిలో యువతి తీవ్రగాయలపాలై చావు , బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు(Police) కేసు నమోదు చేసుకొని నిందితుడ్ని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. నల్లగొండ(Nalgonda)జిల్లా కేంద్రంలో జరిగిన ఈఘటన తీవ్రకలకలం రేపుతోంది.
మాట్లాడాలని పిలిచి..
నల్లగొండ జిల్లా కేంద్రంలో రోహిత్ అనే ప్రేమోన్మాది నవ్య అనే యువతిని ప్రేమించమని ఏడు నెలలుగా వెంటపడుతున్నాడు. ప్రేమ పేరుతో వేధించడం, పదే పదే తన లవ్‌ని యాక్సెప్ట్ చేయమని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో మంగళవారం మొహర్రం పండుగ కావడంతో స్నేహితులతో కలిసి బయటకు వచ్చిన నవ్యను మాట్లాడాలని నల్లగొండ రామ్‌నగర్‌పార్క్‌కు తీసుకెళ్లాడు రోహిత్. మాట్లాడాలని చెప్పి నవ్యను పక్కకు తీసుకెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో అతి దారుణంగా విచక్షారహితంగా కడుపు, కాళ్లు, చేతులు, ముఖంపై పొడిచాడు. శరీరంపై ఎక్కడపడితే అక్కడ కత్తితో గాయపరిచాడు. ప్రేమోన్మాది రోహిత్ కత్తిపోట్లకు గురైన నవ్య తీవ్రరక్తస్త్రావంతో గట్టిగా అరవడంతో తన బైక్‌ని అక్కడే వదిలేసి పారిపోయాడు రోహిత్. నవ్యతో పాటు వచ్చిన శ్రేష్ట, తాయి అనే మరో ఇద్దరు ఆమెను వెంటనే సాయిరక్ష ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పరారీలో ప్రేమోన్మాది..
బాధితురాలు నవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రోహిత్ ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా గుర్తించారు. బాధితురాలు పానగల్‌కు చెందిన యువతిగా తేల్చారు. కత్తితో దాడి చేసి పారిపోయిన ప్రేమోన్మాది కోసం గాలిస్తున్నట్లుగా వన్ టౌన్ సీఐ రౌతు తెలిపారు. నవ్యతో పాటు బయటకు వచ్చిన స్నేహితుల ద్వారా పూర్తి వివరాలు సేకరించారు పోలీసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.