(Narsimha, News18, Nalgonda)
మునుగోడు(Munugodu)ఉప ఎన్నికలతో నియోజకవర్గ ప్రజల్లో గంపెడు ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఇతర పార్టీలలోని నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి రూ. కోట్లల్లో ఖర్చులు పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రోజువారి ప్రచారాల నిమిత్తం విందు భోజనాలు, మద్యంతో భారీగానే ఖర్చులు పెడుతూ వస్తున్నారు.రాష్ట్రంలోని అన్ని స్థాయిల లీడర్లు నియోజకవర్గంలో మకాం వేసిప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఓటర్లు కూడా అంతే స్థాయిలో పార్టీల నుండి డబ్బులు ఆశిస్తున్నారు. ప్రధాన పార్టీలు రూ.10 నుంచి 15 వేలకు మించకుండా తమకు డబ్బులు ఇస్తాయని ప్రజలు ఊహించుకుంటున్నారు. దీంతో తమకు అప్పులు ఇచ్చిన వారికి ఉపఎన్నికల పోలింగ్(Polling)తేదీ వరకు వేచి చూడమని చెప్తుండడంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
డబ్బులు ఎంత వచ్చెనో:
ఓటర్లు ఏ ఏ పార్టీ నుండి తమకు ఎంత డబ్బులు వస్తాయనేది ముందుగానే బేరిజు వేసుకుంటున్నారు. ప్రధానంగా మూడు పార్టీలు ఓట్ల కొనుగోలుకు డబ్బులు ఇస్తారనే ఆశలో ఓటర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధాన పార్టీల నాయకులు కూడా ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటూ వారి కంటే మేమే ఎక్కువ ఇస్తామననే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలిచి రాష్ట్రంలో తమ సత్తాచాటాలని ఉవ్విల్లురుతున్నాయి. అందుకు ఎంత ఖర్చైనా సరే వెనుకాడేది లేదంటూ నియోజకవర్గ నేతలతో అంటున్నారట. వీటన్నింటినీ గమనించిన ఓటర్లు సుమారు రూ.40 వేలకు తగ్గకుండా తమకు డబ్బులు వస్తాయని భ్రమలో ఉన్నారు.
వస్తే అప్పులు చెల్లు..
అందుకు ఉదాహరణగా ఇటీవల మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి 30 వేల రూపాయలను మరొక వ్యక్తి వద్ద చేబదులుగా తీసుకున్నాడు.ఇప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇవ్వమని వెళ్ళగాఉప ఎన్నికల పోలింగ్ తేదీ వరకు వేచి ఉండాలని నవంబర్ 3 తర్వాతరూ.30వేలు తిరిగి ఇచ్చేస్తానని సమాధానం చెప్పాడు. అప్పుడు డబ్బులు ఎక్కడి నుండివస్తాయని సదరు వ్యక్తి ప్రశ్నించగా ఉప ఎన్నికల్లోప్రధాన పార్టీలు ఎలాగూ డబ్బులు పంచుతున్నారు గనుక తనకు ఆ డబ్బులు వస్తాయని, వచ్చిన వెంటనే తీరుస్తానని సమాదానం ఇచ్చాడు. దీంతో ఓటర్లు ఏ స్థాయిలో అభ్యర్థుల పై ఆశలు పెట్టుకున్నారో తెలిసిపోతుంది.
ఓటింగ్ పై ప్రభావం!
ప్రధాన పార్టీలు ఓటర్లు అనుకున్న స్థాయిలో డబ్బులు చెల్లించకుంటే ఓటు వేసేందుకు కూడా వెనకాడుతున్నట్లు తెలుస్తుంది. ఓ పార్టీ ఏకంగా ఇంటికి తులం బంగారం పంచబోతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఓటర్లు ఆశించిన స్థాయిలో డబ్బులు రాకుంటేఓటు వేసేందుకు కూడా విముఖత చూపించే అవకాశం లేకపోలేదు. ప్రధాన పార్టీల నాయకుల ఆ ప్రచారంతో ఓటర్లు భారీగానే డబ్బులు ఆశిస్తుండడంతో ఆ ప్రభావం ఓటింగ్ పై ఎలా చూపబోతుందో వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda, Telangana News