(Narsimha, News18, Nalgonda)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారిన మునుగోడు(Munugodu)ఉపఎన్నికలో అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. దేశంలోనే కాస్ట్లీ ఎన్నికగా ప్రచారమైన మునుగోడు ఉపఎన్నిక చివరి అంకంలో నేలచూపులు చూస్తోంది. ‘అంతన్నడు.. ఇంతన్నడే.. గంగరాజు.. ’ అన్న సామెత చందంగా మారింది మునుగోడు అభ్యర్థుల పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) రాజీనామా అనంతరం మునుగోడు ఉపఎన్నికపై భారీ అంచనాలు పెరిగాయి. నేషనల్ మీడియా (National Media)సైతం ఈ ఉపఎన్నికపై ఆసక్తిగా చూస్తుంది. దీనికి తోడు సీఎం కేసీఆర్(KCR) జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ ఉపఎన్నికకు మరింత ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మునుగోడు ఉపఎన్నిక మొత్తంలో రూ.వందల కోట్లు ఖర్చు చేయనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఓటర్లకు సైతం భారీగా నగదు, ఇతర ప్రోత్సహకాలు ముట్టజెప్పుతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఇతర నియోజకవర్గాల్లో సెటిల్ అయిన ఓటర్లు సైతం.. తిరిగి మునుగోడు నియోజకవర్గంలో ఓటు నమోదు చేయించుకున్నారంటే పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా మునుగోడు ఉపఎన్నిక చివరి అంకానికి చేరుకుంది. ఇక ఓటర్లకు నగదు పంచడమే తరువాయిగా మిగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు ఓటర్లకు.. అటు అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఓటర్లకిచ్చే నగదుపై భారీ హైప్..
మునుగోడు ఉపఎన్నికలో ఒక్కో ఓటుకు రూ.30 వేల నుంచి రూ.60వేల వరకు గిట్టుబాటు అవుతుందనే ప్రచారం భారీగా జరిగింది. ఉపఎన్నిక ప్రచారం మొదలైన నాటి నుంచి నిత్యం మద్యం, బిర్యానీ పంపకం.. ప్రచారానికి వెళ్తే రూ.వెయ్యి నగదు ఇస్తున్నట్లు తదితర ప్రచారాలెన్నో జరిగాయి. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలకే ఆ పరిస్థితి పరిమితమయ్యింది. కానీ ఓటుకు భారీగా నగదు ఇస్తున్నారనే ప్రచారం మాత్రం ఖండాంతరాలకు దాటిపోయింది. మునుగోడు ఓటర్లకు మిగతా నియోజకవర్గాల్లో ఉన్న బంధువులు, స్నేహితులు ఫోన్లు చేసి మరీ.. మీకు అంత నగదు ఇస్తున్నారాట..? ఓటుకు తులం బంగారం ఇస్తున్నారటగా అని వాకబు చేయడం పరిపాటిగా మారింది.
తుస్సుమంటున్న ప్రచారం..
లోకల్ లీడర్ల ప్రచారంతో పాటు కొన్ని మీడియాల్లోనూ ఇదే తరహాలో ప్రచారం జరగడంతో ఓటు హక్కు ఉన్న వారందరిలోనూ కొత్త ఆశలు చిగురించాయి. కానీ తీరా పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ.. ఓటుకు రూ.30వేల నుంచి రూ.60వేల సంగతి పక్కనపెడితే.. కనీసం రూ.10వేలు సైతం చెల్లించే పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో కన్పించడం లేదని తెలుస్తోంది. ఆయా పార్టీలు ఇంటింటి ప్రచారం నిర్వహించడం మినహాయిస్తే.. ఇప్పటివరకు నగదు ఇచ్చిన దాఖలాలు లేవని మునుగోడు ఓటర్లు లబోదిబోమంటున్నారు. నిజానికి పోలింగ్ తేదీకి మరో రెండు రోజులే గడువు ఉండడం.. చివరి రోజు ఆంక్షలు ఉండడంతో ఏం జరిగినా ఈ ఒక్క రోజులోనే జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పటివరకు అలాంటి ఛాయలు కన్పించడం లేదు.
ఓటర్లు .. అభ్యర్థుల్లో అయోమయం..
మునుగోడు ఉపఎన్నికపై ఓటుకు రూ.30వేలకు పైనే చెల్లిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఓటర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చే సరికి రాజకీయ పార్టీలు ఓటుకు రూ.3వేల నుంచి రూ.6వేల వరకు మాత్రమే చెల్లించే సూచనలు కన్పిస్తున్నాయి. దీంతో అంతా ఇంతా అంటూ ప్రచారం చేసి.. రూ.3వేలు ఇస్తే.. మేమేలా తీసుకుంటామంటూ ఓటర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో తక్కువ డబ్బు ఇచ్చే అభ్యర్థులకు ఓటు వేస్తారా..? లేదా.. భారీగా ఇస్తామని రూ.3వేలు చేతిలో పెట్టినందుకు ఓటర్లు హ్యాండిస్తారా..? అన్న అనుమానాలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులు పుట్టిస్తోంది. ఏదీఏమైనప్పటికీ మునుగోడు ఉపఎన్నికపై భారీ హైప్ క్రియేట్ చేసి.. తీరా పోలింగ్ సమయం వచ్చేసరికి తృణమో పణమో చేతిలో పెడుతుండడాన్ని మునుగోడు ఉపఎన్నిక ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Munugode Bypoll, Telangana News