ఊరిలో జనం ఉన్నపళంగా ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోతుంటే ఎవరికైనా భయం కలుగుతుంది. ఎందుకు చనిపోతున్నారో తెలియకపోతే ఆ భయం మరింత రెట్టింపు అవుతుంది. అయితే అలాంటి పరిస్థితిని ఇప్పుడు నల్లగొండ (Nalgonda)జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్నారు. సహజ మరణాలో..? అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారో ..? లేక కీడు వల్ల గుండె చప్పుడు ఆగిపోతుందో ? తెలియక తలలు పట్టుకుంటున్నారు. చేసేదేమిలేక చివరకు గ్రామస్తులంతా కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దాంతో జనంలేని ఊరుగా మిగిలిపోయింది నకిరేకల్(Nakirekal)మండలంలోని చందుపట్ల(Chandupatla)గ్రామం.
అంతుచిక్కని సమస్య..
ఏదైనా ఊరికి అరిష్టం పట్టినా, లేక కీడు పీడిస్తున్నా ...ఆ ఊరిలో కరువు, దరిద్ర్యం, లేదంటే అనారోగ్య సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉంటారని పూర్వికులు కొందరు చెబుతూ ఉంటారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని చందుపట్ల గ్రామం పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఇంచుమించు అలాగే ఉంది. గత 12రోజులుగా ఊరిలో రోజుకు ఒకరి చొప్పున చనిపోతున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే గత 21వ తేదిన మొదలైన మరణమృదంగం ఫిబ్రవరి నెలలోకి అఢుగుపెట్టినా ఆగడం లేదు. ఒకరిద్దరు కాదు కేవలం 12రోజుల్లో గ్రామానికి చెందిన 12మంది కన్నుమూశారు.
ఊరు వదిలి వనవాసం..
చందుపట్ల గ్రామంలో ఇదే ఇప్పుడు అందర్ని వేధిస్తున్న ప్రశ్న. అసలు ఊరికేమైనా అయిందా లేక ఊరి జనాన్ని ఏదైనా పట్టి పీడిస్తోందా అనే సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజుకు ఒకరు చనిపోవడం తెల్లారితే చావు మేళాలతో ఊరి గొల్లుమనడంతో గ్రామస్తులు ఏం జరుగుతుందో తెలియక ఒక నిర్ణయానికి వచ్చారు. గ్రామానికి పట్టిన కీడు వదిలిపోవాలని ..గ్రామస్తులు సుఖ సంతోషాలతో గడపాలని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ప్రాణభయంతో..
ఎవరి విశ్వాసాలు వారికి అన్నట్లుగా గ్రామంలో నివసిస్తున్న వారంతో ఊరికి ఏదో కీడు పట్టుకుందని భావించారు. అందుకు ప్రత్యామ్నాయ మార్గం కోసం గ్రామ పెద్ద నిర్ణయాన్ని గౌరవిస్తూ ఊరిలోని ఇళ్లకు తాళాలు వేసుకొని ఊరి శివార్లలో ఉన్న వనవాసానికి వెళ్లారు. అంతే కాదు కీడు పీడ వదిలిపోవాలని కోళ్లు, మేకలను బలిచ్చి గ్రామదేవతలను చల్లంగా చూడమని గ్రామ దేవతకు శాంతి పూజలు చేశారు. ఈవిధంగానైనా తమ గ్రామానికి పట్టుకున్న పీడ విరగడమై ఊరు మిగులుతుందని బావించారు.
ఊరికి పట్టిన పీడ వదిలేనా..
చందుపట్ల గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మూఢనమ్మకాలుగా కొట్టిపారేయకుండా వాళ్లలో ఉన్న భయాన్ని, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని ఇలా ఊరుని వదిలిపెట్టి వనవాసం చేస్తున్నారని గౌరవించాలి. గ్రామస్థులకు అంతా మంచి జరగాలని ఆకస్మిక మరణాలు ఆగిపోవాలని కోరుకుందాం.
మరణాలకు బ్రేక్ పడాలని మాత్రం అందరం కోరుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Telangana News