(Nagaraju, Nalgonda)
అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ .. మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అవయవ దానం వల్ల ఒక్క మనిషి పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, చేతులు, ముఖం, కళ్లు, ఎముక మూలుగ, కణాలు ఇలా దాదాపు 200 అవయవాలు దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుంది. కర్ణుడు బతికుండగానే తన కవచ కుండలాలను దానం చేసి చిరస్మరణీయుడయ్యాడు. మనం చనిపోయాక అవయవాలు దానం చేయలేమో. మట్టిలో కలిసి, బూడిదగా మారే మన అవయవాలను మరొకరికి జీవితాల్లో వెలుగు నింపడానికి అందివ్వలేమా?.. అలాంటి పని సూర్యాపేటకు చెందిన ఓ కుటుంబం చేసింది.తన ప్రాణం కోల్పోతున్న ఓ మహిళ (Woman).. మరో నలుగురికి తన అవయవ దానంతో కొత్త ప్రాణం పోశారు. సూర్యాపేట (Suryapet) జిల్లాలోని పాలకీడు మండలం అలంగాపురం గ్రామానికి చెందిన పోరెడ్డి శశికళ (Sashikala)కు అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ (Brain dead) కావడంతో.. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమె అవయవాలను జీవన్‌దాన్ సంస్థకు అప్పగించారు.
హైదరాబాద్ (Hyderabad)లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్న శశికళ.. గత కొంత కాలంగా రక్త పలకికలు తగ్గడంతో అనారోగ్య సమస్యలు (Health issues) ఎదుర్కొంటున్నారు. చాలా కాలంగా ఆమెకు ప్లేట్‌లెట్ సమస్య ఉన్నప్పటికీ.. గతేడాది జూన్‌లో కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న సమయం నుంచి సమస్య మరింత తీవ్రమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి నుంచి రక్త పలకికల పెంపుదల కోసం ఎన్ని జాగ్రత్తలు చేపట్టినా.. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఫలితం దక్కలేదని.. చివరిగా గత రెండు రోజుల నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి (Jubilee appolo hospital)లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ పాలయ్యారని వివరించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. మరో నలుగురికి ప్రాణదానం చేయాలనే సదుద్దేశంతో శశికల (Shashikala) కుటుంబ సభ్యులు జీవన్‌దాన్ సంస్థ (Jeevandan Organization)కు శశికల అవయవాలను (Organs) అప్పగించారు. బాధలో ఉన్నా.. గొప్ప మనసుతో శశికల కుటుంబ సభ్యులు అవయవదానం కార్యక్రమానికి ముందుకు వచ్చారని.. ఆమె నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రక్త నాళాలు, కిడ్నీలతో మరో నలుగురికి పునర్జన్మ కల్పించే అవకాశం ఉందని జీవన్‌దాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
అవయవ దానం ఎవరు చేయవచ్చు..?
ఎవరైనా ఏ వయసు వారైనా అవయవ దానం చేయవచ్చు. 18 సంవత్సరాల లోపు వారు అవయవ దానం చేయాలనుకుంటే వారి తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. అవయవ దానాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'జీవన్' అనే సంస్థను ఏర్పాటు చేసింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ సంస్థ పని చేస్తుంది. ఎవరికైనా అవయూలు కావాల్సి వస్తే.. ఇందులో పేరు నమోదు చేసుకోవాలి, వారికి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో వినియోగిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.