మునుగోడు(Munagodu)సమరభేరి బహిరంగసభ ద్వారా కాషాయం పార్టీ నేతలు తెలంగాణలో రాబోయేది బీజేపీ (BJP)ప్రభుత్వమేనని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయకుండా మోసం చేస్తున్న టీఆర్ఎస్(TRS)ను ఓడించి కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రజల్ని కోరారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah). రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day)అధికారికంగా నిర్వహిస్తామని మాటిచ్చారు బీజేపీ అగ్రనేత. మునుగోడు ఉపఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati Reddy Rajagopal Reddy)ని భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్ పతానానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు కమలం నేతలు. డబుల్ బెడ్రూం ఇళ్ల (Double bedroom houses)పేరుతో కేసీఆర్ కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న కేంద్ర పథకాలకు అడ్డుపడుతున్నారని విమర్శించారు అమిత్‌షా.
కేసీఆర్ పతనం మునుగోడుతో మొదలు: బీజేపీ
మునుగోడు ఉపఎన్నికల సమరభేరీకి సమరశంఖం పూరించారు బీజేపీ నేతలు. ఆదివారం కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా బహిరంగసభ వేదిక ద్వారా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్బంగా మునుగోడు ప్రజల్ని ఉద్దేశించి అమిత్‌షా కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి బీజేపీలోకి చేరారని అమిత్‌షా అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. కేసీఆర్ సర్కార్ అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, నిరుద్యోగభృతి, తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ మాటలు ఏమైపోయాయని ప్రశ్నించారు అమిత్‌షా.
మేం వస్తాం..తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తాం:అమిత్‌షా
మునుగోడు బైపోల్‌ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ కేసీఆర్‌ను, టీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. మజ్లిస్ పార్టీ నేతలకు భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్‌షా ప్రకటించారు. పెట్రోల్ ధరలపై భారం తగ్గించేందుకు మోదీ సర్కారు రెండు సార్లు పెట్రోల్ ధరలు తగ్గిస్తే .. కేసీఆర్ మాత్రం తగ్గించలేదన్నారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయన్నారు అమిత్‌షా. పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్న కేసీఆర్ కేంద్రం ఇచ్చే మరుగుదొడ్ల డబ్బులు ప్రజలకు చేరకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రతి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామన్న కేసీఆర్ నల్లగొండలో ఎందుకు నిర్మించలేదో కేసీఆర్ చెప్పాలని కోరారు.
కేసీఆర్ ఫ్యామిలీకే ఉద్యోగాలు:కిషన్‌రెడ్డి
రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న కేసీఆర్ కేవలం తన కుటుంబంలోని అందరికి ఉద్యోగాలు ఇప్పించి ప్రజలు, నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు అమిత్‌షా. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్ ఈసారి టీఆర్‌ఎస్ కేసీఆర్ స్థానంలో కేటీఆర్ వస్తారంటూ అమిత్‌షా ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. అమిత్‌షా తెలంగాణకు ఎందుకొస్తున్నారని అడిగిన కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడానికే వస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. అంతే కాదు మోదీ తనను గోకకపోయినా, తాను ఆయనను గోకుతానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సెటైర్ వేశారు. కేసీఆర్ గారు మీకు దురదపెడితే గోక్కోండి మామ్మల్ని గోకడం ఎందుకని ఎద్దేవా చేశారు.
కమలం నేతల విమర్శలు ..
ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పోవాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. ఎనిమిదేళ్లుగా సీపీఐ, సీపీఎం నేతలు ప్రగతి భవన్‌లో అడుగుపెట్టారా? ధర్నా చౌక్‌ను నిషేధించిన కేసీఆర్‌కు లెఫ్ట్ పార్టీ మద్దతా అంటూ ఈటల మండిపడ్డారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్లను రద్దు చేసినప్పుడు ఎక్కడున్నారు?. కేసీఆర్ ద్రోహాలు వామపక్ష నేతలు మర్చిపోయారా? అని ఈటల ప్రశ్నలు సంధించారు. అటు విజయశాంతి సైతం కేసీఆర్ పతనం ఆరంభమైపోయిందన్నారు. మునుగోడు నుంచే కేసీఆర్ పాలనకు అంతం పలుకుతామన్నారు. కేసీఆర్‌కు ఫ్రస్టేషన్ ఎక్కువైపోయిందన్నారు. తప్పు చేసిన వారే భయపడతారన్నారు. కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ నాయకుల్ని వేరు చేయలేదరని విజయశాంతి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.