NALGONDA POLICE ARRESTED A PRISONER WHO ESCAPED FROM A COURT IN MIRYALAGUDA WITHIN HOURS WITH THE HELP OF FASTAG PRV
Fastag caught Prisoner: జైలు నుంచి తప్పించుకుని పారిపోతున్న ఖైదీని పట్టించిన ఫాస్టాగ్.. మిర్యాలగూడలో సినీ ఫక్కీలో ఘటన
ప్రతీకాత్మక చిత్రం
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గురువారం కోర్టు నుంచి తప్పించుకున్నాడు ఓ ఖైదీ. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇంతకీ పోలీసులు కేసును ఈజీగా చేధించారంటే అది ఫాస్టాగ్ వల్లనే. అసలేం జరిగిందంటే..?
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda)లో గురువారం కోర్టు నుంచి తప్పించుకున్న ఖైదీ (Prisoner)ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి (Fastag caught Prisoner) పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. మిర్యాలగూడ కోర్టు ఆవరణ అది. చర్లపల్లి జైలు (Charlapalli jail) నుంచి ఒక జీవిత ఖైదీని వేరొక కేసులో విచారణ కోసం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. జైలులో పరిచయమైన మరొక ఖైదీ బంధువులను (Prisoner relatives) ముందే అక్కడికి రప్పించిన ముద్దాయి వారి కారు తీసుకుని అక్కడి నుంచి హఠాత్తుగా పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్ దిశగా పారిపోయిన అతడిని పోలీసులు ఫాస్టాగ్ (Fastag) ఆధారంగా గుర్తించారు (Fastag caught Prisoner). ఎట్టకేలకు అర్ధరాత్రి దాటాక ఏపీలోని ప్రకాశం జిల్లాలో పట్టుకోగలిగారు.
అలా ఎలా తప్పించుకున్నాడు?
నల్గొండలోని (Nalgonda) మిర్యాలగూడ ఒకటో పట్టణ సీఐ మండవ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆంధ్రప్రదేశ్‌లోని (AP) కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నవులూరు గ్రామానికి చెందిన రవిశంకర్ (46) పై తెలుగు రాష్ట్రాల్లో 40కి పైగా కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లోని (Hyderabad) హయత్‌నగర్‌లో 2019 లో జరిగిన కిడ్నాప్, అత్యాచారం కేసులో రవిశంకర్ (ravi shankar) చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మరో ఖైదీ శ్రీధర్ తో ములాఖత్‌కి వచ్చిన అతడి బంధువులతో రవిశంకర్ పరిచయం చేసుకున్నాడు. మే నెల 5న మిర్యాలగూడ కోర్టుకు వస్తానని, ఆరోజు అక్కడికి రావాలని వారిని కోరాడు. గురువారం ఉదయం రవిశంకర్ ను అంబర్‌పేట హెడ్ కోటర్స్ కు చెందిన రిజర్వు పోలీసులు మిర్యాలగూడ తీసుకువచ్చారు. కోర్టులో ప్రక్రియ ముగిసేసరికి సాయంత్రం అయ్యింది. అక్కడికి వచ్చిన తన మిత్రులతో మాట్లాడతానని రవిశంకర్ పోలీసులను కోరారు.
డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా..
రవిశంకర్ అప్పటికే అక్కడ వేచి ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతే ఇక తన పథకం ఆచరణలో పెట్టాలని పూనుకున్నాడు. పక్కనే వారి కారు (టీఎస్ 08జీఎల్ 8818) చూశాడు. కారు తాళలు అక్కడే వదిలేసి ఉండటంతో కిలాడీ పని సులువయింది. అంతే ఒక్కసారిగా కారెక్కి వేగంగా డ్రైవ్ చేశాడు. నిందితుడు కారులో అద్దంకి రహదారి దిశగా దూసుకుపోయాడు. ఈ హఠాత్ పరిణామంతో నివ్వెరపోయిన రిజర్వు పోలీసులు వెంటనే స్థానిక పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో రంగంలోకి దిగారు. డ్రైవర్ సెల్ ఫోన్ సిగ్నల్ (Mobile phone signal) ఆధారంగా ఖైదీ గురజాల వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. కాసేపటికి ఆ ఫోన్ స్విచాఫ్ చేయడంతో ఫాస్టాగ్ (Fastag) ఆధారంగా ప్రయత్నించారు.
పోలీస్ బ్రెయిన్..
అయితే నిందితుడి ఆనవాళ్లు దొరకాలని పోలీసులు పకడ్భందీ ప్లాన్ రెడీ చేసుకున్నారు. దారిలో ఎలాగో టోల్గేట్లు వస్తాయని, అక్కడ డబ్బులు చెల్లించనిదే కారు ముందుకెళ్లే ప్రసక్తే ఉండదని.. దీంతో నిందితుడు కారు వదిలేసి పారిపోతే ట్రేస్ చేయడం కష్టమని భావించారు. వెంటనే కారులో ఫాస్టాగ్ (Fastag) కు అప్పటికప్పుడు రీఛార్జి చేయించి కారు వెళ్లే మార్గాన్ని అనుసరించారు. నల్గొండ జిల్లా పోలీసు కంట్రోల్ రూం నుంచి ప్రకాశం జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఒంగోలు జాతీయ రహదారిపై గస్తీ నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మల్లూరు ప్రాంతం వద్ద కారులో వస్తున్న రవిశంకర్ ను గుర్తించారు. దాదాపు ఏడు కిలోమీటర్లు వెంబడించి టంగుటూరు టోల్ గేట్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా పోలీసులు అతడిని శుక్రవారం ఉదయం మిర్యాలగూడ తీసుకువచ్చి కోర్టులో హాజరు పరిచారు. ఖైదీని పట్టుకోవడానికి సాయపడిన ఫాస్టాగ్‌కు పోలీసులు థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.