Narsimha, News18, Nalgonda
మునుగోడు ఉప ఎన్నిక (Munugodu By Election) దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. అనుహ్యంగా వచ్చిన ఈ ఉపఎన్నిక పోరులో ఎవరూ గెలుస్తారనే అంశంపై తెలంగాణ వర్గాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్నివర్గాలు ఉత్కంఠతో చూస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ , టీఆర్ఎస్ , బీజేపీ పార్టీలకు ఈ ఉపఎన్నిక ఇజ్జత్‌కా సవాల్‌గా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ ఉపఎన్నిక వ్యవహారంలో నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఏకంగా ఆర్ఓపై కేంద్ర ఎన్నికల సంఘం వేటువేయడం అందరినీ ఉలిక్కిపాటుకు గురి చేసింది. దీంతో అధికార యంత్రాంగం సైతం ఉపఎన్నిక విషయంలో అలర్ట్ అయ్యిందనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగడం మరింత ఉత్కంఠను రేపుతోంది.
పోలింగ్ పరిస్థితి ఇదీ..
మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,21,672 మంది పురుష ఓటర్లు కాగా, 1, 20,126 మంది మహిళలు ఓటర్లు. మరో ఏడుగురు అభ్యర్థులు ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. ఈ ఉపఎన్నికకు 119 కేంద్రాల్లోని 298 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా.. అర్బన్ పరిధిలో 35, రూరల్ పరిధిలో 263 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తంగా ఈ ఉపఎన్నికలో 1192 ఈవీఎంలు, 596 వీవీ ప్యాట్లు, 596 కంట్రోల్ యూనిట్లను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణకు 373 మంది పీవో, 373 మంది ఏపీవో, 740 జీపీవోలతో పాటు సుమారు రెండు వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. నోడల్ అధికారులు 16 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే.. ఉపఎన్నిక పోరులో 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్న సంగతి తెలిసిందే.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
తొలిసారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తుండగా.. ఓటరు స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తైంది. ఆన్‌లైన్‌లోనూ ఈ స్లిప్‌లను అందుబాటులో ఉంచారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలతో పాటు వృద్ధులకు వీల్ ఛైర్లనూ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల లోపల కేంద్రంలోకి వచ్చే ప్రతి ఒక్క ఓటరు.. ఎంత రాత్రైనా ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే సరిచేయడానికి పెద్ద ఎత్తున ఇంజినీర్లను సైతం అందుబాటులో ఉంచారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇదిలావుంటే.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా ప్రతి గంటకూ నేరుగా పోలింగ్ కేంద్రం నుంచి ఓటింగ్ శాతం నమోదు చేయనున్నారు.
కేంద్ర బలగాల నిఘా నీడలో..
మునుగోడు ఉపఎన్నిక ప్రత్యేక పరిస్థితుల నడుమ జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ప్రచారం ముగిసిన నాటి నుంచే మద్యం, నగదు పంపిణీపై ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఉపఎన్నిక డ్యూటీలో 15 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తుండగా, వీరికితోడుగా మరో 3366 మంది స్టేట్ పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి నగదు, మద్యం రాకుండా నియోజకవర్గం చుట్టూ చెక్ పోస్టుల ద్వారా అణువణువు చెక్ చేస్తున్నారు.
క్షణక్షణం అప్రమత్తత..
మునుగోడు ఉపఎన్నికలో ఘర్షణపూరిత ఘటనలు చోటుచేసుకోవడంపై ఎలక్షన్ కమిషన్ సిరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. నిజానికి నియోజకవర్గం మొత్తంలో 105 గ్రామాలను అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు ఈసీ గుర్తించింది. కానీ గత రెండుమూడు రోజుల్లో చౌటుప్పల్, నాంపల్లి, మునుగోడు, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఉద్రిక్తతలు, పరస్పర దాడులు జరిగాయి. నిఘా వర్గాలు సైతం ఇదే అంశంపై హెచ్చరించడంతో పోలీసులు బలగాలు అప్రమత్తమయ్యాయి. పోలింగ్ సమయంలోనూ ఏదైనా జరిగితే అవకాశాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో అక్కడ ఈసీ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఒక్కో గ్రామంలో కేంద్ర బలగాలతో పాటు ఇద్దరు ఎస్ఐలు, సీఐలకు క్లస్టర్ల వారీగా బాధ్యతలు అప్పగించారు.
క్షేత్రస్థాయిలో సర్వేలైన్ కెమెరాలు..
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి పోలింగ్ ప్రక్రియను సర్వేలైన్ కెమెరాలకు అనుసంధానం చేశారు. అత్యాధునిక కెమెరాలతో చెక్‌పోస్టులు, సర్వైలెన్స్ టీమ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. పోలింగ్ కేంద్రాల్లో చిత్రీకరించిన వీడియో నేరుగా నల్లగొండ కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇదిలావుంటే.. సాయంత్రం 6 గంటలలోగా కేంద్రం లోపలికి వచ్చే ప్రతి ఓటరు ఎంత రాత్రయినా ఓటు వేసేలా ఈసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.
విచ్చలవిడిగా ప్రలోభాలు..
మునుగోడు ఉపఎన్నిక ప్రస్తావన వచ్చిన నాటి నుంచే ప్రలోభాల పర్వం మొదలయ్యింది. ఎన్నికల అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రలోభాలకు అడ్డుకట్ట పడిందేలేదు. ప్రచారపర్వం ముగిసినా.. కేంద్ర బలగాలు, పోలీసులు క్షేత్రస్థాయిలో ఉన్నా.. నగదు, మద్యం పంపిణీ ఏమాత్రం ఆగడం లేదు.ఎక్కడేం జరగాలో.. అక్కడా అంతా జరుగుతోంది.ఓటుకు రూ.3వేలు పంపిణీ చేయడంతో పాటు గోడ గడియారాలు, స్మార్ట్ వాచ్‌లు, పురుష ఓటర్లలో పెద్ద వయస్సువారికి క్వార్టర్ బాటిల్, యువతకు బీర్ బాటిళ్ల పంపిణీ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. ఇదిలావుంటే.. కొంతమంది ప్రజలు.. ఓటుకు రూ.10వేలకు పైగానే ఇస్తామనే ప్రచారం చేసి.. తీరా ఓట్లు వేసే సమయంలో రూ.3వేలు చేతిలో పెట్టడం ఏంటని.. నేతలను స్థానికంగా నిలదీయడం కొసమెరుపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Munugode Bypoll, Nalgonda, Telangana