విధి ఎంత విచిత్రమైనదంటే సంతోషంగా ఉంటున్న జీవితాల్లో విషాదాన్ని నింపుతుంది. నల్లగొండ(Nalgonda)జిల్లాలో కొత్తగా పెళ్లైన యువతితో పాటు ఆమె తల్లి చనిపోవడం స్థానికుల్ని తీవ్రంగా బాధించింది. ఇరవై సంవత్సరాలు ప్రేమగా పెంచుకున్న కూతురుకి రెండు నెలల క్రితమే వివాహం చేసింది. ఆషాడమాసం సందర్భంగా తల్లి దగ్గరకు వస్తే అంత ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయారు.
ఇద్దరి ప్రాణాలు తీసిన వర్షం
నల్లగొండ టౌన్ పద్మానగర్‌లో నివాసముంటున్న నడిపూరి లక్ష్మి ఆమె కూతురు కల్యాణి మృతి చెందారు. రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి మట్టిగోడ తడిసి ఇల్లు కూలిపోయింది. దానికింద కూరుకుపోయి తల్లీబిడ్డ ఇద్దరూ కన్నుమూశారు. చనిపోయిన తల్లీ కూతుళ్లలో కూతురు కల్యాణికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఆషాడమాసం కావడంతో మెట్టినింటి నుంచి పుట్టినల్లుగా భావిస్తున్న తల్లి లక్ష్మీ దగ్గరకు వచ్చింది. చనిపోయిన తల్లీ,కూతురు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలసకు చెందిన వాళ్లుగా గుర్తించారు. పదేళ్ల క్రితమే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా లక్ష్మీ భర్త నాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లైన రెండు నెలలకే..
బిడ్డను పోషించుకునేందుకు లక్ష్మీ నల్లగొండకు వచ్చింది. ఇక్కడే మూడేళ్లుగా రైల్వే కూలీలకు వంట చేసి పెడుతూ జీవిస్తోంది. కష్టం చేసుకుంటూ కూతురు కల్యాణికి మే 14న శ్రీకాకుళం జిల్లా ధర్మూర్ మండలానికి చెందిన శ్రీనుతో వివాహం జరిపించింది. అంతా బాగానే సాగిపోతోంది. కూతురు, అల్లుడు సంతోషంగానే ఉంటున్నారు. ఆషాడమాసం కావడంతో కల్యాణి వారం రోజుల క్రితమే తల్లి ఉంటున్న నల్లగొండకు వచ్చింది. గురువారం రాత్రి సమయంలో ఇద్దరూ భోజనం చేసి నిద్రపోయారు. తెల్లవారుజాము సమయంలోనే భారీ వర్షం కురిసింది. ఆ వర్షానికి మట్టిగోడలు కావడంతో ఇల్లు కూలిపోయి మట్టి గడ్డలు పడి కల్యాణి, లక్ష్మీ స్పాట్లో చనిపోయారు.
ఆషాడమాసం ప్రభావం..
భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళతో పాటు రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న కుమార్తెపై మట్టిగడ్డలు పడి చనిపోవడం స్ధానికంగా అందర్ని కలచివేసింది. అయితే వర్షం కురిసిన రాత్రి లక్ష్మీ కొడుకు ఇంట్లో లేకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య, అత్త చనిపోయిన విషయం తెలుసుకున్న అల్లుడు శ్రీను అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్లారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ మహిళ వర్ష బీభత్సానికి బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోవడాన్ని స్వగ్రామంలో ఉన్న బంధువులు సైతం జీర్ణించుకోలేకపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Death, Heavy Rains, Nalgonda