హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mosambi cultivation: నల్గొండలో మళ్లీ ఊపందుకున్న బత్తాయి సాగు.. 42 వేల ఎకరాల్లో బత్తాయి పంట!

Mosambi cultivation: నల్గొండలో మళ్లీ ఊపందుకున్న బత్తాయి సాగు.. 42 వేల ఎకరాల్లో బత్తాయి పంట!

X
అమ్మకానికి

అమ్మకానికి సిద్ధంగా ఉన్న బత్తాయి పంట

ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పండుతున్న ప్రాంతంగా నల్గొండ జిల్లాకు పేరుంది. కానీ మధ్యలో కొన్ని కారణాల వల్ల బత్తాయి తోటలు అంతరించిపోయాయి. ఇప్పుడు మళ్లీ నల్గొండ జిల్లాలో బత్తాయి సాగు ఊపందుకుంది. నల్గొండ జిల్లాలో బత్తాయి సాగుపై ప్రత్యేక కథనం..

ఇంకా చదవండి ...

(Nagaraju, News18, Nalgonda)

Sweet lemon Farming: ఆసియా ఖండంలోనే అత్యధికంగా బత్తాయి పండుతున్న ప్రాంతంగా నల్గొండ జిల్లాకు పేరుంది. గతంలో ఈ జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో బత్తాయి తోటలు విస్తరించి ఉండేవి. కానీ కాలక్రమేణా చాలా వరకు తోటలు అంతరించిపోయాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడం, నీరు లేక చెట్లు ఎండుముఖం పట్టడం, వేరుకుళ్లు వంటి తెగుళ్లు వేధించడంతో బత్తాయి సాగుకు రైతులు నెమ్మదిగా దూరమయ్యారు. గత కొంత కాలంగా నీటి లభ్యత పెరగడంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు. కానీ, రాష్ట్రప్రభుత్వం వరి సాగు చేయవద్దని కుండబద్దలు కొట్టినట్లు చెబుతుండటంతో రైతులు మళ్ళీ బత్తాయి తోటల సాగు ఫైన దృష్టి సారించారు.

42వేల ఎకరాల్లో బత్తాయి సాగు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి కి పుల్ డిమాండ్ ఏర్పడింది. వేసవి తీవ్రత కారణంగా జ్యూస్ ల వినియోగం పెరగడం.. రోగ నిరోధక శక్తి పెంపు దివ్యౌషధంగా పని చేస్తుండడంతో బత్తాయి పంటకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం నీటి వనరులు పెరగడంతో మళ్ళీ బత్తాయి సాగు పెరిగింది. ప్రస్తుత ఉమ్మడి జిల్లాలో మొత్తం 44 వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతుండగా.. ఒక నల్గొండ జిల్లాలోనే 42 వేల ఎకరాలు సాగువుతుందని అధికారాలు చెబుతున్నారు.

ఏడాదికి మూడు కాపులు

సాధారణంగా బత్తాయి పంట ఏడాదికి మూడుసార్లు చేతికందుతుంది. బత్తాయి ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుడంగా.. అందులో ఒక్క కత్తెర సీజన్( ఏప్రిల్ మే నెలల్లో) 35 శాతం పంట చేతికొస్తుందని అంటున్నారు. ఫిబ్రవరి మార్చి నెలలో 10 శాతం.. ఏప్రిల్ మే నెలలో 35 శాతం.. జూలై ఆగస్టు నెలలో 50 శాతం పంట వస్తుంది. ప్రస్తుతం సీజన్ ప్రకారం 35 శాతం పంట చేతికొస్తుండడంతో.. పంటను రైతాంగం మంచి ధరకు విక్రయిస్తున్నారు. ఈ పంట ఉత్పత్తులను విక్రయించడానికి వ్యాపారులు తోట వద్దకే వచ్చి .. టన్ను బత్తాయికి రూ. 30- 50 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి

ఉమ్మడి జిల్లా నుంచి బత్తాయి పంట ఇతర రాష్ట్రాలకు పెద్దఎత్తున ఎగుమతి అవుతుంది. ఈ మేర ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర లకు,పంటను దిగుమతి చేస్తున్నారు. అంతేగాక ఇతర రాష్ట్రాల చెందిన ట్రేడర్లు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేసి వెళ్లి ఆయా మార్కెట్లో విక్రయిస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి నారు

ప్రైవేటు నర్సరీల నుంచి బత్తాయి నారును రైతులు కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది రైతులు రాజమండ్రి, తిరుపతి వర్సిటీల నుంచి నారు మొక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ఒక్కో మొక్క ధర 70 నుంచి 100 వరకు ఉంటుందంటున్నారు రైతులు. బత్తాయి మొక్కలను ప్రైవేటు నర్సరీల్లో కొనుగోలు చేసి సాగు చేయడం తమకు కొంత భారంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు.

కొత్తరకం బత్తాయి సాగు

కటోల్ గోల్డ్, మాల్టా వంటి వంటి కొత్తరకం బత్తాయి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ వెరైటీలు రెండు టన్నుల అధిక దిగుబడిని ఇవ్వడంతో పాటు జ్యుస్ లభ్యత ఎక్కువగా ఉండటం, కాయలో గింజలు తక్కువగా ఉండటంతో మార్కెట్‌లో డిమాండ్ ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఢిల్లీ మార్కెట్‌లో ఈ వెరైటీలకు మంచి డిమాండ్ ఉందని రైతులు చెబుతున్నారు.

బత్తాయిలతో ఆరోగ్యం

పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు.


  • విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది.

  • ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహద పడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఈ రసం తొందరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది.

  • ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలుతాయి.

  • ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.

  • బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది. అంతే కాదు చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది.


జిల్లాలోని వాతావరణం బత్తాయి సాగుకు అనుకూలంగా ఉండటమే కాకుండా..ఈ ప్రాంత రైతులకు బత్తాయి పంటపై మంచి అవగాహన కూడా ఉంది. ప్రభుత్వం నుంచి రైతులకు రాయితీలతో పాటు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నామని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న కాలంలో గతంలో మాదిరిగానే జిల్లాలో లక్ష ఎకరాల పైనే బత్తాయి సాగు జరుగుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Agriculture, Farmers, Local News, Nalgonda

ఉత్తమ కథలు