(Narsimha, News18, Nalgonda)
మునుగోడు(Munugodu)ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారింది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ (Congress) ,బీజేపీ (BJP), టీఆర్ఎస్(TRS) పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఎలాగైనా ఈ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటుకోవాలని రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్(Semifinal)గా భావిస్తున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి తోడు టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్న సమయంలో ఈ ఉపఎన్నికలో గెలిచి ఢిల్లీ(Delhi)కి గట్టి మెసెజ్ పంపాలనే యోచనలో ఉంది. బీజేపీ సైతం మునుగోడులో పాగా వేసి.. వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణ పగ్గాలు చేపట్టబోనున్నామనే సంకేతాలను ఇవ్వాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఈ ఉపఎన్నికకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకోసం టీఆర్ఎస్, బీజేపీలు ఉపఎన్నికలో గెలిచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ అంశం రాజకీయ పార్టీలను హైటెన్షన్ పెడుతోంది.
30 వేల ఓట్లు వలస:
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2.41 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో దాదాపుగా 30వేల పైచిలుకు ఓటర్లు ఇతర ప్రాంతాల్లోకి వలస వెళ్లారు. ప్రధానంగా మునుగోడు నియోజకవర్గంలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం.. నిరుద్యోగ సమస్య ఎక్కువ కావడం.. సాగునీరు అవకాశం లేక వ్యవసాయ రంగం వెనుకబడిపోవడం.. తదితర కారణాల నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గం నుంచి వలసలు భారీగా పెరిగాయి. పేరుకు హైదరాబాద్ మహానగరం పక్కనే ఉన్నా.. అభివృద్దిలో మునుగోడు అట్టడుగులో నిలిచిందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడి ప్రజలు ఉపాధి మార్గాలను వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఏండ్ల తరబడిగా అక్కడే ఉంటూ.. పండుగలు.. పబ్బాలకు వచ్చిపోతుంటారు. మరికొంతమంది ఏడాదిలో రెండుమూడు నెలలు మాత్రమే ఇక్కడ నివాసం ఉండి.. మిగతా సమయాల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
హైదరాబాద్, ముంబైలోనే అధిక ఓటర్లు:
మునుగోడు నియోజకవర్గం నుంచి హైదరాబాద్, ముంబయి మహానగరాలకు అత్యధికంగా వలస వెళ్లారు. ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలోనే 25 వేల మందికి పైగా మునుగోడు వాసులు ఉన్నట్లు అంచనా. ఇందులోనూ ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరేకాకుండా ముంబయి, షోలాపూర్ నగరాలకు వలస వెళ్లారు. ఇకపోతే బెంగళూరు నగరానికి మునుగోడు ప్రజలు వెళ్లి కన్స్ట్రక్షన్ రంగంలో కూలీలుగా, చిన్నపాటి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
రప్పించేందుకు భారీ ప్లాన్:
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్లో పాల్గొనేందుకు వలస ఓటర్లను తిరిగి రప్పించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు భారీ ప్లాన్ వేశాయి. హైదరాబాద్ నగరంలోని వలస ఓటర్ల కోసం ఇప్పటికే సామూహిక సమావేశాలు నిర్వహించడంతో పాటు నిత్యం వారికి మాంసహార భోజనం, మద్యం పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు ఓటు వేసేందుకు రావడానికి ఒక్కో కుటుంబానికి ప్రైవేట్ కారు ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయా ఓటర్లు పని మానేసి వస్తున్న నేపథ్యంలో వారికి రెట్టింపు కూలీ సైతం ఇచ్చేందుకు నేతలు హామీ ఇస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో బూత్ వారీగా ఇన్ఛార్జులను నియమించడం వల్ల వారే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓటర్ల కోసం ఫ్లైట్ టికెట్లు..
వలస ఓటర్లను రప్పించే బాధ్యత వారిదే. అయితే ముంబయి, షోలాపూర్, బెంగళూరు నగరాల్లోని ఓటర్లను రప్పించేందుకు ఏకంగా వారి కోసం విమాన టికెట్లను సైతం ఇప్పటికే బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఓటు వేసేందుకు వచ్చే వారి కోసం తిరుగు ప్రయాణానికి సైతం ఫ్లైట్ టికెట్ బుక్ చేయడం విశేషం. దీంతో ఏన్నడూ విమానం ఎక్కుతామని అనుకోని కొందరు ఓటర్లు.. ఉపఎన్నిక పుణ్యమంటూ విమానం ఎక్కే అదృష్టం వచ్చిందంటూ ఎగిరి గంతేస్తున్నారట. ఏదీఏమైనా వలస ఓటర్లు.. పొలిటికల్ లీడర్లను తెగ హైరానా పడేలా చేస్తుండడం కొసమెరుపు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Munugode Bypoll, Telangana News