(Nagaraju,News18, Nalgonda)
సూర్యాపేట(Suryapeta)జిల్లా మంఠపల్లి(Manthapalli)మండలం చౌటపల్లి(Chautapalli)కి చెందిన బాపనపల్లి కృష్ణయ్య(Bapanapally Krishnayya)భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతను చదివింది 6 వతరగతి మాత్రమే.. కానీ ఏదో సాధించాలని పట్టుదల. అతనికి చిన్నప్పటి నుంచి ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించి గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక ఉండేది. దీంతో చదువుకునే రోజుల్లో..స్కూల్లో(School)ఈలతో పాటల పాడుతూ.. తోటి స్నేహితులను ఉత్సాహపరుస్తుండేవాడు. అలా సరదాగా ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడూ ఈలతోనే పాటలు పాడుతుంటే వాళ్లు కొట్టే చప్పట్లు అతన్ని బాగా ఎంకరేజ్ చేశాయ్. దీంతో సరదా కాస్త అలవాటుగా మారి పాట మొత్తం ఈలతోనే పాడటం అలవరుచుకున్నాడు.
ఈలతోనే మధుర గీతాలు
ఆ కృష్ణయ్య ఫ్లూట్ వాయిస్తే…ఈ కృష్ణయ్య ఈలతో పాటలు పాడి మనసు దోచుకుంటాడని అతని స్నేహితులు కొనియాడుతుంటారు. అలా స్నేహితుల ప్రోత్సాహంతో ఈలతో మధుర గీతాలను ఆలపించడం అలవాటు చేసుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మన జాతీయ గీతం జనగణమణను సైతం అతను విజిల్‌తో పాడతాడు. శివశివ శంకరా…అంటూ భక్తీ గీతాలను కూడా తనకున్న కళతో మరింత అందంగా వినిపిస్తాడు. ఎన్టీఆర్ కాలం నుంచి…నేటి కుర్ర హీరోల పాటల వరకు ఏ పాటనైనా అవలీలగా ఈలతో పాడేస్తాడు.
శ్రోతల్ని అలరిస్తోన్న కృష్ణయ్య
ఎన్నో వేదికలపై కృష్ణయ్య ప్రదర్శనలు ఇచ్చాడు. ఘంటశాల ఆలపించిన పాటలతో పాటు జనగణమన, వందేమాతరం తదితర జాతీయ గీతాలను ఈలతోనే పాడి సభికులతోపాటు శ్రోతల్ని మైమరిపించాడు. ఇప్పటికే పలుమార్లు సభా వేదికల పై ప్రముఖుల ప్రశంసలు అందుకున్నట్లు కృష్ణయ్య తెలిపాడు. ఆ ఊరిలో స్టేజీ నాటకాలు వేస్తుంటే…అక్కడ కృష్ణయ్య ఈల పాటలు ఉండాల్సిందే. కుర్రకారు సైతం కృష్ణయ్య పాటలకు ఫిదా కావల్సిందే.
యూట్యూబ్‌లో కృష్ణయ్య ఈలలు
ఇక ఏ పాటనైనా అలవోకగా ఈలతో వినిపించగల కృష్ణయ్య..తనకు సరైన గుర్తింపు తెచ్చుకునేందుకు టెక్నాలజీని వాడుకోవాలనుకుంటున్నాడు. సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి..తనే ఈలతో పాటలు పాడి అందులో అప్‌లోడ్ చేస్తానని చెబుతున్నాడు. కృష్ణయ్య పాటకు తన జిల్లాలోనే కాదని…అంతటా విశేష స్పందన రావాలని అతని స్నేహితులు కోరుతున్నారు.
కూలీపనికి వెళ్తోన్న కృష్ణయ్య
మైక్ పట్టుకోవాల్సిన చేత్తో తాపీ పట్టుకున్నాడు. కృష్ణయ్య భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పొట్టకూటి కోసం, కుటుంబం కోసం ప్రస్తుతం రోజువారీ కులీపనికి వెళ్తున్నాడు. తాపీ పనికి వెళ్తూ తనకు సమయం దొరికినప్పుడల్లా ఈల పాటలు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అంతేకాదు తనతో పాటు పనికి వచ్చిన వారికి కూడా అలసట తెలియకుండా తన పాటలతో అలరిస్తాడు.
సరైన అవకాశం వస్తే..
అంతేకాక తన ఈల పాటలకు నియోజకవర్గంలో అభిమానులు ఉన్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రాష్ట్ర స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నానని.. సరైన వేదిక కల్పిస్తే తన ప్రత్యేకతను చాటుతానని కృష్ణయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ వినూత్న గాయకుడిలోని టాలెంట్‌ని అందరికి పరిచయం చేసే సమయం ఎప్పుడు వస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.