(Nagaraju A, Nalgonda)
కృష్ణా తీరాన కొలువై ఉన్న నరసింహ క్షేత్రాలలో తెలంగాణా రాష్ట్రంలోని మట్టపల్లి (Mattapalli) కూడా ఒకటి. నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ తాలుకాలో విలసిల్లిన ఈ క్షేత్రంలో నరసింహస్వామి స్వయంభువుడు. కృష్ణా నది ఒడ్డున రాజ్య లక్ష్మి సమేతుడై కొలువుదీరిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వామి (Mattapalli Sri Lakshmi Narasimha swamy) ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది.
మట్టపల్లి ఆలయ చరిత్ర..
సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి ఇక్కడ గుహలో ఉన్న ఈ స్వామిని చాలా కాలం పూజించారు. ఆయనే కాదు, ఇంకా ఎందరో మునీంద్రులు ఈ స్వామిని సేవించారు. మరి గుహలో ఋషీశ్వరులచేత సేవించబడే ఈ నారసింహుడు నరులకు దర్శనమివ్వడం వెనక ఒక కథనం ఉంది.
పదకొండు వందల సంవత్సరాల క్రితం మట్టపల్లికి ఎదురుగా కృష్ణానదికి అవతల ఒడ్డున ఓ ఊరిలో మాచిరెడ్డి అనే మోతుబరి రైతు, ఆయన కుటుంబీకులందరూ చాలా ఉదార స్వభావం కలవారు. ఒకరోజు మాచిరెడ్డి తమ పంట భూమిలో అనుములు విత్తటానికి కొడుకులు, పనివారితో కలసి అరకలు కట్టుకొని వెళ్తూ, పెద్ద కోడలు భవనాశనీదేవిని త్వరగా పని ముగించుకుని విత్తనాలు తీసుకుని పొలానికి రమ్మని చెప్పి వెళ్ళారు. ఆమెకూడా మామగారు చెప్పినట్లు విత్తనాలు తీసుకుని పొలానికి బయల్దేరింది. దారిలో శివనామ స్మరణ చేస్తూ వెళ్తున్న జంగమదేవరలు ఈవిడని చూసి భిక్ష అడిగారు. ఆవిడ భక్తి పారవశ్యంలో విత్తనాలకై తీసుకెళ్తున్న అనుములనన్నింటినీ వారికి ఇచ్చేసింది. వారు ఈవిడని దీవించి వెళ్ళిన కొంతసేపటికి విషయం గ్రహించి విత్తనాలు తీసుకు వెళ్ళకపోతే మామగారు ఆగ్రహిస్తారని, భగవంతుడిపై భారం వేసి ఒడిలో అక్కడి ఇసుక పోసుకుని, శివనామ స్మరణ చేస్తూ పొలంలో విత్తనాలులాగా దానినే జల్లింది.
ప్రతి అనుము కాయలోనూ బంగారుగింజలు
పంట చక్కగా పెరిగి కోతకు వచ్చినప్పుడు కోస్తుండగా ప్రతి అనుముకాయలోనూ బంగారు అనుము గింజలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కోడలిని వివరం అడుగగా ఆమెజరిగిన విషయం చెప్పింది. మాచిరెడ్డి ఆ బంగారు అనుములులో సగం దానం చేసి, మిగిలినదానితో కృష్ణానదికి కొంచెం దూరంలో తంగెడ అనే ఊరు నిర్మించి దాని చుట్టూ మహా దుర్గము, 101 దేవాలయాలు నిర్మించి తాను ప్రభువుగా పాలించాడు. తంగెడు గ్రామాన్నీ, చుట్టూ ప్రాకారాన్ని, భవనాశమ్మ బావినీ, బంగారు అనుములనూ ఇప్పటికీ దర్శించవచ్చంటారు.
లక్ష్మీనరసింహ విగ్రహ ప్రతిష్ట..
మాచిరెడ్డికి ఒకరోజు స్వప్నంలో ప్రసన్న వదనుడైన శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చి, స్వయంభువు అయి తన మూర్తివిగ్రహం కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న అరణ్యంలో ఒక గుహలో ఉన్నదని, ఆ మూర్తిని ఇప్పటిదాకా భరద్వాజుడు మొదలగు మహర్షులు మాత్రమే సేవిస్తున్నారనీ, ఆ ఋషుల సంకల్పానుసారం ఇంక ముందు మనుషులకు కూడా దర్శనం ఇవ్వాలనుకున్నానని…ఈ విషయాన్ని లోకానికి తెలియపరచమని ఆదేశించాడు. మరునాడు మాచిరెడ్డి ఇతర పెద్దలతో కలిసి అరణ్యంలో వెతకగా స్వామివారి విగ్రహం కనిపించింది.
వీరు దర్శించు సమయంలో స్వామి శంఖ చక్రములు, గద, అభయముద్రలతో చతుర్భుజుడై, శేషుడు గొడుగు పట్టగా మహర్షులు అభిషేకించే దక్షిణావర్త శంఖముతో, తులసీదళమాలతో, భక్త ప్రహ్లాదునితో, దివ్య దర్శనమిచ్చాడు. స్వామివారిని సకల జనులు సేవించుటకు వీలుగా విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయఅభివృద్ధికి కృషి చేశారు.
అన్నాలయ్యగా మారిన లక్ష్మీనరసింహస్వామి
మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అన్నాలయంగా పేరుగాంచింది. ఇక్కడ నిత్య అన్నదానం చేస్తారు. సుమారు 11 వ శతాబ్దం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. వివిధ సామాజిక వర్గాల కోసం 19 అన్నదాన సత్రాలు ఏర్పాటు చేశారు. తద్వారా ఇక్కడి స్వామి వారిని అన్నాలయ్యగా పిలవడం జరుగుతోంది.
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం
గర్భ గుడిలో స్వామికి ఎడమ ప్రక్కన ఒక గుహ ద్వారం ఉంది. అక్కడనుండి సప్త ఋషులు, ఇతర మునులూ కృష్ణలో స్నానంచేసి స్వామి దర్శనానికి వస్తారట. వాళ్ళుఇప్పటికీ రోజూ వస్తారని ఇక్కడి వాళ్ళ నమ్మకం. స్వామికి కుడివైపు ద్వారం భక్తుల సౌకర్యార్ధం తర్వాత కట్టింది. ఈ క్షేత్రంలో స్వామివారికి ఎదురుగా ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు.
ఈ క్షేత్రమునకు వచ్చిన భక్తులు కృష్ణలో స్నానంచేసి, స్వామి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆరె చెట్టు, ధ్వజ స్తంభం, ఆంజనేయస్వామి చుట్టూ 32ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ విషయాన్ని మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి స్వయంగా చెప్పారని ప్రతీతి. విశ్వాసం మరియు భక్తితో ఏదైనా కోరిక కోరుకుని 32 ప్రదక్షిణలు చేసి, కోరిన కోర్కె తీరిన తర్వాత మరలా ఈ క్షేత్రమునకు వచ్చి 32 ప్రదక్షిణలు చేయడం ఇక్కడ అనవాయితీ. ఇంకా అనారోగ్య బాధలు, దుష్ట గ్రహ బాధలు ఋణబాధలు ఉన్నవారు, సంతానము లేనివారు ఈ క్షేత్రమునకు వచ్చి 11 రోజులు మూడు పూటలు కృష్ణలో స్నానం చేసి తడి బట్టలతో 32 ప్రదక్షిణలు చేసినచో వారి కోర్కెలు తీరుతాయని నమ్మకం.
యమధర్మరాజు ప్రదక్షిణలు చేసిన క్షేత్రం
ఈ క్షేత్రంలో యమధర్మరాజు స్వయంగా వచ్చి ప్రదక్షిణలు చేశారుట. అందుకే ఈ క్షేత్రానికి యమ మోహిత క్షేత్రమని కూడా పేరు. సాధారణంగా విష్ణుమూర్తికి తులసీ దళములు ప్రీతికరమైనా, ఇక్కడ స్వామి పూజకి ఈ ఆరె పత్రినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఆ చెట్టు వల్లనేకదా స్వామి ఉనికి తెలిసింది. ఇక్కడ రాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను స్వామిని శాంతింప చేయటానికి తర్వాత ప్రతిష్టించారు.
స్నానఘట్టాలు
ఇక్కడి స్నాన ఘట్టాలను ప్రహ్లాద స్నాన ఘట్టం, మార్కండేయ స్నాన ఘట్టం, బాలాజీ స్నాన ఘట్టం అని వ్యవహారిస్తారు. స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్ల ద్వార వెళ్ళే భక్తులు..మెట్ల పూజ చేస్తారు. పసుపు కుంకుమలు అద్దుతూ అధిరోహణ చేస్తారు.
ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి?
ఇన్ని మహిమలున్న మట్టపల్లి క్షేత్రాన్ని అవకాశం ఉన్నవారు తప్పక దర్శించండి. మట్టపల్లి క్షేత్రం నల్గొండ (Nalgonda) జిల్లా హుజూర్ నగర్ కి 25 కి.మి దూరంలో కలదు. హుజుర్నగర్ నుంచి ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆటోతో పాటు బస్సు సౌకర్యం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.