మునుగోడు(Munugodu)ఉపఎన్నిక పోలింగ్‌కి మరి కొన్ని గంటలే సమయం ఉంది. దీంతో అందరి చూపు మునుగోడు వైపే ఉంది. ముఖ్యంగా బెట్టింగ్ బంగార్రాజులు సైతం ఈ బైపోల్‌ని క్యాష్ చేసుకోవాలని పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. దేశంలోని పలు మెట్రో నగరాలకు చెందిన బుకీలో ఐపీఎల్(IPL)తరహాలోనే మునుగోడు గెలుపు, ఓటములపై జూదం నిర్వహించేందుకు నగరంలోని త్రీ స్టార్, టూ స్టార్ హోటళ్ల(Hotels)లో దిగిపోయారు. చేతికి మట్టి అంటకుండా నగదు ప్రత్యక్ష బదిలీలు జరపకుండా మునుషులు కనిపించకుండా కోట్లలో పందాలు నిర్వహిస్తున్నారు. అయితే బెట్టింగ్ విషయంలో అన్నీ చోట్ల జరిగినట్లుగా కాకుండా మునుగోడు ఎన్నిక విషయానికి వచ్చే సరికే కొత్త ఫార్ములాను ఆచరిస్తున్నారు.
బెట్టింగ్స్ టైమ్ ..
మునుగోడు ఎన్నిక గెలుపు మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. అందుకే అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనేపధ్యంలోనే ప్రచారం కూడా అంతే జోరుగా చేశాయి. అయితే ఆటలో గెలిచేది ఒకరే. కాని బెట్టింగ్ బంగార్రాజులు మాత్రం గెలుపు, ఓటములపై కాసే బెట్టింగ్‌ల కంటే ఎవరికి డిపాజిట్లు రావు..? విజేత ఎంత మెజార్టీతో గెలుస్తాడు..? రెండో స్థానంలో ఎవరుంటారు..? ఈవిధంగా ఐపీఎల్లో ఓవర్ రన్ రేటు,. వికెట్లు, వ్యక్తిగత స్కోరుపై బెట్టింగ్‌లు పెట్టినట్లే మునుగోడులో కూడా ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకొని పందాలకు సిద్ధమయ్యారు.
పోలింగ్ నుంచి ఫలితాల వరకు పందాలు..
గురువారం నాడు పోలింగ్ జరగనున్న నేపధ్యంలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగానే హైదరాబాద్‌లో తిష్టవేశారని పోలీసులు నిర్ధారించారు. ముందుగా పోలింగ్ పర్సంటేజ్ ఎంత నమోదు కానుంది..? ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశాలపై కూడా బెట్టింగ్ నడుస్తోందని తెలుస్తోంది. భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాయడానికి వచ్చిన బుకీలు చాపకింద నీరులా మునుగోడులో తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పందాలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక డబ్బు లావాదేవీలను కూడా పోలీసులు రైడ్ చేసి పట్టుకునే అవకాశముండటంతో యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వారా ట్రాన్సాక్షన్లు ఫాలో అవుతున్నారు.
అంతా ఆన్లైన్..
జరుగుతోంది తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక అయినప్పటికి...ఫలితం కోసం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణకు ఆనుకొని ఉన్న ఒక జిల్లాలో మునుగోడు ఫలితాలపై కోట్ల రూపాయల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. అయితే పోలింగ్‌కి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికి ..ఫలితాలకు మరో మూడ్రోజులు టైమ్ ఉండటంతో పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఐపీఎల్ బుకీలతో పాటు బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటికే పాతిక లక్షల వరకు హవాలా మనీ పట్టుకున్న పోలీసులు..ఫలితాలు వెలువడే లోగా పెద్ద మొత్తంలో నగదు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugode Bypoll, Telangana News