హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: భార్యను చంపి తానూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి!..

Nalgonda: భార్యను చంపి తానూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి!..

భార్యను చంపి తానూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి

భార్యను చంపి తానూ ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలో చోటుచేసుకుంది.

  (Nagaraju, News 18, Nalgonda)

  భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్లంబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పాలెం గ్రామానికి చెందిన స్వాతి అనే యువతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. నకిరేకల్ లోని పన్నాల గూడలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈక్రమంలో గత ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మద్యానికి బానిసైన శ్రీకాంత్ భార్యపై అనుమానంతో వేధించేవాడు. స్వాతి ఇంట్లో చెప్పకుండా జులై 14న చెన్నైలోని తెలిపిన వారి వద్దకు వెళ్ళింది. దీంతో శ్రీకాంత్ తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. స్వాతి చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. బంధువుల సాయంతో జులై 27న నకిరేకల్‌కు రప్పించారు. స్టేషన్‌లోనే శ్రీకాంత్, స్వాతికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపించారు పోలీసులు. పిల్లలను వదిలేసి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయావంటూ శుక్రవారం భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీకాంత్ పట్టరాని కోపంతో దిండుతో అదిమి స్వాతిని హతమార్చాడు. ఈ విషయాన్ని స్వాతి సోదరులకు చెప్పి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూడా చెప్పాడు. అనంతరం పురుగుల మందు తాగి వాంతులు చేసుకుంటున్న శ్రీకాంత్ ను స్థానికులు గమనించి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరి స్వప్న ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.

  రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్లగొండ జిల్లా కేంద్రం పరిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని హైదరాబాద్ రోడ్డు శ్రీరాంనగర్ కాలనీ వద్ద రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని యువకుడు వయసు సుమారు 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించి వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే ఎస్‌ఎ‌హెచ్ఓ కోటేశ్వర్ తెలిపారు.

  ద్విచక్రవాహన చక్రంలో చీర చుట్టుకుపోయి మహిళ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కధనం మేరకు.. నాగర్‌కర్నూల్ జిల్లా శిరుసన గండ్లకు చెందిన పసుల రేణుక గురువారం నాడు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం పడమటిపల్లిలోని తన పుట్టింటికి బయలుదేరింది. ఈ క్రమంలో అదే పడమటిపల్లి వైపు వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడిని లిఫ్ట్ అడిగింది రేణుక. ద్విచక్రవాహనంపై పడమటిపల్లి వైపు వస్తుండగా ఇద్దంపల్లి వద్దకు చేరుకుంటున్న క్రమంలో బైక్ చక్రంలో రేణుక చీర చుట్టుకుని ఆమె కిందపడింది. రేణుక తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు