(Nagaraju,News18, Nalgonda)
నల్లగొండ(Nalgonda)జిల్లా నకిరేకల్(Nakirekal)నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్(TRS)లో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మేల్యే(MLA) చిరుమర్తి లింగయ్య(Chirumarthi Lingaya), మాజీ ఎమ్మేల్యే వేముల వీరేశం (Vemula Veerasam)మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారయ్యింది. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఇద్దరి నేతల మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిశబ్ధయుద్ధం, ఇటీవల ఒక వేడుకలో బట్టబయలు అయింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బాహాటంగానే ఒకరిపై ఒకరు పరస్పర మాటల దాడి చేస్తున్నారు.
బట్టబయలైన మనస్పర్థలు:
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఒకే పార్టీ నేతల మధ్యనే మనస్పర్థలు ఏర్పడడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేడే సందర్భంగా వేముల వీరేశం, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మేడే రోజున నకిరేకల్ ప్రధాన కూడలిలో వేముల వీరేశం వర్గీయులు జెండా ఆవిష్కరణ చేసే సమయంలో.. ఎమ్మేల్యే చిరుమర్తి వర్గీయులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టడంతో పరిస్థితి అప్పటికి సద్దుమణిగింది. అనంతరం ఈవిషయం టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానకి తెలియడంతో, మంత్రి కేటీఆర్ ఈ ఇద్దరి నేతలతో మాట్లాడి సర్ధిచెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈక్రమంలో, ఇటీవల నకిరేకల్ నియెజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన ఫ్లెక్సీలో వేముల వీరేశం ఫోటో కనిపించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. దొరికిందే అదనుగా భావించిన ఎమ్మేల్యే చిరుమర్తి వర్గీయులు..'వీరేశం పార్టీ మారుతున్నారని' ప్రచారానికి తెరలేపారు.
నువ్వా - నేనా' అన్నట్లుగా పరస్పరం వ్యాఖ్యలు:
ఈ ఆరోపణలపై స్పందించిన వీరేశం, 'ఎమ్మెల్యే వర్గీయులు కావాలనే దుష్పప్రచారం చేస్తున్నారని.. ఎట్టీపరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తేలేదని' స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఈసారి టికెట్ వేములకే ఇస్తుందని.. భారీ మెజార్టీతో గెలిపిస్తామని వేముల వర్గీయులు చెప్పుకొస్తున్నారు. ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య భూవివాదాల్లో తల దూరుస్తున్నారని వేముల వీరేశం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ ప్రతిష్టను చిరుమర్తి దిగజార్చుతున్నారని ఆరోపించారు. పీకే (ప్రశాంత్ కిశోర్) సర్వే ఆధారంగా టికెట్ వేముల వీరేశంకే వస్తుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అంతా ముందస్తు హడావుడి కోసమే:
ఇటు ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య సైతం వేములకు కౌంటర్ ఇచ్చారు. భూవివాదాల్లో జోక్యం చేసుకుంటున్నానని వీరేశం నాపై దుష్ప్రచారం చేస్తున్నాడని..ఒకరి భూములు లాక్కొని, ఇంకొకరికి కట్టబెట్టిన చరిత్ర వీరేశందంటూ ధ్వజమెత్తారు ఎమ్మెల్యే చిరుమర్తి. పీకే సర్వే అంటూ నియోజకవర్గంలో వీరేశం తన అనుచరులతో అసత్య ప్రచారం చేసుకుంటున్నాడని.. మూడేళ్ళుగా టీఆర్ఎస్ పార్టీలో వీరేశంకు సభ్యత్వం కూడా లేదని ఎమ్మెల్యే చిరుమర్తి ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ పార్టీ టికెట్టు, గెలుపూ తనదేననీ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చిరుమర్ధి లింగయ్య.
వేడుకల పేరుతో బలప్రదర్శన:
బలప్రదర్శనకు దారితీసిన వీరేశం పుట్టినరోజు వేడుకలు: ఇటీవల మాజీ ఎమ్మేల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు..నకిరేకల్ నియోజకవర్గంలో ఇద్దరి నేతల మధ్య బల ప్రదర్శనకు దారితీసింది. వీరేశం జన్మదినం సందర్భంగా..ఆయన అభిమానులు పెద్ద ఎత్తునర ర్యాలీ తీశారు. అంతేకాక వీరేశం చేసిన పనులకు సంబంధించి కరపత్రాలను పంపిణి చేశారు. ఓరకంగా ఇది చిరుమర్తి వర్గీయులకు చిరాకు తెప్పించింది. దీంతో వెంటనే ఎమ్మేల్యే చిరుమర్తి.. తన అభిమానులు..కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఢీ అంటే ఢీ ఇరు వర్గాల కార్యకర్తలు నల్లగొండ జిల్లా ప్రధాన రహదారిపై బాణసంచా కాల్చి ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్యకు అనుకూలంగా నినాదాలు చేశారు.
క్లైమాక్స్ ఎట్లుంటదో :
మొత్తంమీద తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారయ్యింది. దీంతో అధిష్టానం పెద్దలకు వీరి వ్యవహరం పెద్ద తలనొప్పిగా మారిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. పీకే సర్వే ఆధారంగా టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నా అందులో నిజమెంత అన్నది తెలియక కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda