ఎవరైనా యువకుడు అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేయమని తన కుటుంబ సభ్యుల్ని అడుగుతాడు. లేదంటే యువతి కుటుంబ సభ్యులను కోరుతాడు. వీళ్లెవరూ ఒప్పుకోకపోతే పోలీసుల్ని ఆశ్రయిస్తారు. కాని నల్గొండ (Nalgonda)జిల్లాలో ఓ యువకుడు తన ప్రేమను గెలిపించమని ఏకంగా దేవుడ్నే కోరాడు. అంతటితో ఆగకుండా కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగి ఇద్దరం సుఖంగా ఉండేలా ఆశీర్వదించాలంటూ రక్తం లేఖ(Letter)రాసి ఆలయంలోని హుండీ(Hundi)లో వేశాడు. ఇప్పుడు ఆ లేఖను చూసిన ఆలయ అధికారులు షాక్ అయ్యారు.
దేవుడికి రక్తంతో లేఖ ..
నల్గొండ జిల్లా పెద్దగట్టు దురాజపల్లి జాతర తెలంగాణలో చాలా ఫేమస్. ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి లింగమంతులస్వామిని దర్శించుకుంటారు. మనసులో కోరుకున్న కోర్కెలను తీర్చమని స్వామివారిని మొక్కుంటారు. ఏటా ఐదు రోజుల పాటు జరిగే ఈ జాతరలో ఓ భక్తుడు లింగమంతులస్వామి వారి హుండీలో తన కోరికను తీర్చమంటూ రక్తంతో రాసిన లేఖను వేశాడు. గురువారం హూండీ లెక్కిస్తున్న ఆలయ అధికారులకు రక్తంతో కూడిన లేఖ కనిపించడంతో అక్కయ్యారు. దానిపై రాసిన పేర్ల ప్రకారం వీ.శ్రీకాంత్ అనే యవకుడు ఈ లేఖ రాసినట్లుగా ఆలయ సిబ్బంది గుర్తించారు.
తమ ప్రేమను దీవించమని..
లింగమంతులస్వామికి రక్తంతో రాసిన లేఖలో వీ.శ్రీకాంత్,మంగమ్మ జీవితాంతం కలిసి ఉండాలని..తమ ప్రేమ కలకాలం ఉండేలా మమ్మల్ని దీవించమంటూ రాసిన అక్షరాలు ఉన్నాయి. అయితే ఈ లేఖ రాసిన భక్తుడు ఏ ప్రాంతానికి చెందిన వాడనే విషయం మాత్రం తెలియరాలేదు. దీంతో ఆలయ అధికారులు లేఖను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, ఇతర సిబ్బంది తీసిన ఫోటోల్లో ఏమైనా రక్తంతో లేఖ రాసిన భక్తుడి వీడియో కనిపిస్తుందేమోనని ప్రయత్నిస్తున్నారు.
వింత లేఖ..విచిత్రమైన భక్తి..
ఇదే తరహాలో గతంలో కూడా ఓ భక్తుడు తన దగ్గర వ్యాపారంలో భాగంగా డబ్బులు తీసుకున్న వ్యక్తులు తిరిగి ఇవ్వడం లేదని వారిని కఠినంగా శిక్షించమంటూ ఇదే విధంగా లేఖ రాశాడు. సాధారణ వ్యక్తులు, పోలీసులతో తమ సమస్యలు పరిష్కారం కావనే ఉద్దేశంతోనే ఈవిధంగా దేవుడి గుడిలోని హుండీల్లో రక్తపు లేఖలు వేస్తున్నారా అనే సందేహాల్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Telangana News, VIRAL NEWS