హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana:బుద్దుని జయంత్యుత్సవాలు..విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్న బుద్ధవనం

Telangana:బుద్దుని జయంత్యుత్సవాలు..విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్న బుద్ధవనం

(బుద్ధవనం)

(బుద్ధవనం)

Nalgonda: క్రీ.శ. 1-3వ శతాబ్దం వరకు బౌద్ధం విలసిల్లిన ప్రాంతం…. మహాయానం విలసిల్లిన స్థలం. గౌతమబుద్ధుడి పుట్టుక నుంచి మహాపరినిర్యాణం వరకు పూర్తి చరిత్రని ఒకేచోట తెలుసుకునేలా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న బుద్ధవనం..!

(Nagaraju,News18, Nalgonda)

నల్గొండ(Nalgonda)జిల్లా నందికొండ(Nandikonda)లోని బుద్ధవనం ప్రారంభం తర్వాత బుద్ధుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధవనం, ధ్యానవనం, జాతక వనం, మహాస్థూపం, ఎంట్రన్స్‌ ప్లాజాలో 2,566 రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. బుద్ధుని జయంతి వేడుకలు సందర్భంగా..టిబెట్(Tibet), మైసూర్(Mysore)తో పాటు,…వివిధ ప్రాంతల నుంచి వచ్చిన భౌద్ధ భిక్షువులతో కలిసి, బుద్ధవనం స్పెషల్‌ అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య(Mallepally Lakshmaiah), బుద్ధుని పాదుకలవద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు..

నాటి బుద్ధవనాని నేటికి మోక్షం..

2015లో అసంపూర్తిగా ఉన్న బుద్ధవనాన్ని చూసిన సీఎం కేసీఆర్‌ భారీగా నిధులు విడుదల చేసి బుద్దవనాన్ని ఎంతో అత్యంత సుందరంగా, ముగ్దమనోహరంగా తీర్చిదిద్దారని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాషకు అనుగుణంగా బుద్ధవనం నేడు అంతర్జాతీయస్థాయి బౌద్ధ క్షేత్రంగావర్ధిల్లుతోంది. ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా బుద్ధవనాన్ని సందర్శించాలని లక్ష్మయ్య అన్నారు.

కళ్లకు కట్టినట్లుగా బుద్ధుని జీవిత విశేషాలు

బుద్ధుని జీవిత విశేషాలను, జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధవనాన్ని అందంగా తీర్చిదిద్దింది. ప్రపంచ బౌద్ధులకు బుద్ధవనం పవిత్ర భూమిగా మారనుంది. బుద్ధవనం ప్రారంభం తర్వాత మొదటిసారిగా నిర్వహించిన బుద్ధ జయంతి వీక్షకులకు మధురానుభూతులు పంచింది.

పర్యాటకులకు కనువిందుగా..!

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్‌ కాలనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమైన బుద్ధవనం పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఇక్కడి బుద్ధుడి శిల్పాలు, బౌద్ధ చిహ్నాలు ధ్యానాన్ని ప్రేరేపించిన అనుభూతి కలుగుతుందనడంలో సందేహం లేదు. ఓ వైపు బుద్ధుని జీవిత ఘట్టాల శిల్పాలతో అలంకరించిన బుద్ధ చరితవనం.. మరోవైపు సిద్ధార్థుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు పరిపూర్ణతను సాధించడానికి ఆచరించిన 10 పారమితలను ప్రతిబింబించే జాతకవనం సందర్శకులను మైమరపింపజేస్తాయి.

బుద్ధుని జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు

బుద్ధుడు బోధించిన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపు మరల్చనివ్వవు. బుద్ధవనంలోని మహాస్తూపం.. దేశంలోనే అరుదైన బౌద్ధ వారసత్వ కట్టడంగా కీర్తి గడించింది. కింది అంతస్తులో ప్రాచీన బౌద్ధ శిల్ప కళాఖండాలున్న ప్రదర్శనశాల, సమావేశ మందిరం, ఆచార్య నాగార్జునుడి పంచలోహ విగ్రహం ఉన్నాయి. మొదటి అంతస్తులో అష్టమంగళ చిహ్నాలు, సిద్ధార్థ గౌతముని అయిదు ప్రధాన జీవిత ఘట్టాలను సూచించే ఆయక స్తంభాలు.. వేదిక, అండం చుట్టూ అలంకరించబడ్డాయి.

కృష్ణానది ఒబ్బున 274 ఎకరాల్లో బుద్ధవనం

ఇప్పటికే తొలిదశలో ప్రారంభించిన పనులన్నీ పార్కులో పూర్తయ్యాయి. కృష్ణా నది ఒడ్డున 274 ఎకరాల్లో ఈ బుద్ధవనాన్ని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసింది.. ఈ వనాన్ని 8 సెగ్మెంట్లుగా విభజించారు. గత పదిహేనేళ్లుగా స్తూపం పార్కు, జాతక పార్కు, బుద్ధచరిత్ర వనం, ధ్యానవనం, మహాస్తూపం సెగ్మెంట్లలో పనులు సాగాయి. మరో మూడు సెగ్మెంట్లలో బుద్ధిజానికి సంబంధించి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. సర్కారు నుంచి ఆమోదం లభించినా పనులు ఇంకా మొదలు కాలేదు. ఇప్పటివరకు పార్కు అభివృద్ధికి రూ.80 కోట్ల వరకు ఖర్చు చేశారు.

బుద్ధవనంలోని ప్రత్యేకతలు

బంగారు వర్ణంలో మహాస్తూపం.. అందులో బుద్ధుడి ప్రతిమ, పైన తైలవర్ణంతో కూడిన డోం సిద్ధమైంది. బుద్ధుడి జీవితాన్ని తెలుసుకొనే విధంగా వివిధ చారిత్రక వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశారు.పార్కులో బుద్ధుడి పాద ముద్రికలను లోటస్‌పాండ్‌లో ఉంచేవిధంగా నిర్మాణం చేశారు. శ్రీలంక, థాయ్‌లాండ్‌ వంటి వివిధ దేశాల బౌద్ధ సంస్కృతులను ప్రతిబింబించే స్తూపాల నిర్మాణాలు పూర్తయ్యాయి.

First published:

Tags: Nagarjuna sagar, Nalgonda

ఉత్తమ కథలు