(Nagaraju, News18, Nalgonda)
చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఇద్దరు పిల్లలతో తమకున్న దాంట్లోనే ఆనందంగా జీవితం గడుపుతున్నారు ఆ దంపతులు. ఎంతో సంతోషంగా ఉన్న వారి జీవితాన్ని చూసి విధి అసూయ పెంచుకుంది. ఆనందంగా ఉన్న ఆ ఇంట్లో కలహాలు రేపింది. భార్యాభర్తలను వేరు చేసింది. పిల్లలపై పగబట్టింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన చేకూరి రమేష్ జీవితంలో విధి ఆడుతున్న వింత నాటకం చూస్తుంటే హృదయం ద్రవించుకుపోతుంది.
ల్యూకేమియా భారిన పడ్డ కుమారుడు..
ఆకుపాముల గ్రామానికి చెందిన రమేష్ లారీ డ్రైవర్(Lorry driver) గా జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం సూర్యాపేట (Suryapeta) జిల్లా చిల్కురుకు చెందిన మహిళతో వివాహం అయింది. వీరికి కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సాగర్ ఉన్నారు. శ్రీవల్లి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుండగా, సాగర్ ఏడవ తరగతి చదువుతున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమేష్ భార్య కొన్నేళ్ల క్రితం విడిపోయి ఒంటరిగా ఉంటోంది. రమేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో సాగర్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సాధారణ అనారోగ్యంగా భావించిన రమేష్.. కుమారుడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినా సాగర్ ఆరోగ్యం కుదుట పడలేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో, కుటుంబ సభ్యులు ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరిక్షలు చేయించారు. సాగర్ కు వైద్య పరిక్షలు నిర్వహించగా అతనికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్ )గా వైద్యులు నిర్థారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని (Hyderabad) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన రమేష్, గత 46 రోజులగా కుమారుడికి అక్కడే చికిత్స అందిస్తున్నాడు.
కుమారుడి ప్రాణం కోసం తల్లడిల్లుతున్న తండ్రి మనసు..
ఒక్కగానొక్క కుమారుడిని దక్కించుకునేందుకు రమేష్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృత్యువుతో పోరాడుతున్న కుమారుడిని చూసి తండ్రి మనసు తల్లడిల్లుతోంది.ఎంతో పేద కుటుంబంలో పుట్టిన రమేష్‌కు చిన్న ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు ఏమి లేవు. హఠాత్తుగా కుమారుడు అనారోగ్యం బారిన పడటంతో డ్రైవర్ పని కూడా మానేసి బాలుడి బాగోగులు చూసుకుంటున్నాడు రమేష్. సాగర్ వైద్యానికిగానూ ఇప్పటివరకు తన వద్ద ఉన్న కొద్ది మొత్తంతో పాటు తెలిసిన వారి వద్ద కొంత అప్పు చేసి చికిత్స అందిస్తున్నాడు. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న సారగ్‌కు రెండు రోజులకొకసారిపరీక్షలు నిర్వహించి, అవసరం మేరకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అందుకు భారీగా ఖర్చు అవుతుండగా డబ్బులేక రమేష్ నానా ఇబ్బంది పడుతున్నాడు.
9 నెలలు వైద్యం అందితే బాలుడు కోలుకుంటాడు..
సాగర్ వైద్యం నిమిత్తం అతనికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఇలా తొమ్మిది నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో బాలుడికి చికిత్స అందిస్తే అతను పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అందుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు వెల్లడించారు. అయితే ఎంతో పేద కుటుంబం అయిన తనకు అంత పెద్ద మొత్తం డబ్బు సమకూర్చుకోవడం సాధ్యం కాదని రమేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓ వైపు కుమారుడు అవస్థ చూడలేకపోతున్నానని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రోదించడం తప్ప మరేదారి కనిపించడంలేదని కన్నీరుమున్నీరగా విలపిస్తున్నారు. మనసున్న దాతలెవరైనా ముందుకు వచ్చి ఆర్ధిక సాయం చేస్తే తన కుమారుడి ప్రాణాలు దక్కుతాయని రమేష్ అభ్యర్థిస్తున్నాడు. కుమారుడిని రక్షించుకోవడానికి ఆ తండ్రి పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. దాతలు స్పందించి తోచిన ఆర్ధిక సహాయం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టినవారవుతారు.
దాతలు సంప్రదించవలసిన నంబర్:
బాలాజీ, సాగర్ చిన్నాన్న, 96761 37554
బ్యాంకు ఖాతా : 30543275599
ఎస్‌బీఐ, ఆకుపాముల బ్రాంచి
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్ : ఎస్‌బీఐయన్0002562
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.