Naveen Kumar, News18, Nagarkurnool
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత తన చరిత్రను నిర్మించుకుంటున్న సందర్భంలో గ్రామాల చరిత్రను వెలికితీసేందుకు "మన ఊరు- మన చరిత్ర" పేరుతో తెలంగాణ సాహిత్య అకాడమీ, ఉన్నత విద్యాశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్టు వర్క్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రాజెక్టు వర్క్‌కి నాగర్‌కర్నూల్ జిల్లా కోఆర్డినేటర్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్‌ను నియమించారు. ఇందులో ప్రతి గ్రామ చరిత్రను వెలికి తీయడం ద్వారా మొత్తం తెలంగాణ చరిత్రను నిర్మించడానికి అవకాశం ఉంది. గ్రామం పేరు, ఆ పేరు రావడానికి కారణం, అక్షరాస్యత, దేవాలయాల చరిత్ర, శాసనాలు, చేతివృత్తులు ,వ్యవసాయం, గ్రామ రెవిన్యూ రికార్డ్స్, పరిపాలనా పద్ధతి, వ్యాపారం, వ్యవసాయం, నీటి వనరులు, పాడి పరిశ్రమలు, ప్రత్యేక పండుగలు, జాతరలు, ఉద్యమాలు, సాహితీవేత్తలు, సంఘ సేవకులు, సాహితీపరమైన రాతప్రతులు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అడవులు, రవాణా సౌకర్యం ఇలా అన్ని విషయాలు ఇందులో చోటు చేసుకుంటాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు.
ఇందుకు సంబంధించి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ మల్లికార్జున్ న్యూస్ 18తో ప్రత్యేకంగా మాట్లాడారు. మన ఊరు మన చరిత్ర కార్యక్రమం ఏ విధంగా ప్రారంభిస్తారు, వాటి ఉద్దేశ్యం ఏమిటో తెలియపరిచే ప్రయత్నం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అద్భుతమని మల్లికార్జున వివరించారు. బ్రిటీష్ కాలంలో ఈ విధాన ప్రక్రియ అమల్లో ఉండేదని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఒక గ్రామానికి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని ఆ గ్రామ నేపథ్యాన్ని చరిత్రను ఆ గ్రామ సంప్రదాయాలని అన్నింటిని తెలుసుకునేందుకు ఇలాంటి విధానాన్ని అమలు పరిచారని తెలిపారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రక్రియ అమలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.
ఒక గ్రామంలో ఆ గ్రామ విశిష్ట , విస్తీర్ణం గతంలో ఆ గ్రామం ఏ విధంగా ఆవిర్భవించింది ఆ గ్రామానికి ఆ పేరు ఏ విధంగా వచ్చింది, అక్కడ జనాభా ఎంత నీటి వనరులు ఎంత ,అక్కడ భూమి ఎలాంటి లక్షణాలను పోలి ఉంటుంది, ఎలాంటి పంటలు అక్కడ పండుతాయి, ఆ గ్రామంలో చారిత్రాత్మక కట్టడాలు ఏమిటి వాటితో పాటుగా ఆ గ్రామంలో ఏ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు, ప్రత్యేక జాతరలు నిర్వహిస్తారో వంటి అంశాలు అన్నింటిని పొందుపరుస్తామని తెలుపుకొచ్చారు.
ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమకు ప్రత్యేకంగా శిక్షణను అందించరున్నారని ప్రొఫెసర్ మల్లికార్జున్ తెలిపారు. శిక్షణ అనంతరం ఒక గ్రామ చరిత్రను ఏ విధంగా పొందుపరచాలి, వాటిని డాక్యుమెంటరీ ఏ విధంగా చేయాలి అన్న అంశాలన్నింటిని పూర్తిస్థాయిలో తమకు ప్రభుత్వం తెలియజేయునుందని చెప్పుకొచ్చారు. ఇంతటి మహత్తర కార్యము వలన భావితరాలకు తెలంగాణ గ్రామాల చరిత్రను అందించే అవకాశం ఉంటుందని వివరించారు. తాము మొదటగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న గ్రామాలను గుర్తించి ఆ గ్రామంలో ఉన్నటువంటి శాసనాలను, ఆ గ్రామంలో ఉన్నటువంటి పురాతన దేవాలయాలను, కట్టడాలను గుర్తించి వాటి పరిశోధనలు మొదలుపెడతామని ప్రొఫెసర్ మల్లికార్జున్ వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక ఐదు గ్రామాలను తీసుకొని వాటి డాక్యుమెంటరీ మొత్తాన్ని ప్రభుత్వానికి అందించి జిల్లాలోని ప్రతి గ్రామంకి సంబంధించినటువంటి అస్తిత్వాన్ని ఆ గ్రామానికి సంబంధించి నేపథ్యాన్ని తెలియపరుస్తామని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana