(N. Naveen Kumar, News18, Nagarkurnool)
మనిషి అభివృద్ధికి ముందడుగు చదువు. చదువు జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది. జీవిత లక్ష్యానికి మొదటి అడుగు పడేది ఆ చదువుతోనే. అటువంటి చదువుకు బీజం వేసేది పాఠశాల. కానీ ఆ పాఠశాలే కనుమరుగవుతుంటే?. ఉన్న ఊరిలో ప్రభుత్వ పాఠశాలను కాదని ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు వెళ్లడం?. సరిగా ఇదే ఆలోచన ఆ గ్రామస్తులకూ వచ్చింది. గ్రామంలోని పెద్దలు, యువకులు చేయిచేయి కలిపి తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తామే అభివృద్ధి చేసుకోవాలని సంకల్పించారు. ఫలితంగా ఆ పాఠశాల ఎంతో సుందరంగా ముస్తాబై, విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తుంది. నాగర్‌కర్నూల్ (nagarKurnool) జిల్లా కల్వకుర్తి మండలం బెక్కెర గ్రామ పాఠశాల (Bekkera school)గురించే మనం చెప్పుకుంటున్నది.
ప్రభుత్వ పాఠశాల కోసం విరాళాల సేకరణ..
బెక్కెర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో (Primary school) కొన్ని రోజుల క్రితం వరకు కనీస సౌకర్యాలు లేవు. పాఠశాలలో సౌకర్యాలు (facilities) లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలని సమీప గ్రామాలు, పట్టణం కేంద్రాల్లోని ప్రైవేటు పాఠశాలలకు పంపించేవారు. ఈ పరిస్థితిని గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు (Head master) రఘురామ రావు, బెక్కెర గ్రామ సర్పంచ్ (Surpanch), స్థానిక యువకులను కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానోపాధ్యాయుడి ఆలోచన నచ్చి గ్రామంలోని యువకులు, స్థానికులు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. పాఠశాలను అభివృద్ధి చేసేందుకు స్కూల్ డెవలప్మెంట్ కమిటీని (ఎస్.డి.సి) ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ద్వారా దాతల నుంచి విరాళాలు సేకరించి స్కూల్ అభివృద్ధి పనులు చేపట్టారు. స్కూల్‌లో విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి వరకు రూ. 7 లక్షల వరకు ఖర్చు వచ్చిందని ప్రధానోపాధ్యాయులు రఘురామ రావు తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సకల సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.
పాఠశాల చిన్నదే, కానీ సంకల్పం పెద్దది..
దాదాపు నాలుగు ఏళ్ల పాటు శ్రమించి బడికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. తమ ఊరిలో ప్రాథమిక విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలను తలపించేలా పాఠశాలని తీర్చిదిద్దారు. బెక్కెర గ్రామం చాలా చిన్నది. చదువుకునే విద్యార్థులు తక్కువే. వారిలోనూ ప్రాథమిక విద్యనభ్యసించేవారే ఎక్కువగా ఉన్నారు. గ్రామంలోని పాఠశాల అధునాతన హంగులతో తీర్చిదిద్దడంతో క్రమంగా విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలకు రావడం మొదలుపెట్టారు. ప్రస్తుతం బెక్కార ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లు ఉన్నారు. ప్రాధమిక విద్య కోసం విద్యార్థులు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లడం చూసి, ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నట్టు ప్రధానోపాధ్యాయులు రఘురామ రావు వివరించారు. ఇందుకోసం గ్రామ సర్పంచ్, గ్రామంలోని యువకులు ఎంతో శ్రమించారని చెప్పారు.
బెక్కెర పాఠశాలలో సదుపాయాలు.. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు:
2. రూ.40,000లతో కంప్యూటర్, ప్రింటర్ అందించిన గ్రామ యువకులు.
3. రూ.35,000లతో వాల్ పెయింటింగ్ వేయించిన గ్రామ సర్పంచ్,. యువకులు.
4. రూ.55,000లతో డిజిటల్ పాఠాలు బోధించడానికి ప్రొజెక్టర్, టి.వి, సన్ డైరెక్ట్ అందించిన గ్రామ యువకులు.
5. రూ. 60,000తో టేబుల్స్, కుర్చీలు , ఫర్నీచర్ అందించిన గ్రామ వార్డు సభ్యులు.
6. రూ.27,000లతో స్పోర్ట్స్ డ్రెస్, షూస్, స్కూల్ డెవలప్మెంట్ కమిటీ వారిచే.
7. రూ.25,000లతో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన మాధవాచారి.
8. రూ.30,000లతో ప్రహరీ గోడ మరమ్మత్తు పనులు పూర్తి చేసిన సర్పంచ్.
9. రూ.70,000లతో ఔట్ డోర్ ఎక్విప్మెంట్ అందించిన SDC సభ్యులు.
10. రూ. 50,000లతో ప్రతీరోజూ అల్పాహారం అందించే ఏర్పాటు చేసిన సర్పంచ్, యువకులు.
11. రూ. 20,000లతో పాఠశాల వంట సామాగ్రి అందించిన జంగమ్మ
12. రూ.20,000 నోటు పుస్తకాల పంపిణీ చేసిన హైదరాబాద్ కు చెందిన SS Publishers
13. రూ. 10000లతో వాటర్ ట్యాంక్ నిర్మించిన గ్రామస్తులు (తిరుపతయ్య)
14. రూ. 30,000లతో సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు.
15. రూ.10,000లతో క్రికెట్ కిట్, స్పోర్ట్స్ ఐటమ్స్ అందించిన సాయిబాబు, రాజేందర్ రెడ్డి
16. ప్రతీ సంవత్సరం దాతలచే ఉత్తమ విద్యార్థులకు నగదు బహుమతి రూ.5000.
17. రూ.10,000లతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ అందించిన శాంతయ్య , రాజేందర్ రెడ్డి
18)రూ.8000లతో విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేసిన రవీందర్ రెడ్డి.
ఇలా పలు కార్యక్రమాలకు దాతల సహకారంతో దాదాపు రూ. 7 లక్షల విరాళాల రూపంలో అందగా, బెక్కెర ప్రాథమిక పాఠశాల నేడు ఎంతో సుందరంగా, ఆదర్శంగా రూపుదిద్దుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, School