Naveen Kumar, News18, Nagarkurnool
వనపర్తి జిల్లా (Vanaparthy) కేంద్రంలో కూరగాయల మార్కెట్లు పనులు పూర్తి కాకపోవడంతో అటు సామాన్యలకు ఇటు కూరగాయల వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు వనపర్తి కలెక్టర్ శ్వేతా మహంతి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) మొదలు పెట్టినప్పటికీ ఈ రెండు నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. బిల్లులు మంజూరు కాకపోవడంతో కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు నిలిపివేశారు. దీంతో జిల్లా ఏర్పడి అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నా వనపర్తి పట్టణానికికూరగాయల మార్కెట్ లేకుండా పోతుంది. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి వాడుకలోకి కూరగాయల మార్కెట్లను తీసుకురావాలని ప్రజల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక్కటంటే ఒక్కటి కూడా కూరగాయల మార్కెట్ లేకపోవడంతో అటు వ్యాపారులకు ఇటు వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. వనపర్తి జిల్లా ఏర్పడ్డాక మొట్టమొదటి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి 2018లో మార్కెట్ నిర్మాణానికి నడుంబిగించారు.
గాంధీ చౌక్ ప్రాంతంలో 16, 21 వార్డులను అనుసరించి ఉన్న సంస్థానాధిషుల కాలంనాటి కందకం ప్రాంతం వృధాగా ఉండడంతో దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ భావించారు. వెంటనే కందకంలోని అక్రమణాల తొలగించి కోటి 26 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి కూరగాయల మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదట 23 షాపుల నిర్మించారు. పనులు జరుగుతూఉండగా కలెక్టర్ బదిలీ కావడంతో మార్కెట్ ప్రారంభానికి నోచుకోలేదు.
అయితే వ్యవసాయం మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కందకం ప్రాంతాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలని గాంధీచౌక్ నుంచి మారెమ్మ కుంట వరకు కూరగాయల మార్కెట్ తో పాటు మాంసం దుకాణాలను సైతం ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. 2021లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మొత్తం 143 షాపులు నిర్మించాల్సి ఉండగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పిల్లర్ల దశ వరకు పనులు పూర్తి చేసి బిల్లులు రాలేదని పనులు అర్ధాంతరంగా నిలిపివేశాడు. దీంతో కందకంలో నిర్మించ తలపెట్టిన మార్కెట్ కథ కంచికి చేరినట్లుగా అయింది.
గతంలో నిర్మించిన షెడ్లు వృధాగా మారడంతో మందుబాబులకు అడ్డాగా మారి అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు మొదలై మళ్లీ మొదటికే చేరింది. కూరగాయలు విక్రయించే వ్యాపారులు యధావిధిగా రోడ్లపైనే అమ్మకాలు చేపడుతుండడంతో పట్టణ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులను తట్టుకుంటూ కూరగాయలు కొనడానికి తిప్పలు పడుతున్నారు. కందకం మార్కెట్ కథ ఇలా అర్ధాంతరంగా నిలిచిపోగా నూతనంగా మరో ఐదు కోట్ల నిధులతో వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టారు.
అయితే కందకంలో చేపట్టిన మార్కెట్ పనులు సైతం పూర్తి చేస్తే సగం పట్టణానికి ఆ మార్కెట్ ఉపయోగపడగా కొత్త బస్టాండ్ వద్ద చేపట్టిన నూతన మార్కెట్లో మరో సగం నగరానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ అంశంపై వనపర్తి మున్సిపల్ ఇంజనీరింగ్ వివరణ కోరగా కందకం ప్రాంతంలో చేపట్టిన కూరగాయల మార్కెట్ పనులు బిల్లులు రాలేదని కాంట్రాక్టర్ నిలిపివేశాడని సమాధానం ఇచ్చారు. అయితే సదరు పనులను కొనసాగించి పనులు పూర్తి చేయడానికి వేరే నిధులను మళ్లించి నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని త్వరలోనే కందకంలో సైతం కూరగాయల మార్కెట్ పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తామని వివరణ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkurnool, Telangana