(N.Naveen Kumar,News18,Nagarkurnool)
మా ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ అచ్చంపేట (Achampet)నియోజకవర్గం ప్రజలు, రాజకీయ నాయకులు పత్రిక సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేస్తున్నారు. గత 45 రోజులుగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju)కనిపించడం లేదని ప్రతిపక్ష నాయకులతో పాటు కొంతమంది ప్రజాసంఘాల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రూ 100 కోట్లకు అమ్ముడు పోలేదని కనకాల మైసమ్మ (Kanakala Maisamma)దగ్గర తడి బట్టలతో స్నానం చేసి మీడియా సాక్షిగా ఒప్పుకుంటేనే అచ్చంపేట ప్రజలు గువ్వల బాలరాజును నమ్ముతారని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ(Vamsi Krishna)సవాల్ విసిరారు.
మా ఎమ్మెల్యే కనిపించడం లేదు..
కోట్ల రూపాయలకు అముడిపోయిన ఆ నలుగురు ప్రజాప్రతినిధులు కేసిఆర్ జైల్లో తలదాచుకున్నారని ఆరోపించారు. ప్రజలంతా ఈ ఫామ్ హౌస్ బాగోతం గురించే ఆలోచిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గత 45 రోజులుగా నియోజకవర్గంలో పర్యటనలు చేయకపోవడం వల్ల ప్రజలు తమ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియడం లేదని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని వంగూరు ఉప్పునుంతల మండలాల సరిహద్దులో ఉన్న మొలగర, ఉల్పర గ్రామాల మధ్య ఉన్న కాజ్వే పూర్తిగా ధ్వంసం కావడంతో 95 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకొచ్చారు.
ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు..
ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతున్న ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించకుండా ఎటు వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. నల్లమల అడవి ప్రాంతంలో పలుచోట్ల గుప్తనిధుల తవ్వకాల్లో స్థానిక ఎమ్మెల్యే హస్తము ఉందని ఆయన అనుచరులు గుట్ట నిధులు తవ్వకాలు కొనసాగిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. భూకబ్జాల గురించి ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫామ్ హౌస్ వ్యవహారంలో ప్రభుత్వం కేటాయించిన గన్మెన్లు ఎక్కడ ఉన్నారని, డ్రైవర్ ఎందుకు రాలేదని, ఇతరుల వాహనంలో స్వయంగా నడుపుకుంటూ వెళ్ళడానికి కారణాలు ఏమిటని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఎన్నో డౌట్స్ ..
ఫార్మ్ హౌస్ విషయం జరిగేందుకు నెల రోజుల ముందు నుంచి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కనిపించకుండా పోయాడని దీనివల్ల అచ్చంపేట ప్రజలు అతనిపై ఎన్నో సందేహాలు పెట్టుకున్నారని ఆరోపించారు. వీటిని నివృత్తి చేసిన తర్వాతనే దైవ సాక్షిగా ప్రమాణాలు చేసి నియోజకవర్గంలో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి నియోజకవర్గానికి మచ్చ తెచ్చేలా అమ్ముడుపోయేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీరు సరికాదని అన్నారు.
హామీల సంగతేంటి..
సీఎం కేసీఆర్ హామీలైన నీళ్లు, నియామకాలు ఎక్కడ అమలు కాలేదని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ వివరించారు. అతివృష్టి కారణంగా పత్తి పంట చేతికందగా రైతులు ఇబ్బంది పడుతున్న కాజ్వేల్ లేక ప్రయాణాలు కొనసాగకపోతున్న ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను పట్టించుకోకుండా నియోజకవర్గాన్ని లెక్కచేయకుండా ఎలాంటి పర్యటనలు కొనసాగించడం లేదని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagar kurnool, Telangana News