Home /News /telangana /

NAGAR KURNOOL TRAFFIC POLICE KRISHNA SAGAR OF WANAPARTHY DISTRICT IS ALSO VOLUNTEERING TO CATCH SNAKES ABH BRV NNK

Nagarkurnool: ఈ పోలీసు పాములను పడతాడు: ఇప్పటి వరకు 6,638 పాములు పట్టిన హోంగార్డు

పాములను

పాములను పట్టుకున్న పోలీసు కృష్ణ సాగర్

సాధారణంగా పోలీసులు అంటేనే ప్రజలను రక్షణ నిమిత్తం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంటారు. అలాంటిది ప్రజల రక్షణతో పాటు పాముల రక్షణ కూడా చేపడుతున్నాడు ఓ పోలీసు. హోంగార్డ్ ఉద్యోగం చేస్తున్న కృష్ణ సాగర్ తదైన రీతిలో పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India
    (N.Naveen Kumar, News 18, NagarKurnool)

    సాధారణంగా పోలీసులు అంటేనే ప్రజలను రక్షణ నిమిత్తం శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంటారు. అలాంటిది ప్రజల రక్షణతో పాటు పాముల రక్షణ కూడా చేపడుతున్నాడు ఓ పోలీసు. పోలీస్ శాఖలో ఓ చిన్నపాటి హోంగార్డ్ ఉద్యోగం చేస్తున్న కృష్ణ సాగర్ తదైన రీతిలో పర్యావరణ పరిరక్షణ చేపడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ నియంత్రణలో తలమునకలయ్యే కృష్ణ సాగర్.. ఓ పక్క విధులు నిర్వహిస్తూనే మరోవైపు పాములను పట్టుకుంటూ ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్నారు. తన సొంత ఖర్చులతో స్నేక్ సొసైటీ ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ కూడా ఇస్తున్న కృష్ణ సాగర్ పాములను పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణ దిశగా కూడా కృషి చేస్తున్నారు.

    వనపర్తి జిల్లాకు చెందిన కృష్ణ సాగర్ వృత్తి రీత్యా ట్రాఫిక్ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్నారు. తండ్రి వ్యవసాయంలో చేదోడువాదోడుగా కూడా ఉంటున్నారు. ఈక్రమంలో కృష్ణ సాగర్ నివసిస్తున్న గ్రామంలో పలుమార్లు పాముల సంచారం గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. ఇక ఒకానొక సమయంలో తానే పాము కాటు భారిన పడ్డ కృష్ణ సాగర్.. అనంతరం పాములను పట్టుకోవడంపై దృష్టిసారించారు. మూగజీవాలను రక్షిస్తు స్నేక్ సొసైటీ స్థాపించారు కృష్ణ సాగర్. కొంతమంది యువకులతో కలిసి మూగజీవాలను కాపాడి సొంత ఖర్చులతో వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లి విడిచి పెడుతున్నారు.



    కృష్ణ సాగర్ ఇప్పటి వరకు 17 రకాలకు చెందిన 6,638 పాములను పట్టి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఎక్కడైనా పాము కనిపిస్తే వెంటనే హోంగార్డు కృష్ణసాగర్‌కు సమాచారం అందిస్తే క్షణాల్లో అక్కడికి చేరుకొని పామును పట్టుకుంటారు. పాములు పట్టినందుకు గానూ ఆ ఇంటి యజమానితో విధిగా మూడేసి మొక్కలు నాటించడం ఆయనకు అలవాటుగా మారింది. దీంతో అటు మూగజీవాల పరిరక్షణ చేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

    పాముకాటుకు గురైన కృష్ణ సాగర్: 9 సంవత్సరాల క్రితం ఒక రోజు తమ పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న తల్లిదండ్రులకు మధ్యాహ్న సమయంలో భోజనం తీసుకుని వెళుతుండగా పరిసర ప్రాంతాల్లో పాము కనబడింది . అదేమైనా హాని చేస్తుందనే ఉద్దేశంతో పాములను చంపే ప్రయత్నం చేసాడు. ఆ క్రమంలో పాము కాటుకు గురయ్యాడు కృష్ణ సాగర్. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా...పాము కాటును గుర్తించలేని వైద్యులు విషం పాము కరిచిందని భావించి విషం విరుగుడుకు ఇంజక్షన్ (Anti Venom) ఇచ్చారు. అది వికటించడంతో దాదాపు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు కృష్ణ సాగర్. వెంటనే విరుగుడు ఇంజక్షన్ ఇచ్చిన వైద్యులు 48 గంటలు పర్యవేక్షణలో ఉంచగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ స్వీయానుభవంతో పాములపై కొంత అధ్యయనం చేసిన కృష్ణ సాగర్ పాముల జోలికి పోకుండా ఉంటే మనుషులకు ఎలాంటి హాని జరగదని తెలుసుకున్నాడు. అప్పటినుంచి ప్రజలకు పాముల్లో విషపూరిత రహితం కానిది ఏమిటో అవగాహన కల్పిస్తున్నారు.

    పాములను సంరక్షిస్తున్న కృష్ణ సాగర్... ఇతర వన్యప్రాణులను సంరక్షిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఏదొక సందర్భంలో గాయపడిన జంతువులకు తన నివాసంలోనే వైద్యం అందించి గాయం మానిన తర్వాత వాటిని సురక్షిత అటవీ ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా కొందరు ఉత్సాహవంతమైన యువకులతో కలిసి "సాగర్ స్నేక్ సొసైటీ" ఏర్పాటు చేసి వారికి అన్ని రకాలుగా అవగాహనతో కూడిన శిక్షణ ఇచ్చారు. తాను అందుబాటులో లేని సమయంలో సుశిక్షితులైన యువకులను పంపించి పాములను పట్టించి అటవీ ప్రాంతంలో వదిలివేస్తున్నారు. కొండచిలువలు, నెమళ్లు, గుడ్లగూబలతో పాటు వివిధ రకాలైన పక్షులను రక్షించారు. జూరాల ప్రాజెక్టులలో ముసళ్ళను, కొండచిలువలను, పాములను పట్టుకొని శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో, తిరుమలయ్య గుట్ట, బుద్ధారం అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు.

    సాగర్‌కు పలు అవార్డులు: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేస్తున్నందుకు పలు అవార్డులు కూడా అందుకున్నారు సాగర్. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ శ్వేతా మహంతి, ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఫైవ్ స్టార్ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాష్ట్ర "సేవా రత్న 2020" అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.

    Krishna Sagar, Snake Society, Wanaparthy +919985545526

    Read This; Peddapalli: బీ అలెర్ట్​.. వీధి కుక్కలకు వింత రోగాలు: మనుషులకు వ్యాపిస్తుందా? 
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Local News, Nagarkurnool, Telangana

    తదుపరి వార్తలు