(N.Naveen Kumar, News18, Nagarkurnool)
అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. విధి నిర్వహణలో, ప్రజల రక్షణ కోసం పనిచేస్తూ అమరులైన పోలీసులను తలుచుకుంటూ తోటి సిబ్బంది నివాళులర్పించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని పోలీసులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరులను తలచుకుని వారి సేవలను కొనియాడారు. అమరులైన కుటుంబ సభ్యులను సత్కరించుకొని నివాళులు అర్పించారు. అయితే విధి నిర్వహణలోపోలీసులతో పాటు చనిపోయిన ఓ ప్రైవేట్ డ్రైవర్ కుటుంబం మాత్రం ఇప్పటికీ కన్నీరు మున్నీరుగా వినిపిస్తూనే ఉంది. 27 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీసు కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ గోడును న్యూస్ 18 తో చెప్పుకొచ్చారు.
Read This : Nagar Kurnool: బంతి పూల సాగు భలే బాగు.., సీజన్లో ఆశించిన లాభాలు వస్తాయంటున్న రైతులు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిల పరిసర ప్రాంతాల్లో 27 ఏళ్ల క్రితం మావోయిస్ట్‌లు జరిపిన దాడి దేశ వ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఐపీఎస్ ఆఫీసర్ పరదేశి నాయుడు ప్రయాణిస్తున్న బస్సును మావోయిస్ట్‌లు మందుపాతర పెట్టి పేల్చి వేశారు. ఈ ఘటనలో ఎస్పీ పరదేశి నాయుడుతో పాటు ఇద్దరు పోలీస్ అధికారులు, ఒక ప్రైవేట్ డ్రైవర్ శాలిపాషా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అమరులైన పోలీసు అధికారుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకున్నపటికీ ప్రైవేట్ డ్రైవర్ కుటుంబానికి ఇచ్చిన హామీలు ఇంత వరకు నెరవేర్చలేదు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం తరఫున ఆ కుటుంబానికి రావలసినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ అందలేదని శాలీపాషా భార్య బిపాషా కన్నీరు మున్నీరవుతున్నారు.
Read This : ఈ ఒక్క నర్సరీ నుంచే హరితహారానికి లక్ష మొక్కలు.. ఎక్కడో తెలుసా?
ప్రతి ఏటా అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి వచ్చి అధికారుల వద్ద తమ గోడును వెలబోసుకుంటున్నా పట్టించుకున్న నాధుడే లేడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. శాలిపాషా మరణించిన సమయంలో 110 గజాల ఫ్లాట్ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వం చేతులు దులుపుకుందని చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదని బాధితులు గోడు వెళ్ళబోసుకున్నారు. తమ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాన్ని కల్పిస్తామని, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి సహాయం అందించలేదని చెప్పుకొచ్చారు. అప్పటి ఎస్పీ పరదేశి నాయుడు వెంట డ్రైవర్‌గా వెళ్లిన శాలిపాషా మృతిని తలుచుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు.
మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి కొల్లాపూర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు ఐపీఎస్ ఆఫీసర్ పరదేశి నాయుడు డిపార్ట్మెంట్ వాహనాన్ని కాకుండా ప్రైవేట్ వాహనంలో కొల్లాపూర్ ప్రాంతంలోని సోమశిల దగ్గరికి వెళ్లాడు. ప్రైవేట్ బస్సులో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో శాలిపాషా ఒకడు. శాలిపాషాను తమ వెంట తీసుకువెళ్లిన పోలీసులు దురదృష్టవశాత్తు మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు బలయ్యారు. పోలీసు అమరవీరులందరినీ ఆదుకున్న ప్రభుత్వం తమను మాత్రం పట్టించుకోవడం లేదని శాలిపాషా భార్య బిపాషా ఆవేదన వ్యక్తం చేసింది. ముగ్గురు పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు తమ హామీలను నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలనీ బాధితులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.