Naveen Kumar, News18, Nagarkurnool
పేద విద్యార్థులు కష్టాల్లో ఉన్నారంటే చాలు వెంటనే ఆయన అక్కడ వాలిపోతారు. ఆ విద్యార్థులు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలు, దుస్తులు, ఇతర అవసరాలను తీరుస్తారు. ఇలా 30 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు తనకు తోచిన సహాయం చేస్తున్నాడు బిఎస్ఎన్ఎల్ నరసింహారావు. 1984లో బిఎస్ఎన్ఎల్ (BSNL) ఉద్యోగిగా చేరిన నరసింహారావు తాను ఉద్యోగంలో చేరిన ఐదు సంవత్సరాల తర్వాత 1989 నుంచి సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పదవీ విరమణ పొందినా కానీ తనకు శక్తి మేర సాయం చేస్తూ వస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) తెలకపల్లి మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన నరసింహరావు బాల్యమంతా కడుపేదరికంలో కొనసాగింది. చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
తల్లిదండ్రులు నిరుపేదలు కావడం, చదువుకోవాలని ఉన్నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పెద్ద చదువులు చదవలేక పోవడం నరసింహారావుకు వెలితిగా అనిపించింది. బంధువుల సహాయంతో స్నేహితుల సాయంతో పదోతరగతి వరకు చదివి బిఎస్ఎన్ఎల్‌లో ఉద్యోగాన్ని సాధించాడు.
ఉద్యోగంలో చేరిన తర్వాత చదువు కొనసాగించారు. పేదరికం వలన తాను పడినటువంటి ఇబ్బందులను ఏ విద్యార్థి కూడా పడకూడదనే ఉద్దేశంతో తన వేతనంలో నుంచి ప్రతి నెలా సగం సొమ్మును పేద విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఇస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో దాదాపుగా ఇప్పటివరకు 2000 మంది విద్యార్థులకు ఆయన ఏదో రకంగా సాయం చేస్తూ వచ్చాడు.
విద్యార్థులకు కావలసిన పుస్తకాలు, బ్యాగులు వంటివి అందించడంతోపాటు పరీక్ష ఫీజులు కట్టడం, ఇతర ఆర్థిక సమస్యలు ఉన్నా తన శక్తి మేర ఆదుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు నరసింహారావు. వీటితో పాటు ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన మేరకు మౌలిక సదుపాయాలు (మంచినీటి వసతి, షెడ్లు, కుర్చీలు, బెంచీలు,) కూడా అందిస్తూ వస్తున్నాడు.
నేటికీ ఆయన సేవలు పేద విద్యార్థుల కోసం కొనసాగిస్తూనే ఉన్నారు. నరసింహారావు సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా అందించింది. బిఎస్ఎన్ఎల్ పేరుని ఇంటిపేరుగా మార్చుకొని నరసింహారావు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వీటితో పాటు తనకు ఎంతో పట్టున్నటువంటి సైన్స్ సబ్జెక్టును స్థానిక విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఉచితంగా తరగతులను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు వివిధ రకాల ఆటల పోటీలను, ఉపన్యాసాల పోటీలను నిర్వహిస్తున్నారు. ఈయనను గుర్తించని పేద విద్యార్థులు లేదంటే అతిశయోక్తి కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana