(N. Naveen Kumar, News18, Nagarkurnool)
నాగర్‌కర్నూల్ (NagarKurnool) జిల్లాలోని లింగాల (Lingala) అంటేనే నాడు చరిత్రకెక్కిన తెలంగాణ పల్లె. నైజాం (Nizam) నవాబులు నిరంకుశ పాలనలకు వేదికగా మారింది. దొంగతనాలకు పాల్పడిన వారిని లింగాలలో బంధించేవారు నవాబులు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో స్టువర్టుపురం, కప్పరాలతిప్పకు ఎలాంటి పేరు ఉండేదో తెలంగాణలో లింగాల అలాగే. నిజాం కాలంలో కర్ణాటక (Karnataka) ప్రాంతంలోని గుల్బర్గా, రాయచూరు, బళ్లారి ప్రాంతాలలో ఎరుకల దారి దోపిడి (Theft) అధికంగా ఉండేది. నిజాం పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Usman Ali Khan) వీరి అరాచకాలను అరికట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వీరి ఆగడాలను అరికట్టడానికి ఆయన దగ్గర ఐజిగా పనిచేస్తున్న ఇకీంసాబ్కు అప్పగించారు.
దండన కంటే పాపబీతి, దైవ చింతన వీరిని మార్చగలదని..
దొంగల్లో (Thieves) పరివర్తన తేవాలని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్న ఎరుకలందరినీ ఒకచోట ఉంచే ప్రయత్నం చేశారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడే వారిని లింగాలకు తీసుకువచ్చి వారిలో మార్పునకు ప్రయత్నించారు నవాబులు. దొంగల కోసం ఒక జైలును నిర్మించారు. ఎన్ని కఠోరమైన శిక్షలు విధించినా వారిలో మార్పు రాకపోవడంతో దండన కంటే పాపబీతి, దైవ చింతన వీరిని మార్చగలదని భావించిన ఇకింసాబ్.. నల్లమల అటవీ (Nallamala Forest) ప్రాంతాన్ని ఎంచుకొని ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి లింగాలగా నామకరణం చేసినట్లు అప్పటి చరిత్ర తెలిసిన కొందరు చెబుతున్నారు. మార్పునకు చేసిన ప్రయత్నాలు దొంగల పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. వీరిని ఊరికే కూర్చోబెట్టడం మంచిది కాదని భావించి సాగుకు వ్యవసాయ భూములు (Agricultural land) ఇప్పించి పని కల్పించారు.
అనుమానం వచ్చి లింగాల మీద గట్టి నిఘా కూడా ఏర్పాటు చేశారు. లింగాల ప్రాంతంలో వందలాది మంది పోలీసులను నియమించారు. ఈ ప్రాంతంలో అప్పట్లో ఎస్పీ, సీఐలు, ఎస్ఐలు వందలాదిమంది పోలీసులు పనిచేశారు. 1917లో పోలీస్ స్టేషన్, 1924లో ఇన్స్పెక్టర్ బంగ్లా, 1927లో ఎస్పీ కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొదటి పోస్ట్ ఆఫీస్‌గా ఈ లింగాల పోస్ట్ ఆఫీస్‌ను చెప్పుకుంటారు. ఆనాటి ఎస్పీ కార్యాలయంలో నేడు జడ్పీహెచ్ఎస్ కొనసాగుతుంది. నిజాం కళాశాల భవనంలోని పోస్ట్ ఆఫీస్ కొనసాగుతుంది. స్వాతంత్ర ఉద్యమం అనంతరం 1965లో సెటిల్మెంట్ రద్దయింది. 1957లో పంచాయతీగా లింగాల ప్రాంతాన్ని గుర్తించారు.
ప్రస్తుతం లింగాల: నిజాం కాలంలో లింగాలలో నిర్బంధ విద్య ప్రవేశపెట్టడంతో దొంగల తలరాతనే ఇది మార్చేసింది. పిల్లల కోసం ప్రత్యేకంగా వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లింగాల మేజర్ పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. జనాభా 12,522 కాగా ఇందులో పురుషులు 6,745, మహిళలు 5,777 ఉన్నారు. గ్రామ అక్షరాస్యత 74 శాతానికి నమోదు అయింది. వివిధ రంగాల్లో 500 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 50 మందికి పైగా డాక్టర్లు ఉన్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ మొదలుకొని డిఎస్పి వరకు ఈ మండలం నుంచి పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా, బ్యాంకు మేనేజర్లుగా, వ్యవసాయ శాఖ , అటవీశాఖ, వైద్య ఆరోగ్యశాఖలో కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Local News, Nagarkurnool, Theft